మరో బృహత్తర సంకల్పం

Sat,August 17, 2019 12:16 AM

తెలంగాణ పల్లెలు, పట్టణాలు దేశంలోనే ఆదర్శ ఆవాస ప్రాంతాలుగా మారాలనే స్థూల లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించింది. 60 రోజుల తర్వాత ఏ గ్రామానికి వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా అవి అద్దంలా కళకళలాడాలని, పచ్చదనం వెల్లివిరియాలని ఆశిస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం పెంచడంతో పాటు, భవిష్యత్తులో వాటిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలు కూడా ఈ 60 రోజుల్లోనే రూపొందించుకోవాలి.

Gatika
ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ మొదలు మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. ఐదేండ్లలో మిషన్ భగీరథ పూర్తిచేసి సురక్షిత మంచినీళ్లివ్వడం.. ఇలా నిర్ణీత కాలవ్యవధిలోనే అనేక భారీ లక్ష్యాలు పూర్తి చేసి తెలంగాణ దేశాని కి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం శీఘ్రగతిన అభివృద్ధి చెందకపోవడానికి, అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉండటానికి, అవినీతి ప్రబలడానికి విపరీతమైన కాలయాపన (రెడ్ టేపిజం) ప్రధాన కారణమని పరిపాలనా వ్యవహారాల నిపుణులు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం రెడ్ టేపిజాన్ని తగ్గించడానికి, ప్రజలకు సత్వర ఫలితాలు అందించడానికి చేసిన అనేక ప్రయత్నాలు సత్ఫలితాలను అందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ క్రమపద్ధ తి ప్రకారం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ముందుగానే ఖరారుచేసి, అధికార యంత్రాంగాన్ని పనిలోకి దింపడంవల్ల విజయాలు సాధ్యమయ్యాయి. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం ఇప్పుడు పల్లెలు, పట్టణాలకు 60 రోజుల ప్రత్యేక కార్యాచరణను సూచిస్తున్నది. ఈ 60 రోజుల్లోనే గ్రామా లు, నగరాల్లో సమూల మార్పులు రావాలని, దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు మార్గం పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు.

గ్రామ పంచాయతీలు, పట్టణాలకు కర్తవ్యబోధ చేయడానికి ముందే, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి, కొత్త జిల్లాలు మొదలు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ శాఖను పునర్వ్యవస్థీకరించింది. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున డి.ఎల్.పి.ఓ. పోస్టును, ప్రతీ మండలానికి ఒకరు చొప్పున ఎంపి ఓ పోస్టులను కొత్తగా సృష్టించింది. పంచాయతీరాజ్ శాఖలో గ్రామకార్యదర్శి నుంచి సీఇవో వరకు అన్నిపోస్టులను శరవేగంగా భర్తీ చేస్తున్నది. స్థానికసంస్థలకు నిధులు విడుదల చేసే విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నది. 2011జనాభా లెక్కల ప్రకారం కేం ద్ర ఆర్థికసంఘం ఎంత నిధులిస్తే, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి, స్థానిక సంస్థలకు అందివ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఏడాదికి 1,628 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. దానికి సమానం గా, అంటే రూ.1,628 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ రెండు కలిపి 3,256 కోట్లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుం ది. తెలంగాణలోని 2.02 కోట్ల గ్రామీణ జనాభాకు ఒక్కొక్కరికి తలసరి 1,606 రూపాయల చొప్పున నిధులు సమకూరుతాయి. రాష్ట్రంలో 15,735 జనాభాతో అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న ఖమ్మం జిల్లా కల్లూరుకు అత్యధికంగా రూ.2.52 కోట్ల నిధులు వస్తాయి. కేవలం 107 మంది మాత్రమే నివసించే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొంగతోగు గ్రామానికి రూ.2.87 లక్షల నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన చిన్న గ్రామాలకు కూడా రూ.8.03 లక్షల నిధులు సమకూరుతాయి.

ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. కేంద్రం రూ.1,038 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,038 కోట్లు, మొత్తం 2,076 కోట్లు మున్సిపాలిటీలకు అందుతాయి. 1.45 కోట్ల పట్టణ జనా భా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్క పట్టణ పౌరుడికి సగటున రూ.976 రూపాయల చొప్పున నిధులు వస్తాయి. రాష్ట్రంలో 67.39 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన హైదరాబాద్‌కు 657 కోట్లు, 10,029 జనాభా కలిగిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీకి 97.88 లక్షల నిధులు సమకూరుతాయి. ఈ నిధులను ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో కేటాయించింది. 60 రోజుల ప్రణాళిక అమలుకు ముందే ఈ నిధులను ఆయా స్థానికసంస్థలకు విడుదల చేయడాని కి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం కూడా తీసుకున్నది. ఏదైనా కారణాల వల్ల కొద్దిపాటి నిధులు మిగిలిపోతే, ఆ నిధులను మరుసటి ఏడాది నిధులకు కలుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికసంఘం నిధులతో పాటు నరేగా నిధులు, పన్నుల ద్వారా, సర్టిఫికెట్లు, అనుమతుల జారీ ద్వారా వచ్చే ఆదాయం కూడా స్థానిక సంస్థలకుంటుంది.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ఇప్పుడు మోయలేని భారం కూడా ఏమీ లేదు. విద్యుత్, వైద్యం, విద్య, సాగునీరు, తాగునీరు, రహదారులు, పౌరసరఫరాలు, గృహ నిర్మాణం తదితర రంగాల్లో ప్రభుత్వమే తన శాఖల ద్వారా పనులు చేస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం, వీధి దీపా ల నిర్వహణ, పన్నుల వసూ లు తదితర క్షేత్రస్థాయి విధు లు స్థానిక సంస్థలు నిర్వర్తించాల్సి ఉంటుంది.తెలంగాణ పల్లెలు, పట్టణా లు దేశంలోనే ఆదర్శ ఆవాస ప్రాంతాలుగా మారాలనే స్థూల లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించింది. 60 రోజుల తర్వాత ఏ గ్రామానికి వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా అవి అద్దంలా కళకళలాడాలని, పచ్చదనం వెల్లివిరియాలని ఆశిస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం పెంచడంతో పాటు, భవిష్యత్తులో వాటిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలు కూడా ఈ 60 రోజుల్లోనే రూపొందించుకోవాలి. ఈ 60 రోజుల్లోనే పవర్ వీక్ నిర్వహించి, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి.

ఏ పని చేయాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో, స్థానిక సంస్థ ల ప్రజాప్రతినిధులు తమవి కాని, తాము చేయలేని పనులను కూడా తమ మీదనే వేసుకుంటున్నారు. నేల విడిచి సాము చేస్తున్నారు. ఏ పనీ పూర్తి చేయలేక అభాసుపాలవుతున్నారు. ఈ ధోరణి పూర్తిగా తొలిగిపోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిర్దేశించిన పనులను నెరవేర్చే విషయంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవస రం. స్థానిక సంస్థలలో కో ఆప్షన్ సభ్యులను, ప్రజా సంఘాలను, స్థాయీ సంఘాలను, గ్రామసభను తప్పనిసరి చేసిన విధానం ప్రజా భాగస్వా మ్యం పెంచడానికే. మనిషి కేంద్రంగా ఆలోచించి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రభుత్వం అండగా నిలిచినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే సమాజమే పురోగమిస్తుంది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి అలాంటి గొప్ప అవకాశం కలిగింది.

288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles