అచింత్యం

Mon,August 19, 2019 01:17 AM

సెరువంతా అమ్మగల్లాడి
ఒడ్డు ఒడిలో నిద్రబోతే
పున్నమి ఈని రేలగంధం రాసింది!
నీటి మీన అల
నీలి సవరించుకుంటున్న వోణి
కార్తి కాకపోయిన కోనేటి మూలన
ఆమె కోసం పూసిన చెట్లు..
చెరువు మీన వల ఇసిరితే
నాత్రి నామీద కల ఇసిరింది
చెరువ నాత్రి రెండు చెరువులే
ఆదమరిచి నిద్రబోయిన
పూర్వపు నీడల్ని
పలకరిస్తున్న నా నీడను జూసి
లేశి కుసున్నా
గుండ్లు తెంపుకొని నాను నమిలి
కాళ్ళ కడియాలని కరిగించుకొని
కాలం తప్పించుకుంటే
గోపమ్మ అవ్వ గోలకు
పెద్దబోయి నీడ లేచి కూసుంది!
చెరువు కరువు మధ్య
పరువు నీడలయ్యింది
ఎన్ని నాత్రులను దుస్సినా
ముచ్చట బంతియో ఇది!
ఏడుగడ్డల కులం ఎత్తికడితే
పేనుకున్న మనో పోసలకూ
ఉరిపడ్డ అంతరం
ఎన్ని కొలువులో ఎన్ని శిగాలో
లోన పగిలిన ఎక్కిల్ల పుట్ట!
బూడిద ఎత్తిపోసుకున్న దరిమీన
ఎవడి బొమ్మ ముగ్గో
యదచీల్చి నవ్వుతుంది..!
ఏ రెక్కల పక్క నుంచో
ఏ అడుగుల కింది నుంచో
మట్టి నీళ్లు మళ్లిపోయినవో కాని
బోరబోరకు నాటుకుంటిమి!
యెద చెమ్మలే పారి పారి
మళ్ళీ చెరువయింది కదా బోయ
ఎన్ని కనులు పరిచిన
గడియగడియ సీకటిజనే..
కాటిలో కాలు కలిసి
కాలం సాటున
దాగుడు మూతలాడుతున్న ఊపిరికి
ఉయ్యాల కట్టిన దుఃఖాల యజమానిని
ఎంతకని ఇంకెంతకని చెప్పు దేవా
అలుగెల్లుతున్న అలజడిలో..
కర్మల మర్మపు చర్మము వలిచే
నా మార్మిక లోకంలోకి పోతున్నా
బుడ్డ పరకలేదు
గడ్డిపరక లేదు
పాలుకొచ్చిన పాలోడు లేడు
ఏలుబడి నాదే/ ఏలికను నేనే
చితిని చిత్తరువును జేసే నిశ్శబ్దకారుడను
- మునాసు వెంకట్
99481 58163

84
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles