క్రీడాభిరామం-సాంఘిక జీవనం

Mon,August 19, 2019 01:18 AM

ఒక వినోదాత్మకమైన క్రియా విశేషం క్రీడ. అలాంటి క్రీడ జీవితానికి ఆనందాన్ని సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఏ క్రీడలకైనా పరమార్థం ఆనందమే. కాబట్టి మానవులు ప్రతి క్రియా విశేషమైన క్రీడల్లో సౌందర్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణ ఫలితమే వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం. ఇది వీధి అనే ఏకాంకరూపక విశేషం. సంస్కృతంలోని ప్రేమాభిరామాన్ని అనుసరించి రాయబడిందే అయినా ఈ కావ్యం సర్వస్వతంత్రంగా కనిపిస్తుంది. క్రీడాభిరామం మిగిలిన కావ్యాల వంటిది కాదు. 295 పద్యాలతో కూడినది. తెలుగు సాహిత్యంలో గొప్ప కావ్యంగా ప్రసిద్ధి చెందడానికి కారణం సమకాలిక ప్రజల జీవన విధానాలను ప్రతిఫలింపజేయడమే. ఈ లక్షణం ఈ కావ్యానికి ఒప్పినంతగా తెలుగులో మరే కావ్యానికి ఒప్పదు. 15వ శతాబ్ది ప్రారంభంలో సంస్కృతపురాణ గాథానువాదమే సర్వకవితా విధానంగా సాగుతున్న ఆ కాలంలో ఆధునిక కవితా లక్షణాన్ని సంతరించుకొన్న అభినవ కావ్యం క్రీడాభిరామం. ఈ కావ్యం లో 14వ శతాబ్దం నాటి ఓరుగల్లు పట్టణం, అందులోని వివిధ వర్గాల ప్రజల విశ్వాసాలు, ఆచారాలు, దురాచారాలు, భోగా లు, క్రీడలు, వినోదాలు వాస్తవికంగా చిత్రించబడినవి. ఆనాటి శిష్ట దుష్టసంప్రదాయాలను కవి సమయాలను నేర్పుతో అవహేళన చేయడం ఈ కావ్యంలో విశేషంగా కనిపించే అంశం.

క్రీడాభిరామం కావ్యంలో ఆనాటి ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మన దృష్టిలోకి వస్తాయి అవి. ఏకవీరాదేవిస్తుతి, ఏకవీరాదేవి ఎదుట పరశురాముని కథను పాడటం, ఒక మాలెత ఏకవీరను కీర్తించటం, అక్కల ఆరాధనం, జక్కుల పురంధ్రికామవల్లీస్తుతి, మైలార దేవస్తుతి, భైరవస్తుతి మొదలైనవి. ఇవేగాక నగరమునందలి నానావిధ దేవాలయాలను వర్ణించిన ఈ పద్యం ఆనాటి ప్రజల దైవారాధనాతాత్పరతను వెల్లడిస్తుంది.


ఈ కావ్యంలో సామాన్య వ్యక్తులు ప్రధానపాత్రలు కావ డం విశేషం. గోవిందమంచన శర్మ, టిట్టిభశెట్టి అను ఇరువురు ఓరుగల్లు నగరంలోకి పోతూ దారిలో వారి చూపులను ఆకట్టుకొనే దృశ్యాలను వర్ణిస్తారు. వారికి ఎదురైన వివిధ సన్నివేశాల వర్ణన, వేశ్యల వర్ణన, పల్నాటి వీరుల కథాగానము, వాద్య విశేషము వివిధ కులాలు, వృత్తులు, కళలు, ఆచార వ్యవహారాలు మొదలైన ఆనాటి సాంఘిక జీవనంలోని ప్రధానాంశాలను వినుకొండ వల్లభరాయుడు ఈ క్రీడాభిరామకావ్యంలో అత్యంత సుందరంగా మనోహరంగా వర్ణించాడు. నాటి ఓరు గల్లు నగరంలో వున్నటువంటి వేషాలంకరణ గోవిందమంచన శర్మ వర్ణనలో కవి ఇట్లు వ్యక్తం చేస్తాడు..
గన్నెరుపూజాయ కరమొప్పు నీర్కావి
మడుగుదోవతి పింజెవిడిచి కట్టి
గొజ్జంగిపూనీరు గులికిమేదించిన
గంగమట్టిలలాటకమునదీర్చి
వలచేత బంగారు జలపోసనముతోడ ఁ
బ్రన్ననిపట్టుతోరముధరించి
జఱిగొన్న వెలిపట్టు జన్నిదంబుల లుంగ
యంటులు వాయంగ నఱుతవైచి
తళుకు చెంగావి కోకయు వలుదశిఖము
జిగురు బొమ్మంచు పెదవులు చిన్న నగవు
నందమొందంగవచ్చె గోవిందశర్మ
మాధవుని పట్టి, యొనపరిమన్మధుండు
కాసల్నాటి శ్రేష్ఠుండు,
మసాలప్పయ్యగారి మేనల్లుడు ధా
త్రీ సురతిలకుడు, కుసుమ శ
రాసనసముడంధ్రనగర యాత్రోన్ముఖుడై..
ఈ విధంగా ఆ కాసల్నాటి బ్రాహ్మణశేష్ఠుడు గోవిందశర్మ ఎలా ఉన్నాడంటే.. గన్నేరు పూజాయ నీర్కావి దోవతి కట్టి గొజ్జంగి పూలరసంతో మేదించిన గంగమట్టితో లలాట ప్రదేశంలో నీటుగా బొట్టుపెట్టి, జరీపట్టుకండువా వల్లెవాటువేసి, తెల్లగామెరుస్తున్న జన్నిదంతో, ఇంత ముచ్చటముడితో, చిగురుపెదవులు మీద చిరునవ్వు చిందులాడుతూ ఉండగా సాక్షా త్తు మన్మథుడిలాగా ప్రకాశిస్తూ నగర ప్రవేశం చేస్తున్నాడు గోవిందశర్మ. ఇది నాటి ఒక విలాసవంతుడివేషం. కార్యార్థియైనవాడు వేకువ జామునే ప్రయాణం చెయ్యడం శుభసూచకమని ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న ప్రజల జీవన విధానంలోని ఒక విశ్వాసం. ఈవిశ్వాసాన్ని గురించి క్రీడాభిరామ కర్త ఇలా వర్ణిస్తాడు.

పాటల విషయంలోనే కాదు, ఆటల విషయంలో కూడా ఆనాటి ఓరుగల్లు ప్రజలు ఆరితేరినవారు. పొట్టేళ్ళ పం దెములు, కోడిపందెములు, పాములాటలు, బాలల బంగారు బంతులాటలు మొదలైనవి నాటి ప్రజల సాంఘిక జీవన విధానంలో ప్రధానాంశాలుగా ఉండేవని వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం.


గోధూళిలగ్నంబునంబురంబు ప్రవేశింపవలయు విశేషించి యుషఃకాలము సర్వప్రయోజనారంభములకు బ్రశస్తంబు. ప్రశస్తమైన ఈ విశ్వాసము గార్గుడు బృహస్పతి, వ్యాసా ది ప్రముఖులచేత ప్రమాణీకరింపబడినది అంటారు.
గార్గ్య సిద్ధాంత మత ముషఃకాలకలన
శకున మూనుట యది బృహస్పతి మతంబు
వ్యాస మతముమనః ప్రసాదాతిశయము
విప్రజనవాక్యమఱయంగవిష్ణు మతము.. అని వర్ణించాడు కవి.ఆనాడు ప్రజలకు శకునశాస్త్రంపై గల విశ్వాసాన్ని క్రీడాభిరామంలోని ఈ పద్యం వల్ల కూడా తెలుసుకోవచ్చు.
చుక్కయొకింత నిక్కి బలసూదను దిక్కున రాయుచుండుటన్
జక్కగ వేగదిప్పుడు, నిశాసమయంబిది ప్రస్ఫుటంబుగా,
ఘుక్కున మాటిమాటికిని గోటఁడు వల్కెడు వామదిక్కునన్,
జొక్కటమై ఫలించు మనశోభన కార్యములెల్లఁ డిట్టిభా !
శకున శాస్త్రవేత్తల మత ప్రకారంగా ప్రయాణం చేసే సమయంలో ఎడమ వైపు నుంచి గుడ్లగూబ కూయడం, పూలకొ మ్మ మీది నుండి నెమలి కేరింతలు పెట్టడం, కోడి, ఏట్రింత (భరద్వాజపక్షి), గుంటనక్క ఇవి ఎదురైతే ప్రయాణికులకు అది కొంగుబంగారం అని అంటే సులభసాధ్యమని పై పద్యాలలోని తాత్పర్యం. అలాగే.. ఆనాటి ఓరుగల్లు నగరవైభవం క్రీడాభిరామంలో ఏవిధంగా వర్ణింపబడిందో చూడండి.

ఓరుగంటి పురంబు సౌధములపై నొప్పారెడిన్ జూచితే
యీరెండల్? మణిహేమ కుంభములతోనేకాంతములు సేయుచున్
స్వారాజ్య ప్రమదా ఘనస్తన భరస్థానంబులంబాసి, కా
శ్మీర క్షోదము, ప్రాణవల్లభ దృఢాశ్లేషంబులన్ రాలెనాన్..
అంటూ.. వేకువజామున ప్రసరించే లేతనైన అరుణ కిరణకాంతులతో మెరిసే ఎత్తయిన సౌధాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆనాడు ఓరుగల్లు మహానగర సౌందర్యానికి సంస్కృతికీ ప్రతిరూపాలుగా నిలిచినాయంటాడు క్రీడాభిరామ కవి.
వినుకొండ వల్లభరాయుడు అలనాటి ఓరుగల్లు నగర స్వరూపాన్ని వర్ణిస్తూ..
సప్తపాతాళ విష్టప మహా ప్రస్థాన
ఘంటా పథంబైన గనప పరిఖ
తారకామండలస్తబ కావతంసమై
కనుచూపు గొనని ప్రాకారరేఖ
పుంజీ భవించిన భువనగోళము భంగి
సంకులాంగణమైన వంకదార,
మెఱుగు ఱెక్కలతోడి మేరు శైలముబోలు
పైన బైడి తలుపుల పెద్దగవని
చూచె, జేరె ప్రవేశించె, జొచ్చె బ్రీతి
సఖుడు దానును రథ ఫెూట శకట కరటి
యూధ సంబాధములు కయ్య నోసరిలుచు
మందగతి నోరుగల్లు గోవింద శర్మ..
ఇది ఓరుగల్లు స్వరూపాన్ని తెలిపే పద్యం. గవని అంటే ద్వారం. ఆకాశ మండలంలో నక్షత్రాలనంటుకొను నంతటి ఎత్తైన ప్రాకారములు వాటి వెంట సప్త పాతాళములంతటిలోతైన పరిఖలు, గుండ్రని వంకరదారులు వాటితో పాటు మేరు పర్వతంవలె తళతళమెరిసే తలుపులతో కూడి ఉన్న పెద్ద ద్వార ము. ద్వారము నుండి వస్తూపోతూ వున్న ఏనుగులు రథాలు గుఱ్ఱాలతో జనసమ్మర్థంగా ఉంది. అందువల్ల జనసమ్మర్థాన్ని తప్పించుకోవడానికి క్రంతత్రోవలు (సన్నటిదారులు) కూడా ఉన్నాయి. ఆ త్రోవలవెంట వేశ్యవాటికలూ ఉన్నాయి. అవి దాటుకుంటూపోతే అక్కలవాడ ఒకటి వస్తుంది. అక్కడ వేడుకలు ప్రదర్శించబడుతూ ఉంటాయి.

ఓరుగల్లు నగరంలో వేశ్యవాటికలను దాటుకుంటూ పోతే మరొక విలక్షణమైన వాడ కనిపిస్తుంది. అది అక్కలవాడ. ఆ పేరు దానికి ఎందుకొచ్చింది? ఆ అక్కలు ఎవ్వరు? క్రీడాభిరామం కావ్యంలో ఈ అక్కలవాడకు ఒక విశిష్టత ఉంది. బాటసారులైన బ్రాహ్మణులకు నిత్యాకృత్యములు తీర్చుకొనుటకు యోగ్యమైన స్థలం అక్కలవాడ. మంచన మాచల్దేవుల సంభాషణలో ఇది తెలుస్తుంది..
నైన విచ్చేసి కూర్చండ నవధరింపు
వార్చి వచ్చెదమటువోయి వనరుహాక్షి !
యెచ్చటికి వార్వఁబోయెద రెఱుఁగఁజెప్పుఁ?
డక్కవాడకు మేము బ్రాహ్మణులమగుట..
అందుకేనేమో బాటసారులైన బ్రాహ్మణులు అవసరాలను తీర్చడం వలన ఆ వాడకు గౌరవప్రదంగా అక్కలవాడ అని పేరు వచ్చి ఉంటుంది.
క్రీడాభిరామంలో వివిధ కులాలకు సంబంధించిన స్త్రీలను గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. వివిధ వృత్తులను ఆశ్రయించి బతుకుతున్న ఈ స్త్రీలు అందరూ బహు సౌందర్యవతులు, శ్రమైకజీవులు. కాపుకాంతలు, కరణకాంతలు, మేదర, మాలెతలు, కిరాటకాంతలు, బ్రాహ్మణ వితంతువులు, వేశ్యకాంతలు మొదలైన స్త్రీలతో పాటు మాహురమ్మవంటి యోగినులు కూడా ఓరుగల్లు నగరంలోని సాంఘిక జీవనానికి నిదర్శనంగా కనిపిస్తారు.

ఆహార విహారములకు ఆటపట్టువుగా వర్ణింపబడిన ఆనాటి ఓరుగల్లు నగరంలో మంచనశర్మ వంటి విలాస పురుషులకు వితంతువులను విహారస్థానములుగా చూపటం స్త్రీలను కించపరచడమేనని అనిపిస్తుంది. ముఖ్యంగా పూవుంబోడులు లేరె విప్రవిధవల్ భూమండలిన్? అంటూ వర్ణించడం కవికి ఒక జాతి స్త్రీలపై ఉన్న ప్రత్యేక దృష్టిని వెల్లడిస్తున్నది. ఇంకా ఈ క్రీడాభిరామం కావ్యంలో ఆనాటి ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మన దృష్టిలోకి వస్తాయి అవి. ఏకవీరాదేవిస్తుతి, ఏకవీరాదేవి ఎదుట పరశురాముని కథను పాడటం, ఒక మాలెత ఏకవీరను కీర్తించటం, అక్కల ఆరాధనం, జక్కుల పురంధ్రికామవల్లీస్తుతి, మైలార దేవస్తుతి, భైరవస్తుతి మొదలైనవి. ఇవేగాక నగరమునందలి నానావిధ దేవాలయాలను వర్ణించిన ఈ పద్యం ఆనాటి ప్రజల దైవారాధనాతాత్పరతను వెల్లడిస్తుంది. ఆ పద్యం చూడండి
ఆదె భైరవ స్థాన! మట మీద నల్లదె
చమడేశ్వరీ మహాశక్తి నగరు!
వీరభద్రేశ్వరాగారమండపమదె!
యదె బౌద్ధదేవు విహారభూమి!
అదె ముద్దరాల్ ముసానమ్మ నివాసంబు!
నల్లదె కీమర సామయ్య నగరు
అదె పాండవుల గుడి ! యట దక్షిణంబున
గర్తారు డుండు తుర్కల మసీదు
కొంత దవ్యుల నదె మహాగోపురముల
పైడికుండలు రవి దీప్తి బ్రజ్వలించి
కాననయ్యెను మేరు శృంగములబోలెఁ
కేశవ శ్రీ స్వయంభూ నికేతనములు
ఈ పద్యములు ఓరుగల్లు నగరంలోని వివిధ దేవాలయాలను వెల్లడించడమే గాక చారిత్రకంగా నగర స్వరూపాన్ని కూడా వ్యాఖ్యానిస్తున్నది. పాటల విషయంలోనే కాదు, ఆటల విషయం లో కూడా ఆనాటి ఓరుగల్లు ప్రజలు ఆరితేరినవారు. పొట్టేళ్ళ పం దెములు, కోడిపందెములు, పాములాటలు, బాలల బంగారు బంతులాటలు మొదలైనవి నాటి ప్రజల సాంఘిక జీవన విధానంలో ప్రధానాంశాలుగా ఉండేవని వినుకొండ వల్ల భరాయని క్రీడాభిరామం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం.
- ప్రొఫెసర్ కె.యాదగిరి, 93901 13169

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles