నాన్న పచ్చి అబద్ధాలకోరు

Mon,August 26, 2019 12:57 AM

‘విశ్వవిద్యాలయానికి నోచుకోలేదు
విశ్వమనే ప్రపంచంలో నేర్చుకుంటున్న..’ అంటూ.. సాహిత్యం అంటే పిచ్చికాదు నా ప్రాణం అంటాడు కవి సురేంద్ర రొడ్డ. ఈయనకు కవిత్వమన్నా, తెలుగన్నా ఓ విధమైన పిచ్చి. సినారెలాగ తెలుగంటే మమకారం. సినారె తన పిల్లలకు ‘గంగ’ ‘కావేరి’ అని పెట్టుకుంటే.. కవి సురేంద్ర రొడ్డ ‘జ్ఞాపిక’,‘శీర్షిక’ అనే పేర్లు పెట్టుకున్నా డు. నిజంగానే కవిత్వంపై ప్రేమతో పిచ్చితో ప్రాణం పెట్టి రాసేవాళ్లు కొందరుంటారు వారిలో కవి సురేంద్ర రొడ్డ ఒకరు.
‘అక్షరాలు నాకు అమ్మపొత్తిళ్ళు
పదాలు నాకు పాలబువ్వలు
వాక్యాలు నాకు ఆప్తమిత్రులు
భావుకతలు నాకు శ్వాసలు
సాహిత్యం నాకు సమస్తం.. నాలో ప్రాణమున్నంతవరకూ..
అది నన్ను వీడిపోయే వరకు సాహిత్యాన్ని శ్వాసిస్తుంటాను..’అనడంలో కవి అంతరాత్మ అర్థం చేసుకోవచ్చు. కవి రాసే కవిత్వం సమాజాన్ని మార్చకున్నా, నిన్ను మార్చితే చాలనే భేదం సుస్పష్టం గా కనబడుతుంది. అది అవసరం కూడా.
ఇంత గొప్పగా కవి రొడ్డ రాస్తున్నప్పుడు, మరి తను రాసిన పుస్తకానికి ‘నాన్న పచ్చి అబద్ధాల కోరు’ పేరు పెట్టడం ఏం బాగలేదనుకోవచ్చు. అయితే పుస్తకం చదివితే నిజంగానే నాన్న పచ్చి అబద్ధాల కోరు అనడం సమంజసమే అనిపిస్తుంది. ఒకసారి కవి రాసిన కవిత చూస్తే..
‘బట్టల కొట్టులో నాకు పట్టుబట్టలు కొని
తనకు పడవని నూలుబట్టలు కొన్నప్పుడు
నాకు తెలియదు నాన్న అబద్ధమాడుతున్నాడని..!
ఉన్న ఒక్క పరుపును నాకు పరిచి
నడుంనొప్పికి నేలపడకే మంచిదన్నప్పుడు
నాకు తెలియలేదు నాన్న అబద్ధమాడుతున్నాడని..!
నన్ను ఆటో ఎక్కించి
షుగరుకు నడక మంచిదని తను నడిచినప్పుడు
నాకు తెలియలేదు నాన్న పచ్చిఅబద్ధాల కోరని..’
అందుకే తను రచించిన పుస్తకానికి ‘నాన్న పచ్చి అబద్ధాల కోరు’ అని పేరు పెట్టాడనిపిస్తుంది. పై కవిత చదువుతుంటే సగటు పాఠకునికి కూడా నాన్నంటే ఇట్టే అర్థమౌతుంది. ఎన్నికాలాలు మారి నా ఎన్ని జన్మలైనా నాన్న స్థానం ఆయన స్థాయి మారదు. పై కవితలో చెప్పినవన్నీ అబద్ధాలైనా ముమ్మాటికీ కవితంతా అబద్ధమే దాగింది. ఇందుకే ‘నాన్న పచ్చి అబద్ధాలకోరు’ అంటాడీ కవి. నాన్న ఉన్నప్పుడు ఇవన్నీ చూసే అద్భుతాలే కానీ, నాన్న మనసులోకి దిగిచూస్తే తెలుస్తుంది ఆయన లోతు.
Surendra-Rodda
ప్రకృతి అంతా లయాత్మకమే నువ్వు దేన్నైనా ధ్వనింపచెయ్యొచ్చనేది వాస్తవం అంటాడో ఆంగ్ల కవి. నిజమే కవిత్వం రాయాలంటే కొన్ని దుఃఖపు చుక్కలు కారాలంటాడు ఈ నేటి కవి. అలా రాసింది ప్రకృతిలో కలిసిపోరాదని మనసులో చిరస్థాయిగా మిగిలిపోవాలని రాసే ప్రయత్నం చేస్తున్నాడీ కవి. కవికీ విజ్ఞానికీ మధ్య ఒక పచ్చని పొలమున్నది. విజ్ఞాని అది దాటితే మహాజ్ఞాని అవుతాడు. అదే కవి దాటితే మహా దార్శనికుడౌవుతాడు అంటాడు జిబ్రాన్‌. ఈ చిక్కని ఉదాహరణ చక్కగా సరిపోతుంది కవి సురేంద్రకు.

ఆయన జ్ఞాపకాలను గుండెకు కట్టుకొని నాన్న వేళ్లను పట్టుకొని రాశాడు కవి సురేంద్ర రొడ్డ. నాన్న గురించి అమ్మకు చెప్పకురా అంటూనే సమాజంలో నాన్నపడే పాట్లను ఎత్తిచూపాడు కవి. రొడ్డ కవిత్వం పరిశీలిస్తే తన శైలి వ్యంగ్య రచన కవితను ముందు చదివించి చివరకు కొసమెరుపు అంటించడం గమనించవచ్చు. కవి సురేంద్ర రొడ్డ అర్ధాంగి గురించి రాస్తూ..
‘బండచాకిరి చేయించుకున్నాను గానీ
ఒక్కసారైనా ఓ చిన్ని బహుమతిచ్చానా
పడకటింట్లో రంభలా చూశాను గానీ
ఒక్కసారైన ఓపికుందానని చూశానా..
అనారోగ్యంతో నీవు
ఆసుపత్రి పాలైతే గానీ తెలియలేదు
నీవు లేకుంటే క్షణం సాగదని!’
ఈ సంపుటిలో ఉన్న కొన్ని గొప్ప కవితలలో ‘అర్ధాంగి’ కవిత కూడా చోటుచేసుకుంటుంది. ప్రస్తుత కాలంలో అమ్మనాన్నతో పాటు ఆలిని కూడా అంతులేని దుఃఖానికి గురిచేస్తున్నాడీ మానవుడు. ఆస్తులివ్వలేరని కన్నవారిని, కోరిక తీర్చలేదని ఆడవాళ్లని అణువణువునా తీరని వేదనకు గురిచేస్తుంటే దిక్కమొక్కులేని వారిగురించి ఎంతని చెప్పనూ. పిచ్చెక్కి ఆస్తులకు, కామానికి దేహాలను అంటిపెట్టుకుంటే ఓ కవి రాసిన వాక్యం ఎంతనీ అల్లుకుంటుంది. టన్నులకొద్దీ కన్నీటి నది అయితే కవిత్వం ప్రవాహమై జ్వలిస్తుంది ఆ కన్నీటికి మాటోస్తే..
‘నీ కన్నీటి చుక్కను ఓ సారి కదిపి చూడు
ఎన్ని కథలు ఎన్ని వెతలు, ఎన్ని కలలు ఎన్ని ఆశలు
ఎన్ని ఊసులు ఎన్ని గాయాలు, ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని రహస్యాలు
ఎన్ని జీవిత సత్యాలను నీ మనసు విప్పి చెప్తుందో
ఓ సారి కదిపి చూడు మనసు పొంగే భావన ఎందుకు రాదో..
ఓ సారి రాసి చూడంటాడు..’ కవి సురేంద్ర రొడ్డ. ప్రకృతి అం తా లయాత్మకమే నువ్వు దేన్నైనా ధ్వనింపచెయ్యొచ్చనేది వాస్తవం అంటాడో ఆంగ్ల కవి. నిజమే కవిత్వం రాయాలంటే కొన్ని దుఃఖపు చుక్కలు కారాలంటాడు ఈ నేటి కవి. అలా రాసింది ప్రకృతిలో కలిసిపోరాదని మనసులో చిరస్థాయిగా మిగిలిపోవాలని రాసే ప్రయత్నం చేస్తున్నాడీ కవి. కవికీ విజ్ఞానికీ మధ్య ఒకపచ్చని పొలమున్నది. విజ్ఞాని అది దాటితే మహాజ్ఞాని అవుతాడు. అదే కవి దాటితే మహా దార్శనికుడౌవుతాడు అంటాడు జిబ్రాన్‌. ఈ చిక్కని ఉదాహరణ చక్కగా సరిపోతుంది కవి సురేంద్రకు.
‘మా అయ్యను గోచిలో కాక.. పంచెకట్టులో చూడాలనే ఆశ
పొయ్యిని ఊదినప్పుడు.. పచ్చికట్టెలు అంటుకోక
ఊపిరాడని పొగలో..కన్నీళ్ళు రాని అమ్మను చూడాలనే ఆశ..’
ఆ ఆశ నెరవేరాలని కోరుకుంటూ.. తన కవిత్వం పండిస్తున్న తీరు ఔరా అనిపిస్తుంది. ఇలా కవి రాసిన పుస్తకం నిండా వస్తు వైవిధ్యంతో ఎన్ని పుష్పమాలికలు అల్లాడో ఇంకా కొన్ని కవితలకు మరింత కవిత్వం పూస్తే చాలా బాగుంటుందని భవిష్యత్తులో ఇం కా గొప్ప కవిత్వం రాయాలని కోరుకుంటూ.. కవి సురేంద్ర రొడ్డ కు మనస్ఫూర్తిగా నా అభినందనలు.
- చిగురాల్‌పల్లి ప్రసాద్‌, 96421 09537

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles