ఉద్యమ సాహిత్యశిఖరం ఎస్వీ


Mon,August 26, 2019 12:59 AM

సాహిత్యరంగంలో విశేష కృషిచేస్తూ.. ఆయన 33 స్వీయ గ్రంథాలను ప్రచురించారు. వాటిలో వేర్వేరు ప్రక్రియలకు చెం దిన గ్రంథాలుండటం విశేషం. వచన కవితా సంపుటాలు, లలితగీతాల సంపుటాలు, ఉద్యమగీతాలు, సాహిత్య వ్యాసా ల సంకలనాలు, జీవిత చరిత్రలు, పరిశోధనలు, విశ్లేషణలు, సాహిత్య చరిత్రను వివరించే గ్రంథాలు మొదలైనవి వాటిలో ఉన్నాయి. ఇవికాకుండా మరో 50కి పైగా గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. వ్యాసాలు, గీతాలు, కవితలు, కథలను సంకలనాలుగా స్వీయ సంపాదకత్వంలో వెలువరించా రు.


తెలుగు సాహిత్యంలో పరిచయం అవసరంలేని పేరు ఎస్వీ సత్యనారాయణ. విద్యావేత్తగా, సాహితీవేత్తగా, ఉద్యమకారుడిగా ఎస్వీ పేరు తెలియని వారుండరు. నిరంతరం సాహిత్యోద్యమాలతో మమేకమవుతున్న ఉద్యమ సాహితీవేత్త ఆయన. అభ్యుదయ రచయితల సంఘంలో జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషిస్తూ, సాహిత్యోద్యమంలో తనదైన పంథాలో పురో గమిస్తున్నారు.
1954, ఆగస్టు 16న జన్మించిన ఎస్వీ సత్యనారాయణ హైదరాబాద్‌లోని పాతబస్తీలో పెరిగారు. లాల్‌దర్వాజ సమీపంలోని వెంకట్రావు మెమోరియల్‌ పాఠశాలలో 1970లో పదో తరగతి చదివేప్పుడే ఆయనలోని సాహితీ తృష్ణను ఉపాధ్యాయులు గుర్తించారు. ఆ రోజుల్లో ‘మానవత్వాన్ని రక్షించుకుందాం’ అంటూ ఆయన రాసిన కవిత ఉపాధ్యాయులను ఆకర్షించింది. కరీంనగర్‌ నుంచి ప్రచురితమయ్యే ‘విద్యుల్లత’ మాసపత్రికలో 1970మే సంచికలో ఆ కవిత ప్రచురితమైంది. ఆ విధంగా తొలి కవిత ప్రచురితమైన అనంతరం ఎస్వీ వెనక్కి తిరిగిచూడలేదు. మమతానురాగాలు, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించిన ఆ పదో తరగతి విద్యార్థి అభ్యుదయ సాహిత్యోద్యమానికి దిక్సూచి అయ్యారు.

పాతబస్తీలో పాఠశాల విద్యాభ్యాసం చేసిన ఎస్వీ అనంత రం సిటీ కళాశాలలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ స్నాతకోత్తర పట్టా అందుకున్న ఎస్వీ ఈ ఉభయ భాషలతో పాటు హిందీ, ఉర్దూల్లోనూ నిష్ణాతులు. ఆచార్య కె.గోపాల కృష్ణారావు పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1982లో ‘అబ్బూరి రామకృష్ణారావు రచనలు -సమగ్ర పరిశీలనలు’ అనే అంశంపై ఎంఫిల్‌ పట్టా పొందారు. అనంతరం ‘తెలుగులో ఉద్యమ గీతాలు’ అంశంపై ఆచార్య ఎన్‌.గోపి పర్యవేక్షణలో సాధికారిక పరిశోధన చేసి, 1989లో డాక్టరేట్‌ పొందారు. తాను చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఆచార్యునిగా, తెలుగుశాఖ అధ్యక్షునిగా, డీన్‌గా, ఆర్ట్స్‌ కళాశాల ప్రధానాచార్యునిగా వివిధ హోదాల్లో పని చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతిగా 2016 జూలై 26న బాధ్యతలు చేపట్టి తనదైనశైలిలో విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.
రెండేండ్ల కిందట హైదరాబాద్‌ నగరంలో వైభవంగా జరిగి న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడం లో ఆచార్య ఎస్వీ కృషి కూడా ఎంతో ఉంది. తెలంగాణ సాహి త్య అకాడమీ, తెలుగు అకాడమీలతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఆ సందర్భంగా తెలంగాణ సాహిత్య ఔన్నత్యాన్ని ప్రతిబింబించే గ్రంథాలను ప్రచురించింది.
SV-Satyanarayana
మఖ్దూం మొహియుద్దీన్‌ అవార్డు ప్రదానోత్సవ సభ షాయరే తెలంగాణ మఖ్దూం మొహియుద్దీన్‌ జాతీయ అవార్డును ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణకు ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ సభ 2019 ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సిటీ కాలేజీ ఆవరణలోని గ్రేట్‌హాల్‌లో జరుగుతుంది. డాక్టర్‌ సి.మంజులత అధ్యక్షతన జరుగు సభ లో గౌరవ అతిథులుగా నందిని సిధారెడ్డి, పాశం యాదగిరి, వాహెద్‌ హాజరవుతారు. నిర్వహ ణ: డాక్టర్‌ విప్లవ్‌దత్‌ శుక్లా.

తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతిగా గిరిజన భాషలకు ప్రత్యేక పదకోశ తయారీకి శ్రీకారం చుట్టారు. గతంలో విశ్వవిద్యాలయ విద్యార్థులకు, సందర్శకులకు మాత్రమే అందు బాటులో ఉండే విశ్వవిద్యాలయ ప్రచురణల విక్రయశాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు.
సాహిత్యరంగంలో విశేష కృషిచేస్తూ.. ఆయన 33 స్వీయ గ్రంథాలను ప్రచురించారు. వాటిలో వేర్వేరు ప్రక్రియలకు చెం దిన గ్రంథాలుండటం విశేషం. వచన కవితా సంపుటాలు, లలితగీతాల సంపుటాలు, ఉద్యమగీతాలు, సాహిత్య వ్యాసా ల సంకలనాలు, జీవిత చరిత్రలు, పరిశోధనలు, విశ్లేషణలు, సాహిత్య చరిత్రను వివరించే గ్రంథాలు మొదలైనవి వాటిలో ఉన్నాయి. ఇవికాకుండా మరో 50కి పైగా గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. వ్యాసాలు, గీతాలు, కవితలు, కథలను సంకలనాలుగా స్వీయ సంపాదకత్వంలో వెలువరించా రు. దాదాపు 50 పరిశోధనా వ్యాసాలను రచించారు. మరో 300కి పైగా సాహిత్య వ్యాసాలను రాశారు. పోరాటయోధు లు మఖ్దూం మొహియుద్దీన్‌, ధర్మభిక్షం, తమ్మారెడ్డి సత్యనారాయణ, యార్లగడ్డ భాగ్యవతిల జీవిత చరిత్రలపై ప్రత్యేక గ్రం థాలను వెలువరించారు. అభ్యుదయ, దళిత సాహిత్యాలపై విశ్లేషణాత్మక గ్రంథాలను రచించారు. తెలంగాణ విమోచనోద్యమంపై 2008లో ఆయన రాసిన గ్రంథం తెలంగాణ విమోచనోద్యమ విశిష్టతను తెలుపుతుంది. విద్య, సాహిత్యరంగా ల్లో ఆచార్య ఎస్వీ ప్రస్థానంపై డాక్టర్‌ కందిమళ్ల భారతి సంపాదకత్వంలో ‘ఆత్మీయం’అనే విశ్లేషణాత్మక గ్రంథం వెలువడింది.
పాలనాపరంగా విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పాఠ్య ప్రణాళికా మండలి అధ్యక్షుడిగానూ శాఖాధిపతిగానూ వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో డీన్‌గా, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సైఫాబాద్‌లోని పి.జి.కళాశాల భాషా శాస్త్ర విభాగాధిపతిగా ఆరేండ్ల పాటు పనిచేశారు. న్యూ రీసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌ వార్డెన్‌గా, హాస్టళ్ల అడ్మిషన్స్‌ కమిటీ సభ్యుడిగా, హాస్టళ్ల క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా నిరంతరం విద్యార్థుల సంక్షేమం కోసం కృషిచేశా రు. తెలుగు విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళిక మండలి సభ్యుడి గా వ్యవహరించారు. బెంగళూరు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్లో సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉస్మానియా, ఆంధ్ర, శ్రీకృష్ణదేవరాయ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాల రచయితగా కీలకపాత్ర పోషించారు. కేంద్ర సాహిత్య అకాడమీలో ప్యానెల్‌ రచయితగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడి గా కూడా కృషిచేశారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘంలో ప్రస్తుతం ఆచార్య ఎస్వీ ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా కూడా పనిచేశారు.
వేర్వేరు ప్రక్రియల్లో ప్రజ్ఞానిధిగా పేరుపొందిన ఆచార్య ఎస్వీ అనేక అవార్డులు పొంది, వాటికే వన్నెతెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాషాసంఘం 2004లో ఆయన కు భాషా పురస్కారం అందజేసింది. తెలుగు విశ్వవిద్యాల యం 1999, 2003 సంవత్సరాల్లో ధర్మనిధి పురస్కారాలను ప్రదానం చేసింది. ఆయన రచించిన ‘జీవితం ఒక ఉద్యమం’ గ్రంథం 2008లో ఉత్తమ వచన కవితా సంపుటిగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం పొందింది. చెన్నైలోని యునైటెడ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. సుంకర సాహిత్య పురస్కారాన్ని పొందారు. 1998 లో డాక్టర్‌ చెలికాని రామారావు స్మారక సత్కారాన్ని స్వీకరించారు. వేములపల్లి శ్రీకృష్ణ, పులుపుల శివయ్య, బొల్లిముంత శివరామకృష్ణల పేరిట ఏర్పాటుచేసిన మూడు వేర్వేరు సాహి త్య పురస్కారాలను 2004లో స్వీకరించారు. సాహిత్యరంగంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా అనేక పురస్కారాలను ఆయన పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి ప్రభుత్వం ఆయనను గౌరవించింది.
అధ్యయనం నిమిత్తం ఆయన సోవియెట్‌ యూనియన్‌లో 1984లో పర్యటించారు. ఈజిప్టులో 1998లో పర్యటన జరిపారు. పలు అంశాలపై సాధికారికంగా మాట్లాడగల పరిజ్ఞానం ఉన్న మేధావి ఎస్వీ. తన ఉపన్యాసాల్లో ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా సూటిగా గుణదోష విశ్లేషణ చేస్తారు. సీరియస్‌ అంశాన్ని సైతం ప్రేక్షకులను ఆకర్షించే విధంగా తన హాస్య చతురతతో ఆకట్టుకోగల దిట్ట ఆచార్య ఎస్వీ.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రసిద్ధ ఉర్దూ కవి మఖ్దూం మొహియుద్దీన్‌ ‘షాయరే ఇంక్విలాబ్‌'గా పేరుపొందిన మఖ్దూం సిటీ కాలేజీలో 1934 ప్రాంతంలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆయన పేరుతో ‘సిటీ కాలేజీ మఖ్దూం మొహియుద్దీన్‌ నేషనల్‌ అవార్డు’ను ఈ సంవత్సరం నుంచి ఏటా అవార్డు అందజేసేందుకు నిర్ణయించింది. తొలిసారిగా ఈ అవార్డును సిటీ కాలేజీ పూర్వ విద్యార్థి ఎస్వీ సత్యనారాయణకు ఈ నెల 27న అందజేస్తున్నది. ఈ ఇరువురూ ఉద్య మ సాహిత్యంలో విశేష కృషిచేసిన వారు. ఇరువురూ పూర్వ ఉమ్మడి మెదక్‌ జిల్లా వాస్తవ్యులు కావడంతో పాటు ఇరువురి బాల్యమూ హైదరాబాద్‌ పాతబస్తీ జ్ఞాపకాలతో పెనవేసుకుపోవడం విశేషం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మఖ్దూం మొహియుద్దీన్‌ పేరిట నెలకొల్పిన జాతీయ అవార్డు ను అక్షరాలతో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఆచార్య ఎస్వీ సత్యనారాయణకు అందజేయడం ముదావహం.
- డాక్టర్‌ రాయారావు సూర్యప్రకాశ్‌రావు
94410 46839

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles