నీళ్లకు నీరాజనం

Mon,September 2, 2019 01:03 AM

LOWERMANIARDAM
నివ్వెరపోవద్దు నివద్దెనే
నిష్టూరమాడవద్దు నిశ్చయమే
ముంపు ఎత గురించి
మరోసారి మాట్లాడుకుందాం
బతుకు ఎత్తువంపుల గురించి
ఇంకోసారి కరువు తీరా కలెపోసుకుందాం
సందర్భం నీళ్లు
సమయం నీళ్లు
నీటి మీది రాతలు కాదు
నేల నుదిటి గీతల్ని
నాగేటి సాల్లుగా మార్చిన
నీళ్లకాల్ల పిక్కలు నొప్పిపెట్టినా
ఎదురెక్కి వచ్చిన జలాలను
సజల నయనాలకు అద్దుకుందాం
నీతి రీతుల గురించి
ఎప్పుడైనా చర్చించుకోవచ్చు
కేటు చొక్కము గురించి
ఎంతైనా ముచ్చటించ్చుకోవచ్చు
నీళ్లు నిప్పులు
ఎలా రాజేస్తుందో తిలకిస్తున్నదే
కళ్ల నీళ్లు
ఎలా కలికలి చేసిందో చూస్తున్నదే
పడావు పడ్డ అవ్వల్‌దర్జా భూములు
తడి ఎత్తిపోయి బోరుమన్న బోర్లు
పనీపాటలు లేక
దేశం పోయిన ఊర్లకూర్లు
మనసుల మతలబు పెట్టుకొని
మసిలిపోతే పానం కరాబైతది
కడుపుల ఎత బుద్ధి తీరా
చెప్పుకుంటే మనసు అల్కగైతది
తెలంగాణకు కడలి లేదు
దు:ఖ సముద్రాల తడలు
గుండెల దరులకు బోలెడు తాకుతయ్
బొడ్డుకోసి పేరు పెట్టిన
బొడ్రాకో శ్రమ చరిత్ర వుంది
ఊరు ఒక మరువలేని
సలుపుతున్న గాయం
గూడ ఏతం మోట
కరెంటు బా బెంగటీలిన చెరువు
నీళ్లు ఎదురీదుతున్నయ్
గంగ ఎదురెక్కి వస్తుంది
తల లేని నైతికతలను
కాసేపు పక్కన పెడుదాం
తోక లేని విలువలను
కొంచెం సేపు ఓరకు వుంచుదాం
ఎప్పుడైనా ఎక్కడైనా
ఎన్నడైనా ఎంతైనా
మరోసారి ప్రస్తావించుకుందాం
ఇప్పుడు నీళ్ల కాళ్లకు నీళ్లిచ్చి
మహా నీరాజనం ఇద్దాం

- జూకంటి జగన్నాథం
94410 78095
( సిరిసిల్ల కాళ్లకట్టుకు వచ్చిన మిడ్‌మానేరు నీళ్లను చూసినప్పుడు..)

76
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles