గురువులు విలువలు వదలొద్దు

Thu,September 5, 2019 12:53 AM

భారతీయ దార్శనిక చింతనాధోరణులను, సంస్కృతి ని పాశ్చాత్య దేశాలకు తనదైన శైలిలో, రచనలద్వారా తెలియజేసిన గొప్ప రచయిత, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సంస్కృత భాషలోని భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను, తాత్త్విక మూలాలను ఆవిష్కరించారు. భావవాద కోణంలో భారతీయ దర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యయనం చేసేలా కృషిచేశారు రాధాకృష్ణన్‌. ఆయనవల్లనే భారతీ య దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయా లు 110 డాక్టరేట్‌ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీరి రచనలో ముఖ్యమైనవి ‘ఇండియన్‌ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్‌ లైఫ్‌', ‘ద ఐడియల్‌ వ్యూ ఆఫ్‌ లైఫ్‌', ‘ఫ్రీడవ్‌ు అండ్‌ కల్చర్‌', ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్‌ ఇండియన్‌', ‘ది దమ్మపద గౌతమ బుద్ధ’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. భారతదేశ సంస్కృతిని, నాగరికత ను ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన జన్మది నం సెప్టెంబర్‌ 5ను దేశంలో ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీ 1962లో ప్రారంభమైంది.

రాధాకృష్ణన్‌ మన దేశానికి 1952 నుంచి 1962 వర కు ఉప రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో రాష్ట్రపతి పదవిని అలంకరించారు. రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టే సందర్భంలో దేశ విదేశాల్లో ఉన్న తన శిష్యులు, శ్రేయోభిలాషులు తన జన్మదినమైన సెప్టెంబర్‌ 5ను ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుపగా తన పుట్టినరోజును ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్‌ అన్నారు. దాంతో నాటినుంచి సెప్టెంబ ర్‌ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ప్రారంభమైంది. రాధాకృష్ణన్‌ దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా, ఆదర్శంగా నిర్వహించారు. ఆయన దృష్టిలో సమాజంలో గుణాత్మకమైన మార్పు విద్యావిధానం ద్వారానే గాక విద్యను బోధించే ఉపాధ్యాయుల ద్వారా అధికంగా వస్తుంది.

మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తుని నగరంలో 1888 సెప్టెంబర్‌ 5న రాధాకృష్ణన్‌ జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువల్లూరులో, రేణిగుంటలో పాఠశాల ఉన్నత విద్యను, మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన విషయమైన తత్త్వశాస్త్రంలో ఎం.ఏ. పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్‌జార్‌ ఆచార్యపీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్ఠించారు. 1929 లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఆ పిదప ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్‌' బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలలో ఆచార్యుడిగా పనిచేసి 1931లో ఆంధ్రా యూనివర్సి టీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
యునెస్కో అధ్యక్షులుగా మాస్కోలో భారత రాయబారిగా పనిచేసిన రాధాకృష్ణన్‌ 1952లో ఉప రాష్ట్రపతి గా, 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1954లోనే మనదేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన భారతరత్నను అందుకొని 19 62లో రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్‌ కింగ్‌' అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు.
Sarveypalli
రాధాకృష్ణన్‌కు చిన్నతనం నుంచే తాత్త్విక జిజ్ఞాస మెండు. ఉపనిషత్తుల ప్రభావం అతనిపై అధికంగా ఉండేది. ముఖ్యంగా తైత్తిరీయ ఉపనిషత్తులో మౌద్గల్య మహర్షి చెప్పిన ఉపాధ్యాయ లక్షణాలు, విలువలతో అతను ఎంతగానో ప్రభావితమయ్యారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే సమాజంలో ఉపాధ్యాయునికి ప్రతిష్ఠ, గుర్తింపు, స్థాయి లభిస్థాయి, సామాజిక ధర్మాన్ని లేదా సంఘధర్మాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా నిర్వహించాలనే పెక్కు అంశాలను మౌద్గల్య మహర్షి ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల లక్షణాలు, విధులకు సంబంధించిన 15 అంశాలను వివరించారు. ఆ 15 అంశాలు ఉపాధ్యాయుని విధులను నిర్దేశిస్తాయి. ప్రతిభతోపాటు ఆ 15 లక్షణాలు ఉన్నవ్యక్తే ఆ వృత్తికి అర్హుడు. ప్రతిభ ఒక్కటే ఉపాధ్యాయవృత్తికి కొలమానం కారదు. ప్రతిభతో పాటు సత్యం చెప్పటం, సత్యాన్ని జీవిత పర్యంతం ఆచరించటం, తోటి మానవులయందు దయాదాక్షిణ్యాలు కలిగి ఉండటం, ధర్మబద్ధంగా సంసారం చేయ టం, కోపాన్ని నిగ్రహించుకోవటం, నైతిక విలువలను కలిగి ఉండటం, ఆధ్యయనం, బోధ న ఉపాధ్యాయునికి ఉండవల్సి న ప్రధాన లక్షణాలుగా ఈ ఉపనిషత్తు పేర్కొంటుంది. వీటన్నింటిని తన జీవిత పర్యంతం ఆచరించిన వ్యక్తి రాధాకృష్ణన్‌. ప్రతి ఉపాధ్యాయుడు వీటిని ఆచరించి సమాజంలో ఇతరులకు మార్గదర్శకంగా, ఆదర్శవంతులుగా నిలబడినప్పుడే వాళ్లు సామాజిక ధర్మాన్ని నెరవేర్చినవారవుతారనేది రాధాకృష్ణన్‌ ప్రగాఢ విశ్వా సం.
laxman
ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్‌ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు, విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికతా కేంద్రాలుగా బాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యావిధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో ఇనుమడింపజేయాలి. వారిలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల మానసిక పరిపక్వతకే గాక వారి శారీరక అభివృద్ధికి అవి దోహదపడాలి. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం, సహజన్యాయం మొదలగు ప్రజాస్వామ్య విలువలను విశ్వవిద్యాలయాలు సంరక్షించాలి. అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలబడాలి. దీనికి భిన్నంగా నేడు పెక్కుమంది ఉపాధ్యాయుల్లో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో సామాజిక నైతిక విలువలు క్షీణించి స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతున్నది. బోధనా, విద్యా ప్రమాణాలు క్షీణించిపోవడానికి ఒక్క ఉపాధ్యాయులే కారణం కాదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావిధానం కూడా కొంతవరకు కారణమే. బోధన, విద్యాప్రమాణాలతోపాటు సామాజిక నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తుకుతెచ్చి ఆ వృత్తికి న్యాయం చేకూర్చటంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: తత్తశాస్త్ర ఆచార్యులు, ఓయూ)
(నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా...)

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles