నల్లమలను కాపాడుకుందాం..


Fri,September 13, 2019 01:39 AM

రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాల అమలుకు వేగంగా అడుగులు వేస్తున్నది. అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిన మోదీ ప్రభుత్వం తాజాగా పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటున్నది. కూర్చున్న కొమ్మనే నరుకుంటున్న చందంగా యురేనియం పేరుతో పచ్చని అడవు ల్లో చిచ్చుపెడుతున్నది. యురేనియం తవ్వకాలతో దేశాభివృద్ధి జరుగుతుందనే పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగా ణకు పర్యావరణ గుండెకాయలాంటి నల్లమల అడవులను నాశనం చేసే యత్నాలను మొదలుపెట్టింది. యురేనియం తవ్వకాల పేరిట నల్లమల అడవులను ధ్వంసం చేసి తద్వా రా అడవి బిడ్డలను, చుట్టూ పరిసర జిల్లాల్లో ఉన్న ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. తరాలుగా అడవినే నమ్ముకొని ప్రకృతిహితంగా జీవనం సాగిస్తున్న ఎన్నో ఆదివాసీ తెగల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయి.


ఈ యురేనియం తవ్వకాల వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. మొదటి నుంచి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముగాస్తూ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు అదే కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పి తన ప్రభుభక్తిని చాటుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ఆయా కార్పొరేట్ కంపెనీల ద్వారా చేస్తున్న పనులను, పథకాలను పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రచారం చేసుకుంటూ.. ప్రశ్నించే వారిని తప్పుడు కేసులు బనాయిస్తూ పాలన సాగిస్తున్నది. ఇదిలా ఉంటే యురేనియం తవ్వకాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. అటవీ సంపద నరికివేతతో తెలంగాణకు ఊపిరిత్తుల వంటి నల్లమల అడవులు దెబ్బతింటాయి. జం తువులు, పశుపక్షాదులు అంతరించిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పర్యావరణం కాలుష్యమవుతుంది. జీవధార కృష్ణానది కాలుష్య కాసారంగా మారుతుంది. దీంతో పాటు తవ్వకాలు చేపట్టే ప్రాంతం చుట్టూ ఉన్న ఆదివాసు లు తీవ్రమైన క్యాన్సర్ లాంటి రోగాలతో అనారోగ్యం పాలవుతారు. అంగవైకల్యం చెందుతారు. ప్రత్యామ్నాయమార్గాలు ఉన్నప్పటికీ కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవన విధ్వంసానికి కేంద్రం పాల్పడుతున్నది. కాబట్టి యురేనియం తవ్వకాలను మూకుమ్మడిగా ఇరు రాష్ర్టాల తెలుగు ప్రజలు అడ్డుకోవాలి.

- దేవళ్ల సమ్మయ్య
అధ్యక్షులు, తెలంగాణ బీసీ ఇంజినీర్స్ ఫెడరేషన్

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles