మన పీవీపై నిందలు


Sun,October 13, 2019 12:24 AM

భారత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమై న, అధికారాల రీత్యా రాష్ట్రపతి స్థానం కంటే బలీయమైన ప్రధానమంత్రి పదవి ని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, అందునా తెలంగాణ వాడు, స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు మరణించి 15 ఏండ్లు నిండినా యి. మరణానికి ముందు ప్రధానిగా పదవీ విరమణ చేసి న తర్వాత, సుమారు 8 ఏండ్లు, ఆయనను ఎన్నివిధాల కష్టపెట్టడానికి వీలుందో, అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసింది నాటి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభు త్వం. ఆ ప్రభుత్వం మారి, అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం, ఎన్డీయే కంటే ఎక్కువగా, మరణించిన ఆయన ఆత్మకు క్షోభ కలిగించింది. యావత్ ప్రపంచం ఎంతో ఉన్నతుడిగా ఇప్పటికీ కీర్తిస్తున్న అసామాన్య రాజనీతి, ఆర్థికవేత్తకు సముచిత స్థానం ఆయన సొంత దేశంలోనే, సొంత రాష్ట్రంలోనే, ఆయన జన్మించిన గడ్డలోనే, దొరుకనందుకు బహుశా అందరికంటే ఎక్కువగా లోలోన బాధపడిన వ్యక్తి, ఆయన రాజకీయాల్లోకి తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనవచ్చునేమో! కాకపోతే కేసీఆర్ నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అధికారికంగా ఆయన వర్ధంతి, జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. సరిగ్గా 19 ఏండ్ల కిందట 2000, అక్టోబర్ 13 సోమవారం రోజున ఏ దినపత్రిక చూసినా, ఏ టెలివిజన్ చానల్‌లో వార్తలు విన్నా, కనిపించిందీ, వినిపించిందీ మాజీ ప్రధాని (స్వర్గీయ) పీవీ నరసింహారావుకు విధించిన జైలుశిక్ష గురించిన సమాచారమే.


ఐదేండ్ల పదవీకాలం ముగిశాక పీవీపైన అనేక అవినీతి ఆరోపణలు మోపింది నాటి ఎన్డీయే ప్రభుత్వం. పదవి నుంచి దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నంటాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా ఏడాది ముందు వీగిపోయింది.


చెరసాలకు మాజీ ప్రధాని, అవినీతికి అరదండాలు, ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు.. అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు శీర్షికలు పెట్టారు. అలాగే, అదే అర్థం వచ్చేరీతిలో పలు ఆంగ్ల, హిందీ దినపత్రికలు కూడా శీర్షికలు పెట్టాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కి విశ్వవ్యాప్త మన్ననలు అందుకున్న ఓ మహనీయుడి పరిస్థితి కడు దయనీయంగా మారి, కనీసం పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన పేరుండకూడదని క్షణా ల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఆ పరిస్థితికి జాలిపడాలా? సానుభూతి చూపాలా?. ఆ తర్వాత ఏమైందన్న సంగతి పక్కనపెడితే, పీవీ నరసింహారావు తప్పు చేశాడా లేదా అన్న విషయం కన్నా, ఆయన చేసినట్లు తీర్పిచ్చిన ఘోర తప్పిదానికి, ఆయనకు విధించిన శిక్ష నుంచి మినహాయింపు కానీ, కనికరాన్ని కానీ, పొందేందుకు అనర్హుడని ఆ శిక్షను విధించిన న్యాయమూర్తి అజిత్ బరిహోక్ భావించారంటే ఆ కేసు పూర్వాపరాలు న్యాయమూర్తిపై తిరుగులేని ప్రభావాన్ని చూపాయనుకోవాలి. గుడ్డిలో మెల్లలా, కనికరాన్ని పొందడానికి కూడా అనర్హుడని భావించదగ్గ పీవీపైన తీర్పిచ్చిన న్యాయమూర్తి అజిత్ బరిహోక్ ఆఖరి క్షణంలో, గింజంత కనికరం చూపించారు. శిక్షను మూడేండ్లకు పరిమితం చేయడంతో పాటు, పీవీని తక్షణం జైళ్లోకి తోసివేయకుండా అవకాశం కల్పించి, బెయిల్ పొంది, హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకునే వీలు, పోనీ, శిక్ష నుంచి తాత్కాలిక మినహాయింపు కలిగించారు! ఆయన సెషన్స్ కోర్టే ఆ బెయిల్‌ను మంజూరుచేసి కొంత ఊరట కలిగించారు. ఐదేండ్ల పదవీకాలం ముగిశాక పీవీపైన అనేక అవినీతి ఆరోపణలు మోపిం ది నాటి ఎన్డీయే ప్రభుత్వం.

పదవి నుంచి దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నంటాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా ఏడాది ముందు వీగిపోయింది. జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో, పార్లమెంట్‌లో మెజారిటీ సాధన కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ చేశారాయన మీద. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ పీవీని దోషిగా పేర్కొన్నారు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన తొలి మాజీ ప్రధానిగా పీవీ చరిత్ర పుటల్లోకెక్కారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుభాయి పాఠక్ కేసుల్లో నూ పీవీ నిర్దోషిగా ఉన్నత న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక స్టాక్‌మార్కెట్ కుంభకోణం ఆరోపణలు కూడా నిరాధారాలని తేలింది. అయితే ఆయనకు జరుగాల్సిన అన్యా యం జరిగింది. మచ్చ మిగిలిందా, చెరిగిపోయిందా అనే విషయాన్ని భావితరాల వారికే వదులుదాం. న్యాయస్థాన పూర్వరంగంలోకి పోతే, 1993, జూలై 28న పీవీ ప్రభుత్వంపై పలు ప్రతిపక్షాలు సమైక్యంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సీపీఎం ప్రతిపాదించిన ఆ తీర్మానానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 265 ఓట్లు లభించడంతో 14 ఓట్ల స్వల్ప తేడాతో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై విజయం సాధించింది. 20 మంది సభ్యులు గల అజిత్ వర్గం జనతాదళ్ పార్టీ నుంచి ఏడుగురు చీలిపోయి, పీవీకి మద్దతివ్వడంతో ప్రభుత్వం నెగ్గింది. దానికి అదనంగా, జార్ఖండ్ ప్రాంతానికి స్వయం నిర్ణయాధికారం కలిగించే దిశగా ప్రభుత్వం చేపట్టనున్న చర్యలకు సంబంధించి, (మరుసటి రోజు) తీర్మానానికి సమాధానం ఇచ్చేటప్పుడు ప్రకటన చేస్తానని, పీవీ హామీ ఇచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చాలోని నలుగురు సభ్యుల మద్దతు కూడగట్టుకున్నారు.

వీరితో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు, కేరళ కాంగ్రెస్, ఎస్‌ఎస్‌పీ, ఎంపీ ఐ, ఇండిపెండెంట్లకు చెందిన ఒక్కొక్కరు కూడా పీవీకి మద్దతు పలికారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ 25 నెలల కాలంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన మూడో అవిశ్వాస తీర్మానం గండం నుంచి అలా గట్టెక్కింది ప్రభుత్వం. జేఎంఎం నలుగురు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ రోజున పీవీ ప్రభుత్వం గెలిచేదే. అయితే పర్యవసానం వేరే విధంగా మారిపోయింది. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించి, రక్షించడానికి జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న అభియోగం ఆయనపై మోపారు. ఆయన వద్ద వారు ముడుపులు తీసుకున్న విషయం రుజువైందని తేల్చి పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పిచ్చింది. 18 పేజీల తీర్పులో, న్యాయమూర్తి అజిత్ బరిహోక్ కఠిన పదజాలాన్ని వాడి, పీవీ నరసింహారావు చర్య భారత రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమనీ, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకపోవడమే సరైన నిర్ణయమని భావించే పీవీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గడానికి ముడుపులివ్వాలన్న నిర్ణయం తీసుకున్నదనడంలో వాస్తవం లేదనాలి. ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సం పాదించి, పలువురికి పంచిపెట్టిన మేధావి, కాకలుతేరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, చిరునవ్వు వీడని ధీశాలి, ముఖంలో తీర్పు వెలువడిన కొన్ని సెకన్లు మాత్రమే ఆందోళన కనిపించిందనీ, అయితే వెనువెంటనే నిలదొక్కుకొని మామూలుగా మారారనీ, ఆయనను అప్పుడు చూసి న సన్నిహితులు అన్నారు. పీవీ నేరం చేశారో లేదో తర్వాత వెలువడిన తుదికోర్టు తీర్పులే తేల్చాయి. ఏ ఒక్క దాంట్లో కూడా ఆయనను నేరస్తుడని తేల్చలేదు.
Vanam-Jwala-Narasimha-rao
అయితే ఆయన చేసిన పొరపాట్లు అనేకం. ఆ పొరపాట్ల మూలాలనే రాజకీయంగా ఆయన సహచరులు, సన్నిహితులు, ఆయను హిమాలయాలపై ఉన్న ములగ చెట్టు ఎక్కించి ఏనాడో శిక్ష విధించారు. ఆలోచనల్లో, అమలులో విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడే వ్యక్తి, అపర చాణక్యుడిగా అందరూ స్తుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర ఆర్థిక నిపుణుల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తిచేసిన పెద్ద పొరపాటు బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా ఐదేండ్ల పాటుకలిగించడం, విశ్వాస ఘాతకులకు వందేండ్ల చరిత్రను అంకితం చేయడమే. తొలి దక్షిణాది వ్యక్రిగా ప్రధాని పీఠాన్ని అందుకొని, అందులో ఐదేండ్ల పాటు కొనసాగడం ఎంతోమందికి నచ్చలేదు. నెహ్రూ కుటుంబానికి చెందనివాడు, దక్షిణాది వాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం కొందరి దృష్టిలో పనికిరానివాడు, మెజార్టీసభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టినవాడు కావడంతో ఆయనను దెబ్బతీసే ప్రయత్నం 1991లోనే మొద లైందంటే అతిశయోక్తి కాదేమో! భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాది వారు, దక్షిణాది వారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, ఉన్నతోన్నతమైన పీవీ లాంటి వ్యక్తిని అధః పాతాళానికి తొక్కేదాకా ప్రయత్నాలు చేయడమే! ఉన్నత న్యాయస్థానాలు పీవీని నిర్దోషిగా తేల్చినా ఆయన మీద పడ్డ చెడ్డ మచ్చ పూర్తిగా మాసిపోయిందనలేం.
(వ్యాసకర్త: ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి)

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles