దృశ్యకావ్యమైన ‘అంపశయ్య’


Mon,October 21, 2019 12:47 AM

వ్యక్తిని ఒక నవల ఎంత గాఢంగా, ఎంతమేరకు ప్రభావితం చేయవచ్చును? ఒకసారి చదివిన తర్వాత మరోసారి చదివేంతగా.. లేదంటే మరో రెండు మూడుసార్లు చదివేంతగా.. లేదంటే ఆ నవల గురించి అద్భుతమైన రివ్యూ రాసి దీనికి ప్రాచుర్యం కలిగించేంతగా.. లేదంటే ఆ నవల పేరునే ఆ రచయిత ఇంటిపేరుగా మార్చేంతగా ప్రభావితం చేయవచ్చు.
naveen-ampashayya


‘అంపశయ్య’ నవల ఇవన్నీ సాధించింది. నవీన్‌ గారి ఇంటి పేరు ను ‘అంపశయ్య’గా మార్చింది. అప్పటి నుంచి ఆయన అంపశయ్య నవీన్‌ అయ్యారు. ఈ నవల తెలుగు నవలా సాహిత్యంలో విశిష్టస్థానాన్ని ఆక్రమించుకున్నది. అందుకు రెండు మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి: చైతన్య స్రవంతి శిల్పంలో అంటే కథానాయకుడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో అతనే కథ చెప్పడం. నవల ఒకరోజు తెల్లవారు ఝామున ప్రారంభమై రాత్రికే ముగియడం. ఎందుకంటే ఈ తరహా కథనంలో రచయిత తన భావాలనే కథానాయకుడి భావాలుగా చెప్పి పాఠకుల సహానుభూతి పొందగలిగే అవకాశం ఉంటుం ది. రెండు: అప్పటివరకు రాని తెలంగాణ యాసలో అత్యంత ప్రతిభావంతంగా తెలంగాణ గ్రామీణ జీవితాన్నీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాల నేపథ్యంలో కథగా అల్లడం. అప్పటి కాలమాన పరిస్థితుల్లో, తెలంగాణలోని ఒక మారుమూల పల్లెలోని ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక బ్రిలియంట్‌ విద్యార్థి యూనివర్సిటీ జీవితానికి అడ్జస్ట్‌ కాలేక ఏ విధంగా మానసిక క్షోభను అనుభవిస్తాడో వివరించడం కూడా ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టినవాళ్ళు, అప్పటికి యువకులై, ఆ సందిగ్ధ దశనే అనుభవిస్తున్న విద్యాధికులైన యువతరానికి బాగా నచ్చింది. మూడు: అంతవరకు ఉన్న సాహిత్యంలోలేని సెక్సీ భాష, సంఘటనలు, ఆధునిక సమాజంలో బతుకుతున్నామనుకున్న విద్యాధికులు కూడా మాట్లాడే బూతు మాటలు ఈ నవలలో ఉండటం మూలంగా యువతరాన్ని బాగా ఆకర్షించింది. ఇది ఒకరకంగా అప్పటివరకూ ఉన్న మిథ్యా సాహిత్యపు విలువలపైన తిరుగుబాటు నవల వంటిది.

నేను సినిమా రంగంలోకి ఒక నిర్దిష్ట ఆశయంతో మంచి సినిమాలు మాత్రమే తీయాలనే పట్టుదలతో ప్రవేశించాను. మొట్టమొద ‘అమ్మా! నీకు వందనం!’ అనే సినిమాతో 2013లో నా ప్రయా ణం ప్రారంభించాను. ఆ సినిమా వాణిజ్యపరంగా లాభాలు సంపాదించకపోయినా సంతృప్తి కలిగించింది. గొప్ప సినిమా తీశానన్న అనుభూతి మిగిల్చింది. ఆ సినిమాకు ‘భరతముని సినీ ఆర్ట్స్‌ అకాడెమీ’ వారి ‘ఉత్తమ ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు’ అవా ర్డు నాకు 2014 సంవత్సరానికి లభించింది. ఆ సినిమా అనుభవాలతో రాసి న ‘నా సినిమా సెన్సార్‌ అయిపోయిందోచ్‌!’ అనే నవలకు 2014 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘నంది’ అవార్డు లభించింది. తర్వాత కొన్ని కమర్షియల్‌ అంశాలను కలిపి రామప్ప గుడిని సంరక్షించే కథాంశంతో ‘ప్రణయ వీధుల్లో..’ అనే సినిమా తీశాము. ఈ రెండు సినిమాలు ఆర్థికంగా నష్టాలు చవిచూడటంతో సినిమారంగం నుంచి నిష్ర్కమిద్దామని అనుకున్న. ఒకసారి సినిమా దోమ కుడితే, ఆ పిచ్చి సాధారణంగా వదలదు. అందు కే, సినిమా తీయాలనే తపన నన్ను నిలువనీయలేదు. కానీ, ఎన్నో కథా చర్చలు జరిపినప్పుడు, నా నవలలనే సినిమాగా తీద్దామా అన్న ఆలోచన వచ్చింది. కానీ, అది నిలువలేదు. నవీన్‌ గారి పుట్టినరోజు సందర్భంగా వాగ్దేవి కాలేజీలో డిసెంబర్‌ 24న జరిగిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఒక ఆలోచన మొగ్గ తొడిగింది. ఆ ఆలోచన ఫంక్షన్‌ రోజు నాటికి ఒక రూపం తీసుకుంది. కేంద్ర సాహి త్య అకాడెమీ అవార్డు గ్రహీత, ‘ఆంధ్రప్రభ’లో నా సహరచయిత నవీన్‌ గారి ‘అంపశయ్య’ను సినిమాగా తీయవచ్చునా అనే ఆలోచ న నన్ను నిలవనీయలేదు. అంత గొప్ప నవలను ఇంత వరకు ఎవ రూ సినిమాగా తీసే ప్రయత్నం ఎందుకు చేయలేదని శోధించాను.

‘అంపశయ్య’ ఒక మనోవైజ్ఞానిక నవల. అందులో సాధారణ నవలలో లాగా సంభాషణలు, సంఘటనలు ఉండవు. నవల అం తా రవి అనే కథా నాయకుడి ఆలోచనల ద్వారానే సాగుతుంది. అటువంటి నవల నుంచి సంఘటనలు సృష్టించాలి, సంభాషణలకు స్థానం వెతకాలి. పాత్రలకు ప్రాణం పొయ్యాలంటే మామూలు విషయం కాదు. తర్వాత, ఈ సినిమాలో రొడ్డ కొట్టుడు అంశాలు అంటే ఫైట్లు, పాటలు, డ్యాన్సులు, హీరో హీరోయిన్ల మధ్యన శృం గార సన్నివేశాలు పెట్టి నవల ఫ్యాబ్రిక్‌ను చెడగొట్టలేము. కమర్షియల్‌గా విజయవంతమయ్యేది కూడా కష్టం కాబట్టి, ఈ నవలను చాలామంది ప్రముఖ దర్శకులు ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు. ఈ అవరోధాలను అధిగమించవచ్చునని నాకు ధైర్యం, ఆశ కలిగింది. 2014 డిసెంబర్‌ 24 నాటి పుట్టిన రోజు సభలో ‘అంపశయ్య’ నవలను సినిమాగా తీయబోతున్నానని ప్రకటించాను. కరతాళధ్వనులు మిన్నంటాయి. కానీ చాలామంది తర్వాత నన్ను నిరుత్సాహపరిచారు. కానీ నేను వెనుతిరగలేదు. ఇదొక సాహసంగానే భావిం చి, ‘అంపశయ్య’ నవలను ఇచ్చి ఇద్దరు ముగ్గురితో స్క్రీన్‌ ప్లే రాయించాను. అది నవీన్‌ గారికి నచ్చలేదు. ఇక ఆ పనికి నేనే పూను కున్నా. అందుకోసమని ‘అంపశయ్య’ను కనీసం ఇరవై ముప్పై సా ర్లు చదివాను. ఒక్కో పాత్రను తీసుకుని, నవలలోని ఆ పాత్రకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని కలిపి ఒక పుస్తకంగా బౌండ్‌ చేయించి అలా నాలుగైదు పాత్రలకు నాలుగైదు వేర్వేరు పుస్తకాలు తయారు చేసుకున్నా.

సినిమాలో ఆ పాత్ర నిర్వహించవలసిన అభినయాన్ని దర్శకుడు ముందే తన మనోఫలకం మీద దర్శించాలి. నటీనటుల శారీరక, మానసిక, వాచికం కలాపాన్ని కలిపి ఒక్కో పాత్రకు ఒక్కో అభినయ దృక్కోణం దర్శకులు రూపొందించుకోవలసి ఉంటుంది. అందరూ ఇలా చేస్తున్నారా అంటే చెప్పలేను. నేను మాత్రం సినిమా షూటిం గు ప్రారంభానికి ముందే, ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే వీటితో సిద్ధంగా ఉన్నాను. నా ఉద్దేశంలో, నా సినిమాలో హీరో రవి పాత్రధారి అపరాధభావనతో బాధపడుతూ ఉంటాడు. అందుకోసమని అతనికొక ‘లుక్‌' సృష్టించాలి. అందుకే అతను కొంచెం భుజాలు వంచి, నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఎదుటి వారి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేనట్టు గా కింది చూపులతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాత్ర కోసం శ్యావ్‌ు కుమార్‌ అనే నటుణ్ణి ఎన్నుకున్నాము. ఎంతో అందంగా ఉం డే అతన్ని రవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించడానికి చాలా కష్టాలు పడ్డాము. మిగిలిన పాత్రలందరితో కలిపి ఒక వర్క్‌ షాప్‌ నిర్వహించి, వారి మనసుల్లోకి పాత్రల హావభావాలను డ్రిల్‌ చేశాం.ఈ సినిమాలో అత్యద్భుత నటన ప్రదర్శించిన నటి పావని ‘రతి’ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రతి కోణంలోనూ, రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఇది తెలంగాణ యాసలో తీసిన తెలంగాణ సినిమా. ఈ సినిమా వెనుక గాడ్‌ ఫాదర్స్‌, సోకాల్డ్‌ పరిశ్రమ ప్రముఖులు లేరు. లేకపోతే పావని నటనకు ఆమెకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావలిసి ఉంది.

ముందు ప్రామిస్‌ చేసిన ఏ ప్రొడ్యూసరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. మేం నిరాశలో కూరుకుపోయి ఉన్నప్పుడు కొంతమంది ఎన్నారై మిత్రులు నన్ను ఆదుకున్నారు. ‘లాభాలు పెట్టిన పెట్టుబడి మొత్తం పోయినా మా మిత్రులు బాధ పడలేదు. మా సినిమాకు కలకత్తాలోని ‘సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌'లో కెమెరా విద్యనభ్యసించిన రవి కుమార్‌ నీర్ల అద్భుతమైన పనితనాన్ని చూపించారు. సినిమా పూర్తయిన తర్వాత రమణాచారి, తనికెళ్ళ భరణి. కత్తిమహేశ్‌, ఆకెళ్ళ రాఘవేంద్ర, సంతోషం పత్రిక సురేశ్‌, చందూలాల్‌, అంపశయ్య నవీన్‌ తదితరులు చూసి ప్రశంసించారు. నవీన్‌ గారు.. సినిమా బాగుందనీ, నవలను చెడగొట్టలేదనీ ప్రశంసించారు.నవలా రచయితకు పరిమితులంటూ ఉండవు. సినిమాను దృష్టి లో పెట్టుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కొన్ని బడ్జెట్‌ దృష్ట్యా, కొన్ని అసంభవాల దృష్ట్యా కొన్ని సంఘటనలను నిర్దాక్షిణ్యంగా తొలిగించవలసి ఉంటుంది. అలాగే ‘అంపశయ్య’ నవల ప్రారంభమే రవికి వచ్చే ఒక భయంకరమైన కలతో ప్రారంభమవుతుంది. అందు లో ఒక పెద్ద లోయలోకి తను కొట్టుకుపోతున్నట్టూ, తనతో పాటు అమ్మా, చెల్లెలూ, రతీ కొట్టుకుపోతుండగా వణికిపోతూ రవి నిద్రలో నుంచి మేల్కొంటాడు.

రచయిత ఈ స్వప్న సంఘటనను సృష్టించడంలో ముఖ్యోద్దే శం, రవి ఒక ఆందోళనకు గురవుతున్నాడనీ, తన అమ్మ గురించి బాధ పడుతున్నాడనీ రాబోతున్న పరీక్షల గురించీ, అటు తర్వాత ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే దిగులుతో ఉన్నాడనీ, తనవల్లే రత్తి చనిపోయిందనే అపరాధ భావంతో ఉన్నాడనే సందేశాలను పాఠకులకు ఇచ్చి రవి మానసిక స్థితిని ఎస్టాబ్లిష్‌ చేయడమేనని నాకన్పించింది. ఆ సీను ద్వారా రచయిత చెప్పదలుచుకున్న సందేశమేమిటంటే, హీరో ఒక భయంకరమైన కల కని, వణికిపోతూ లేచాడన్నది మాత్రమే. అందుకని నేను ఆ సంఘటనను మార్చి ఒక నాలుగు రోడ్ల కూడలి మధ్యలో హీరోను నిలబెట్టి, నాలుగు వైపుల నుంచి అమ్మా, రత్తి, పరీక్షలు అం టూ అరిచే వ్యక్తి, మరొకవైపు నుంచి ఉద్యోగాలు ఉద్యోగాలు అంటూ అరుస్తున్నట్టూ, ఆ పిలుపుల గోల భరించలేక రవి ఉలిక్కిపడి లేచినట్టు గా షూట్‌ చేశాను. ఒక పీరియడ్‌ ఫిల్మ్‌గా నిర్మించాలని అప్పటి పరిస్థితులను ప్రతిబింబించే లొకేషన్ల కోసం తీవ్రంగా కష్టపడ్డాను. అన్నీ కుదిరి సినిమా బాగా వచ్చినా, మేము భయపడట్టుగానే, మాకు థియేటర్లు దొరకనీయలేదు. విడుదలైన కొన్ని చోట్లలో సిని మా అద్భుతంగా ఉందని రివ్యూలు వచ్చాయి. ‘అంపశయ్య’ సిని మా తీయడమన్నది ఒక గొప్ప అందమైన అనుభవం. అది చాలా మందికి చేరలేదనే బాధ తప్ప మరే రిగ్రెట్స్‌ లేవు.
- డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ, 79898 25420

145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles