కాలుష్య రాజధాని!


Tue,November 5, 2019 01:47 AM

జనాభా పెరుగుదలను అరికట్టడానికి అభివృద్ధి వికేంద్రీకరణ విధానాలను అనుసరించడం లేదు. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశంలోని అనేక నగరాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రపంచంలోని మొదటి పది అత్యంత కాలుష్య నగరాలలో తొమ్మిది మన దేశంలోనే ఉన్నాయి. మొదటి పదిహేడు నగరాల్లో పదమూడు మన దేశంలోనివే. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టే విధానాన్ని దృఢచిత్తంతో అమలు చేయడమే లేదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఎక్కడో దూరంగా ఉన్న రైతులను కాలుష్యానికి బాధ్యులను చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

పాలనావ్యవస్థ ఎంత మొద్దుబారిపోయి ఉన్నదో తెలువడానికి దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న కాలుష్యమే ఉదాహరణ. చలికాలం వచ్చిందంటే చాలు అక్టోబర్‌ నుంచి నాలుగు నెలలపాటు పొగ మంచుతో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. దీపావళి సమయంలో గాలి మరింత ధూళి కణాలతో నిండిపోయి ఉంటుంది. వీధిలోనే కాదు, ఇంటిలో ఉన్నా కాలుష్యం నుంచి తప్పించుకోలేని దుస్థితి. ప్రతి ఏటా ఇదే ప్రమాదకర పరిస్థితి. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసి వచ్చింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సరిబేసి నెంబరు వాహన పద్ధతిని మళ్ళా ప్రవేశపెట్టింది. చెత్త తగులబెట్టడం, ఇండ్లు కూలగొట్టడం లేదా నిర్మించడం ద్వారా కాలుష్యం, దుమ్ము చెలరేగకుండా చర్య లు తీసుకోవాలని, పరిశ్రమల కాలుష్యం వెలువడకుండా నివారించాలని పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ సూచించింది. ప్రజలు ఇంటిలో పెట్టుకోవడానికి గాలి శుద్ధి యంత్రాలను, ముఖానికి తగిలించుకునే మాస్క్‌లను కొనుక్కుంటుండటంతో వీటి పేర కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతున్నది. ఢిల్లీ పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే ఇప్పుడు తీరిగ్గా- కేంద్రం ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపుతున్నదట! రోజువారీ సమీక్షలు సాగిస్తున్నదట! ఇప్పటికి కొన్నేండ్లుగా ఢిల్లీ కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్న విషయం కేంద్రానికి తెలువదా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు, రాజధానిలో స్వయంగా అనుభవిస్తున్నదే. ఢిల్లీ పరిస్థితి విషమించి విదేశీ దౌత్యవేత్తలు కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకుంటున్నారు. చలికాలం వచ్చి, దీపావళి పొగ కమ్మితే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవా!

కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతలు తదితర అంశాల్లో తమకే అధికారాలు ఉండాలంటూ గొడవపడి సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం గుర్తుండే ఉంటుంది. అధికారాల కోసం ఇంత వెంపర్లాడే ప్రభుత్వాలకు దేశ రాజధానిలోనే ఇం త ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంటే మాత్రం పట్టదు. ఢిల్లీలో కాలుష్యం అనగానే పం జాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో పొలాల్లోని దంట్లు కాలబెడుతున్నారని, పక్క రాష్ర్టాల రైతుల మీదికి నెట్టివేయడం సాధారణమైపోయింది. ఈసారి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరో అడుగు ముందుకువేశారు. తమ ఆరోగ్యం దెబ్బతింటున్నదని, అందువల్ల మీ రాష్ర్టాల్లో రైతులు దంట్లు తగులబెట్టకుండా చూడాలని పంజాబ్‌, హర్యా నా ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాయాలని ఆయన బడి పిల్లలకు సూచించారు. ఒక బాధ్యతాయుత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పొరు గు రాష్ర్టాలతో చర్చించలేరా? దీనిని కూడా రాజ కీయ కోణంలో చూడాలా? వాతావరణ కాలు ష్యం సరిపోలేదని ఇక పిల్లల మనసులను కలుషితం చేస్తున్నారా! ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ర్టాల పొలాల్లో దంట్లు కాలబెట్టడం కొంత వర కు కారణం కావచ్చు. కానీ ఆ ఒక్క చర్యే కాలుష్యాన్నంతా పుట్టించడం లేదు. ఢిల్లీలోనే భరించలేనంత కాలుష్యం పుట్టుకొస్తున్నది. దానిని నివారించడం ఢిల్లీ ప్రభుత్వ చేతుల్లోనే ఉన్నది. అభివృద్ధి విధానాలు, నగరాల్లో జనాభా కేంద్రీకర ణ, పరిశ్రమలు మొదలైన అనేక కారణాలున్నాయి. కొన్ని విధానపరమైనవి అయితే మరికొన్ని పరిపాలనాపరమైనవి. కేంద్ర రాష్ర్టాలు తలుచుకుంటే సాధ్యమయ్యేవే. కానీ ఏండ్లు గడుస్తున్నా ప్రజగగ్గోలు పెట్టినప్పుడల్లా హడావుడి చేయడమే తప్ప పక్కా వ్యూహంతో వ్యహరించడమే లేదు.

కేంద్ర ప్రభుత్వం భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసిన వివరాల ప్రకారం ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన కారకాలు వాహనాలు, పరిశ్రమలు. ఇప్పటికీ సీఎన్‌జీ వాహనాలకు తగినన్ని ఫిలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనేలేదు. ఇక వాహనదారులు పెట్రోలు, డీజిల్‌ వైపు మొగ్గుచూపడంలో ఆశ్చర్యమేముంది. నగరంలోనే అనేక కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమలు కాలుష్యకారక ఇంధనాలను ఉపయోగిస్తున్నాయి. నిర్మాణసంస్థలు దుమ్ము వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చెత్త తగులబెట్టడం సాధారణం. ఢిల్లీలో భారీగా జనాభా పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జనాభా పెరుగుదలను అరికట్టడానికి అభివృద్ధి వికేంద్రీకరణ విధానాలను అనుసరించడం లేదు. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశంలోని అనేక నగరాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రపంచంలోని మొదటి పది అత్యంత కాలుష్య నగరాలలో తొమ్మిది మన దేశంలోనే ఉన్నాయి. మొదటి పదిహేడు నగరాల్లో పదమూడు మన దేశంలోనివే. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టే విధానాన్ని దృఢచిత్తంతో అమలు చేయడమే లేదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఎక్కడో దూరంగా ఉన్న రైతులను కాలుష్యానికి బాధ్యులను చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ ప్రజలకు స్వచ్ఛభారత్‌ పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం కనీసం ఢిల్లీని చక్కదిద్దుతే బాగుండేది.

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles