దారుణం


Wed,November 6, 2019 12:32 AM

ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. జరిగిన తప్పులకు ఏ ఒక్కరినో నిందించటం కాకుండా వ్యవస్థాగతంగా పారదర్శకంగా, నిబద్ధతతో వ్యవహరించినప్పుడు అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ముఖ్యంగా భూ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరిధిలో అధికారుల పరిధి, పర్యవసానాలను ప్రజలకు సావధానంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది.

విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారి పట్టపగలే దారుణహత్యకు గురికావటం హృదయ విదార కం. తనకు న్యాయం దక్కటం లేదన్న నిరాశా నిస్పృహ, చట్టపరిధిలో భూ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియని మూర్ఖత్వం, క్షణికావేశం ఒకరిని హంతకుడిగా మార్చింది. ఈ వివాదంతో ఏ సంబంధం లేని అధికారిణి ప్రాణం పోయింది. చట్టంలోని లొసుగులు, అధికార ధనబలంతో తిమ్మిని బమ్మిని చేసి అన్నింటినీ పాదాక్రాంతం చేసుకోవాలనే దురాశాపరుల చిక్కుముళ్లలో చట్ట పరిధిలో పనిచేసుకుంటూ పోయే అధికారిణి విజయారెడ్డి బలికావటం తీవ్ర విషాదం. తాసిల్దార్ విజయారెడ్డి హత్య గుండెలో తడి ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన హేయమైన చర్య. విజయారెడ్డిని రక్షించబోయిన డ్రైవర్ మంటల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అటెండర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతటి అఘాయిత్యానికి పాల్ప డిన నిందితుడు సురేశ్ కూడా అరువై శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘోర ఉదంతంలో ఎవరికీ న్యాయం దక్కింది లేదు. కానీ మానవత్వం మాత్రం మం టల్లో కాలి బూడిదైంది.

గ్రామీణ నిరుపేద రైతులకు అండగా ఉండాల్సిన రక్షిత కౌలుదారి చట్టం పేదలకే ఉరితాడుగా మారింది. విజయారెడ్డి దారుణ హత్యోదంతానికి తాజా ఉదాహరణే బాచారం భూ వివాదం. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన రైతులకు బాచారం గ్రామ పరిధిలో భూములున్నాయి. కూర దుర్గయ్య అనే రైతు పేర సర్వేనెం-96లో 5 ఎకరాల 37 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి ఆయన తండ్రి వెంకయ్య నుంచి వారసత్వంగా వచ్చినట్లు దస్తావేజులున్నాయి. వెంకయ్యకు ఇద్దరు కొడుకులు దుర్గయ్య, కృష్ణ. ఈ కృష్ణ కొడుకే తాజా ఘటనలో నిందితుడు సురేశ్. ఈ భూమిని రాజా ఆనందరావు నుంచి 1954లో కొనుగోలు చేసి హక్కులు పొందారు. 1996 ఆర్‌వోఆర్ చట్టం కింద పట్టా పాసుపుస్తకాలు పొందారు. రెవెన్యూ రికార్డుల్లోనూ పట్టా, సాగుదారులుగా కొనసాగుతున్నారు. ఓఆర్‌ఆర్ నిర్మాణంలో నష్టపోయిన భూమికి పరిహారం కూడా పొందారు. అయితే రక్షిత కౌలుదారు హక్కుచట్టం-1950 వారి పాలిట శాపంగా మారింది. 2014లో కౌలుదారు చట్టం కింద తమకు హక్కులున్నాయంటూ అహ్మద్ హయ త్, మరికొందరు తెరమీదికి వచ్చారు.

ఆ భూమి తమదేనంటూ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ నుంచి రైతులకు నోటీసులు పంపారు. సంయు క్త కలెక్టర్ ఆదేశాల మేరకు హయత్‌నగర్ ఆర్డీవో విచారణ చేపట్టి కౌలు చట్టం ప్రకారం అహ్మద్ హయత్, తదితరులకే భూమిపై హక్కులు కల్పి స్తూ ఆదేశాలు జారీచేశారు. దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లారు. కేసు హైకోర్టులో ఉండగానే, అహ్మద్ హయత్ మరో అడుగు ముందుకేసి దాన్ని గుండ్లపోచంపెల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కు అమ్మాడు. తరతరాలుగా వారసత్వ ఆస్తిగా సంక్రమించిన భూమి కండ్లముందే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలయి చేతులు మారుతున్న తీరుతో రైతులు తీవ్రంగా కలత చెందారు. నిందితుడు సురేశ్ హైకోర్టు నుంచే నేరుగా తాసిల్దార్ ఆఫీసుకు వచ్చి ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం జాలోని గూడెంకు చెంది న ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో నల్లగొండ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త చనిపోయిన తర్వాత తన మూడున్నర ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని ఆ మహిళ పిల్లలతో సహా ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడింది. ఈ ఘటనలు భూ ఆక్రమణదారుల దురాగతాలకు అద్దం పడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అవతరణ తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూములు బంగారం కన్నా విలువైనవిగా మారిపోయాయి. ఈ పరిస్థితే అనేక వివా దాలకు కారణమవుతున్నది. ఎకరం భూమి కోట్లలో పలుకుతుండటంతో ధన మదాంధులు, అక్రమార్కులు అమాయక పేదల భూములపై కన్నేస్తున్నారు. ధన బలంతో అధికారులను లోబర్చుకొని లేని లిటిగేషన్లు సృష్టించి అమాయకుల భూములను కాజేయజూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోం చే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు కృషి చేసింది. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. జరిగిన తప్పులకు ఏ ఒక్కరినో నిందించటం కాకుండా వ్యవస్థాగతంగా పారదర్శకంగా, నిబద్ధతతో వ్యవహరించినప్పుడు అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ముఖ్యంగా భూ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరిధిలో అధికారుల పరిధి, పర్యవసానాలను ప్రజలకు సావధానంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. బాచా రం భూ వివాదం ఉదంతంలో రైతులు ఎదుర్కొన్న పరిస్థితులను ఉదాసీనతతో కొట్టి పారేయలేనివి. గ్రామీణ నిరుపేద రైతులు ధనభలం ఉన్నవాడితో కోర్టులలో సుదీర్ఘ పోరాటం చేసి గెలువలేని స్థితి ఉన్నదన్న సత్యాన్ని కాదనలేం. తమకు రక్ష ణ లేదని, ఆదుకు నే వారెవరూ లేరని భావించినప్పుడే నిరాశానిస్పృహలతో అఘాయిత్యాలకు ఒడిగడుతారు. విజయారెడ్డి ఉదంతం ఆసరా గా కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు నేతలు రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం ఎవరికీ భావ్యం కాదు.

212
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles