మూకరాజ్యం!


Sat,November 9, 2019 01:06 AM

పోలీసులు వృత్తి నిబద్ధతను కలిగి ఉంటే ఒత్తిడులు తగ్గిపోతాయి. ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. న్యాయవాదుల్లో కూడా వృత్తివిలువలను నెలకొల్పడానికి ఇదే రం గంలోని పెద్దలు పూనుకోవాలె. తీస్ హజారీ ఘర్షణ తదనంతర పరిణామాలు చట్టబద్ధ పాలనకు ఏర్పడిన ప్రమాదాన్ని సూచిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన వ్యవస్థలు పతనం కావడం ఆందోళనకర పరిణామం. ఈ ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు, విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలె. అక్కడితో ఆగకుండా ఇటువంటి మూకదాడులకు, చట్టాన్ని అతిక్రమించడానికి మూల కారణాలను అన్వేషించాలె.

ఢిల్లీలో న్యాయవాదులు, పోలీసుల మధ్య ఘర్షణ వృత్తి విలువల పతనానికి, వ్యవస్థల బలహీనతకు అద్దం పడుతున్నది. చట్టానికి పరిరక్షకులుగా వ్యవహరించవలసిన వర్గాలు దిగజారిపోయి ఘర్షణ పడితే, ఇక చట్టబద్ధ పాలనకు అర్థమేముంటుంది! న్యాయస్థాన ప్రాంగణంలోనే మూకరాజ్యం నెలకొనడం తీవ్రంగా పరిగణించలసిన విషయం. సాధారణంగా ఘర్షణలకు చిన్న ఘటన లే కారణంగా కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే వ్యవస్థాగత లోపాలు ఒక చిన్న ఘటన ద్వారా బయటపడ్డాయని అర్థమవుతుంది. ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం వాహనాల పార్కింగ్ విషయమై లేదా రెండు వాహనాలు ఢీకొనడం వల్ల పోలీసులకు, న్యాయవాదులకు వివాదం చెలరేగింది. పోలీసులు కొందరు న్యాయవాదులను లాకప్‌లో పడేసి కొట్టారని కూడా అంటున్నారు. ఈ ఘటన రెండువర్గాల ఘర్షణ తీవ్రమైంది. న్యాయవాదులు పోలీసు వాహనాలను దగ్ధం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు న్యాయవాదులు గాయపడ్డారు. ఘర్షణలో ఇరువై మంది పోలీసులు గాయపడ్డారు. పలువురు న్యాయవాదులకు కూడా గాయాలయ్యాయి. ఆ తరువాత సోమవారం న్యాయవాదులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఒక పోలీ సు అధికారిపై దాడిచేశారు. ఈ ఘటన పోలీసుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. పోలీసులు తమ కుటుంబాలతో సహా తమ అధికారి కార్యాలయం ముందు నిరసనకు దిగారు. న్యాయవాదులు, పోలీసు ల వ్యవహారసరళి సామాన్య ప్రజలకు ఎటువంటి సందేశాన్నిస్తుంది?

ఢిల్లీ హైకోర్టు న్యాయస్థాన ప్రాంగణంలో జరిగిన ఘర్షణపై న్యాయవిచారణకు ఆదేశించింది. ఈ గొడవతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఒక ఏఎస్‌ఐ సస్పెండ్ కాగా ఒక కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్య తీసుకుంటున్నారు. ఈ ఘర్షణతో సం బంధం ఉన్న న్యాయవాదులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఒత్తిడిలతో కూడిన చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం పేర్కొన్నది. దీంతో న్యాయస్థానం తమపైనే చర్య తీసుకొని న్యాయవాదులను వెనుకేసుకొస్తున్నదనే అభిప్రాయం పోలీసులకు ఏర్పడ్డది. పోలీసులు న్యాయవాదులపై కక్షసాధించే అవకాశం ఉండకూడదనేది న్యాయస్థాన ఉద్దేశమై ఉంటుంది. తాజా ఉదంతంలో పోలీసుల వైపు తప్పున్నట్టయితే న్యాయం పొందడానికి బార్ కౌన్సిల్, న్యాయస్థానం ఉన్నాయి. పైస్థాయి పోలీసు అధికారుల తో కూడా సంప్రదింపులు జరుపవచ్చు. కానీ న్యాయమార్గాన్ని వదిలి కండబలం ప్రదర్శించడమేమిటి? కొన్నేండ్లుగా న్యాయవాదుల వ్యవహారసరళి ఏ మాత్రం గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా లేదు. గతంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ కోర్టుకు హాజరుకావడానికి వస్తే, కొందరు న్యాయవాదులు అత డి మీద, ఆయనతో పాటు వచ్చిన విద్యార్థులు అధ్యాపకుల మీద, పాత్రికేయుల మీద దాడులు చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. న్యాయ ప్రక్రియపై నమ్మకం పెంచవలసిన వారు న్యాయస్థాన ప్రాంగణంలోనే మూకదాడులకు దిగడమేమిటి? ఈ న్యాయవాదులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తాజా ఉదంతంలో పోలీసులతో ఘర్షణను చిత్రీకరిస్తున్న పాత్రికేయులను, సాధారణ పౌరులను కూడా వదలకుండా దాడిచేశారు. న్యాయదేవత కండ్లముందే ఏమిటీ మూకరాజ్యం!

న్యాయవాదుల దాడుల పట్ల పోలీసులు వారి కుటుంబాలు నిరసన ప్రదర్శన చేపట్టడం కూడా ఉపేక్షించలేని ఉదంతం. కిందిస్థాయి పోలీసులలో ఎంతోకాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఈ ఘటనతో బయటకువచ్చి ఉంటుంది. ఈ ఒక్క వివాదం చుట్టే తిరుగకుండా, కిందిస్థాయి పోలీసు ల కష్టసుఖాలపై అధ్యయనం జరిపి వారిని సమాధానపరుచాలె. పోలీసు శాఖలో సంస్కరణలు అనగానే రాజకీయజోక్యం లేకుండా అపరిమిత అధికారులు కట్టబెట్టడమనే తప్పుడు సూచనలు చర్చకు వస్తున్నాయి. ఇటీవల నిరసనకు దిగిన పోలీసులు వివాదాస్పద అధికారిణి కిరణ్‌బేడీని అభిమానిస్తూ ఫొటోలు ప్రదర్శించడం ఇదే అప్రజాస్వామిక భావజాలాన్ని సూచిస్తున్నది. తమ చర్యలకు ఎదురు ఉండకూడదని పోలీసులు భావించకూడదు. పోలీసుల్లో జవాబుదారీతనం ఉం డాల్సిందే. పోలీసుల్లో వృత్తి విలువలను, వృత్తి ధర్మాన్ని, ప్రజాస్వామిక భావజాలాన్ని ఎట్లా నూరిపోయాలనేదే ప్రధాన అంశం. పోలీసులు వృత్తి నిబద్ధతను కలిగి ఉంటే ఒత్తిడులు తగ్గిపోతాయి. ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. న్యాయవాదుల్లో కూడా వృత్తివిలువలను నెలకొల్పడానికి ఇదే రం గంలోని పెద్దలు పూనుకోవాలె. తీస్ హజారీ ఘర్షణ తదనంతర పరిణామాలు చట్టబద్ధ పాలనకు ఏర్పడిన ప్రమాదాన్ని సూచిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన వ్యవస్థలు పతనం కావడం ఆందోళనకర పరిణామం. ఈ ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు, విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలె. అక్కడితో ఆగకుండా ఇటువంటి మూకదాడులకు, చట్టాన్ని అతిక్రమించడానికి మూల కారణాలను అన్వేషించాలె. ఈ మూక సంస్కృతిని రూపుమాపి ఉన్నతమైన వృత్తి విలువలను పాదుకొల్పడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడవలసిందే.

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles