గాంధీ నిత్యస్ఫూర్తి!


Sun,November 10, 2019 01:20 AM

బక్కచిక్కిన మనిషి! కళ్లజోడు, చిరునవ్వు, ప్రశాంతమైన కళ్లు ఇవి మనకు గుర్తొచ్చే అంశాలు. తుండుగుడ్డ, అంగవస్త్రం, చేతికర్ర అదనం. ఇంకా మొల గడియారం, మూడుకోతులు. ఇవన్నీ కూడా మనకు సందేశాన్ని పంచే విషయాలే! ఆయన సహజత్వాన్ని, సరళ జీవితాన్ని చాటిచెప్పడమే కాదు, మన దేశ పరిస్థితులకూ, శీతోష్ణస్థితికి, ఆర్థిక పరిస్థితికి తగిన విషయాలను కూడా తెలుసుకుంటే బోధపడుతుంది.

అది 1947 సంవత్సరం నవంబర్‌ 12. ఆ రోజు దీపావళి. దేశ విభజన జరిగి, మత కల్లోల గాయాలు, కాందిశీకుల యాతనలు ఇంకా తగ్గలేదు. పాకిస్థాన్‌ నుంచి తరలివచ్చిన కాందిశీకులను ఉద్దేశించి గాం ధీజీ కురుక్షేత్రం వెళ్లి ప్రసంగించాలి. అయితే వెళ్లలేకపోయారు. సరిగ్గా ఈ సమయంలో రేడియోను వినియోగించుకొమ్మమని సూచనతోపాటు, ఒత్తిడి కూడా పెరిగింది. ఇక్కడ ఒత్తిడి అనే మాట ఎందుకంటే అంతకుముందు కొన్నేండ్లుగా గాంధీ రేడియో లో ప్రసంగించాలని ప్రజలు కోరడం, ప్రపంచ యుద్ధం అనో, మరోటి అనో బ్రిటీష్‌ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. స్వాతంత్య్రం సిద్ధించిం ది. కానీ గాంధీ ఇంకా రేడియోలో ప్రసంగించలేదు. కాబట్టి ఎంతోమం ది ఆయన ప్రసంగాన్ని రేడియోలో వినాలని కోరుతూ వచ్చారు. గాంధీజీకి రేడియో అంటే కాస్త బిడియం. చాలామంది అభ్యర్థించడంతో ఆయ న అంగీకరించారు. ఢిల్లీ-కురుక్షేత్ర దూరాన్ని జయించాలంటే గాంధీకి రేడియోనే మార్గంగా కనబడింది.

అత్యంత అప్రమత్తంగా, ప్రతిభావంతంగా, దాదాపు సంపూర్ణంగా వనరులు వినియోగించుకోవడం గాంధీ విధానం. ఎంత పరిమితమైన వనరులున్నా విజయవంతంగా సాగిపోవడం ఆయన నైజం. గాంధీ పంతొమ్మిదేండ్ల వయస్సులో ఇంగ్లండు వెళ్లిన తర్వాత మొట్టమొదటిసారి వార్తాపత్రికలను చూశారు. గమనించిందే తడవుగా, వార్తా పత్రికకు ఉన్న సౌలభ్యాలనూ, ప్రయోజనాలనూ గుర్తించారు. అంతే రెండేండ్లలో అక్కడ వెజిటేరియన్‌ పత్రికకు ఆహారం, పండుగలు, సాంప్రదాయాలు, అలవాట్లు గురించి రాయడం మొదలుపెట్టాడు. వెజిటేరియన్‌ ఉద్యమంలో చేరారు. రాత, రాతతో ప్రారంభించిన పని ఉద్యమంలా సాగడం మొదలైంది. ఈ ప్రక్రియ ఆయన కన్ను మూసినప్పుడే ఆగిపోయింది. దక్షిణాఫ్రికాలో దిగిన మూడోరోజున న్యాయస్థానంలో అవమానం జరిగింది. వ్యాకులపడిన గాంధీ ఆ సంఘటన క్రమాన్ని స్థానిక వార్తాపత్రికకు రాశారు. ఒక్కరోజులో పెద్ద ప్రచారం లభించింది. 35 ఏండ్ల వయసులో దక్షిణాఫ్రికాలో ‘ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రిక కు బాధ్యతలు స్వీకరించాడు. సంపాదకుడున్నా అన్ని బాధ్యతలు గాంధీ స్వీకరించి మమేకమయ్యారు. ప్రతివారం తప్పక రెండు వ్యాసాలు రాసేవారు.

‘ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రికకు ఎక్స్‌ఛేంజ్‌ కాపీలుగా 200 పత్రికలు లభించేవి. ఆ పత్రికలు చదివి, ఉపయోగపడుతాయనే అంశాలను తన పత్రికలో తిరిగి ప్రచురించేవాడు. సరళమైన భాషలో, విశేషణాలు, అలంకారాలు లేకుండా, ప్రకటనలు లేకుండా పత్రిక సాగేది. అనువాదంలో, పదాల ఎంపికలో జాగ్రత్తపడేవారు. పేరులేని లేఖలంటే గౌరవం ఉండేది కాదు, తీవ్రమైన విమర్శలున్న దాఖలాలను కూడా ప్రచురించేవాడు. పదేండ్ల పాటు ఈ పత్రిక కోసం పాటుపడ్డాడు. తొలు త నష్టాల్లో నడిచే పత్రికకు ప్రతినెలా రూ.1200 తను ఖర్చుపెట్టాడు. ఇలా రూ.26,000 నష్టపోయాడు. ఇది దక్షిణాఫ్రికా విషయం కాగా; భారత్‌లో ముప్ఫై ఏండ్ల పాటు పత్రికలు నడిపారు. ‘ఇండియన్‌ ఒపీనియన్‌'కు గుజరాతీ సంచిక ఉండగా; మన దేశంలో ‘నవజీవన్‌' ప్రారంభించి తర్వాత దీన్ని ఇంగ్లీషులో ‘యంగ్‌ ఇండియా’ అన్నారు. ‘హరిజ న్‌' పత్రికను జైల్లో ఉన్నపుడు ప్రారంభించారు. దీన్ని ఇంగ్లీష్‌లో ప్రచురించాలని ఒక మిత్రుడు ప్రతిపాదిస్తే అంగీకరించాడు. మొదట పదివేల కాపీలతో ప్రారంభించి, మూడునెలల్లో స్వయం పోషకత్వం సాధించాలని నిర్ణయించారు. అయితే రెండు నెలల్లోనే స్వయం పోషకత్వం సాధించారు. తర్వాతికాలంలో ఈ వారపత్రిక మొత్తం పది భాషల్లో వెలువడేది. ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ, తమిళం, తెలుగు, ఒరియా, మరా ఠి, గుజరాతీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ప్రచురితమైంది. గాంధీ భారతదేశంలో ఏ పత్రికను నష్టాలతో నడుపలేదు. ఆయన ప్రకటనలు ప్రచురించలేదు. అంతేకాదు ఈ మూడు విషయాలను మనం గమనించాలి.

ఒకసారి గాంధీని, ఆయన వ్యాసాలనూ తీసుకువెళ్తున్న రైలు ఆలస్యం గా నడుస్తున్నది. వ్యాసాలను పోస్టు చేయడానికి అవకాశం దొరుకలేదు. ఒక మనిషి ద్వారా వ్యాసాలను బొంబాయి పంపించి, పత్రిక స్వంత ప్రచురణాలయంలో కాకుండా బొంబాయిలో ప్రచురించి పత్రికను సకాలంలో విడుదల చేశాడు. ‘యంగ్‌ ఇండియా’లో ప్రచురింపబడిన విమర్శల కారణంగానే భారతదేశంలో తొలుత గాంధీ అరెస్టు అయ్యాడు. డబ్భు ఏండ్ల వయస్సులో కూడా ‘హరిజన్‌' పత్రిక పని పూర్తి చేయడానికి అర్థరాత్రి ఒంటిగంటదాకా మేల్కొని పూర్తిచేసేవాడు. నడుస్తు న్న రైలులో చాలాసార్లు రాశాడు. ప్రసిద్ధ సంపాదక వ్యాసాలు కింద ‘రైల్లోంచి’ అని ఉంటుంది. గాంధీ ఎంత ప్రొఫెషనల్‌ జర్నలిస్టో తెలుసుకోవడానికి ఈ విషయాలు దోహదపడతాయి. 1910లో దక్షిణాఫ్రికాలో అక్కడి బ్రిటిష్‌ ప్రభుత్వం అచ్చు యంత్రాలు మొదలుపెట్టాలంటే భారీ మొత్తంలో డిపాజిట్‌ అవసరమనే నియమం పెట్టింది. ఇది పత్రిక ల ప్రచురణను ఆపడానికి ఉద్దేశించిందే! దీన్ని బాగా వ్యతిరేకించడమే కాదు, శిక్ష కూడా పొందాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం మీద 1930 సివిల్‌ డిసొబిడియన్స్‌ మూమెంట్‌ మొదలుపెట్టినపుడు అమెరికాలో ఉన్నవారికి గాంధీ ఇలా టెలి గ్రాం పంపారు. ‘ఐ వాంట్‌ వరల్డ్‌ సింపథి ఇన్‌ దిస్‌ బ్యాటిల్‌ ఆఫ్‌ రైట్‌ ఎగెనెస్ట్‌ మైట్‌' కేవలం పదకొండు పదాలే, అయినా గొప్ప అర్థాన్ని ఇవ్వడమే కాదు ప్రేరేపిస్తాయి కూడా!

1947, నవంబర్‌ 12 మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ మహాత్ముడు రాజకుమారి అమృతకౌర్‌తో కలసి ఢిల్లీలోని బ్రాడ్‌కాస్టింగ్‌ హౌజ్‌కు వచ్చారు. అప్పటికి రికార్డు చేసి వినిపించే అవకాశం లేదు. ప్రార్థనకు గాంధీ వాడే చెక్క వేదిక వంటిది ఏర్పాటుచేశారు. స్టూడియోలోకి వెళ్ల గానే గాంధీ చాలా సహజంగా మారిపోయాడు. బిడియం మాయమైం ది. రేడియో పరికరాన్ని సొంత పరికరంగా భావించాడు. ప్రసంగం హాయిగా 20 నిమిషాలు సాగింది. 1947, నవంబరు 13న హిందూస్తాన్‌ టైవ్‌ పత్రిక వివరమైన కథనం ప్రచురించింది. అప్పటికి అదే గాంధీకి ఆకాశవాణి ప్రసంగం చివరిదని ఎవరికీ తెలియదు. తర్వాత మూడు నెలల్లోపే హత్య చేయబడ్డాడు. ఈ అపురూపమైన గాంధీ ఆకాశవాణి ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ 2001 నుంచి ‘ప్రజోపయోగ ప్రసార దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రసారమంటే భావ ప్రసారం లేదా సమాచార ప్రసారం.

గాంధీ దీన్ని ఎలా పరిగణించారు? వేటిని తన భావ ప్రసారానికి వినియోగించుకున్నారు? వంటి ప్రశ్నలను పరిశీలించాలంటే ఆయన మొత్తం జీవితాన్ని తరచిచూడాలి. 1946లో కలకత్తాలో మతకలహాలు చెలరేగాయి. ఆ సమయంలో శాంతిస్థాపన కోసం గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు. బెంగాలీ పాత్రికేయులు ప్రజలకు సందేశం ఇవ్వండని అడిగారు. ఆ రోజు గాంధీ మౌనవ్రతం. కనుక పలక మీద బెంగాలీ లిపిలో ‘అమార్‌ జీబనీ అమార్‌ బానీ’ అని రాశారు. నా జీవితమే నా సందేశం అని ఆ మాటలకు అర్థం. మరి గాంధీజీ ఏమిటో ఎలా తెలుసుకోవాలి? ఆయన ఏం చెప్పారో, ఎలా చెప్పారో గమనించి అలాగే ఆయన వస్తువులు, దుస్తులు, పనులు కూడా జాగ్రత్తగా గమనించాలి.
Venugopal
మాటా-మౌనం.. తన కమ్యూనికేషన్‌కు మాటను, మౌనాన్ని వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమా రు నలభై ఏండ్లు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడుపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీష్‌ వాడినా, మాతృభాష ను, భారతీయ భాషలను ఆయన నిరాదరించలేదు. ఆయన తొలి పుస్తకంతో పాటు ఆత్మకథను కూడా గుజరాతీలో రాశారు. పత్రికలే కాదు కరపత్రాలు ప్రచురించారు. మాట పనిచేయని చోట మౌనవ్రతం కూడా పాటించారు.
ఆకారం.. బక్కచిక్కిన మనిషి! కళ్లజోడు, చిరునవ్వు, ప్రశాంతమైన కళ్లు ఇవి మనకు గుర్తొచ్చే అంశాలు. తుండుగుడ్డ, అంగవస్త్రం, చేతికర్ర అదనం. ఇంకా మొల గడియారం, మూడుకోతులు. ఇవన్నీ కూడా మనకు సందేశాన్ని పంచే విషయాలే! ఆయన సహజత్వాన్ని, సరళ జీవితాన్ని చాటిచెప్పడమే కాదు, మన దేశ పరిస్థితులకూ, శీతోష్ణస్థితికి, ఆర్థిక పరిస్థితికి తగిన విషయాలను కూడా తెలుసుకుంటే బోధపడుతుంది. ప్రవర్తన.. మాట మాత్రమే మృదువు కాదు, ప్రవర్తన కూడా లలితం. మహా ఓపిక. తన శత్రువుకు కూడా హానిచేయని ఆలోచనా రీతి. నచ్చజెప్పి, అందరం మెరుగుకావాలనే ధోరణి. దానికోసమే సత్యాగ్రహ భావనను ప్రపంచానికి అందించిన ప్రతిభావంతుడు. మన దేశంలోని మతాలన్నింటిలో ఉండే మంచిని స్వీకరించిన ఉదారుడు. ఆయన స్పృశించని ఆలోచన లేదు. తలపెట్టని సత్కార్యం లేదు. ఆయన దీనికి వాడిన విధానం సంభాషణం. తద్వారా సమాజాన్ని సంబాళించడం. కనుక ఆయన మార్గం సవ్యమైన, సమగ్రమైన జర్నలి జం, తద్వారా సిద్ధించే ఆరోగ్యవంతమైన, ఆశావహమైన సమాజం గమ్యం గాంధీ నిత్యస్ఫూర్తి!

444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles