ప్రతిజ్ఞను నిలబెడుదాం

Tue,August 13, 2019 01:08 AM

paidimarri
భిన్నత్వంలో ఏకత్వమనే భావనతోనే మనదేశం మనుగడ సాగించగలుగుతున్నది. గురజాడ నుంచి గరిమెళ్ళ వరకు తమతమ గేయాలతో ప్రజల్లో దేశభక్తిని, సోదరభావాన్ని పెంచడానికి దోహదం చేశారు. అందులో పైడిమర్రి వెంక ట సుబ్బారావు రచించిన ప్రతిజ్ఞ ఒకటి. దేశవ్యాప్తంగా భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ 1965 నుంచి వివిధ భాషల్లో విద్యార్థుల చేత చదువబడుతున్నది. ఒకవైపు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారినప్పటికీ మనుషుల మనసులు కుం చించుకుపోతున్నాయి. జీవన విధానంలో టెక్నాలజీ పాత్ర పెరుగడం వల్ల ఎదుటివారిపై ఆధారపడే అవసరం రోజు రోజుకూ తగ్గిపోతున్నది. ఈ క్రమంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా తగ్గిపోయింది. బోధనలో నైతిక విలువలకు స్థానం లేకుండాపోతున్నది. మరోవైపు సాం ఘిక మాధ్యమాల ద్వారా కులమతాల పేరుతో పౌరులను రెచ్చగొట్టి విభజించేశక్తులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రతిజ్ఞలోని పదాలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. 1916 జూన్ 10న నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో జన్మించిన పైడిమర్రి కవిగా, రచయితగా, బహుభాషా కోవిదునిగా పేరు పొందాడు. తన రచనలతో తెలుగు భాషకు వన్నెతెచ్చారు.

ఖజానా శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1962లో విశాఖపట్నంలో జిల్లా ఖజానాధికారిగా పనిచేస్తున్న సమయంలో పైడిమర్రి ప్రతిజ్ఞ రాశారు. ఆయన మిత్రుడు తెన్నేటి విశ్వనాథం చొరవతో ప్రతిజ్ఞ పాఠ్యపుస్తకాల్లోకి వచ్చింది. కానీ పేరు మాత్రం ముద్రించబడలేదు. దేశవ్యాప్తంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చదువబడుతున్నప్పటికీ కేవలం తెలుగు రాష్ర్టాల్లోనే ఆయన పేరు ముద్రితమైంది. దేశవ్యాప్తంగా ఈ పని చేయవలసి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం 2016లో పైడిమర్రి శతజయంతిని నిర్వహించింది. పైడిమర్రి పలుభాషల్లో గ్రంథాలు, కథలు, నవలలు, నాటకాలు రచించారు. వీటిలో చాలా గ్రంథాలు అముద్రితంగానే ఉన్నాయి. పైడిమర్రి రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. దేశాన్ని ప్రేమించడమంటే ఈ నేల నే కాదు, ఇక్కడ నివసించే మనుషులను కూడా ప్రేమించాలనే విషయాన్ని ప్రతిజ్ఞ తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
- యం.రాంప్రదీప్
(నేడు పైడిమర్రి వర్ధంతి)

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles