క్షమామూర్తి


Wed,October 2, 2019 12:51 AM

హిమగిరి శిఖాముఖాన వెల్గించినావు
దివ్య దీపాంకురము; దేశ దేశములకు
యుగ యుగమ్ముల చీకటు లుడిగిపోవ
గుండెలోనుండి నెత్తురుల్ పిండిపోసి,


నలుబది కోట్ల భారత జ
నమ్ముల వందలయేండ్ల బంధన
మ్ముల్ సడలించినావు, జయ
ముల్ గొనినావు, త్రివర్ణకాంతులన్.
తళతళలాడు భారత ప
తాకము నాకము తాకునంత యె
త్తుల కెగయించినావు; పగ
తుర్ కొనియాడగ పెంచినాడవున్.

మతముల గ్రుద్దులాటలను
మాన్పు ప్రతిజ్ఞలతో ప్రజా సమే
కతకయి ప్రాణమొడ్డిన మ
హాత్ముడ వీవు; భవిష్యకాల సం
తతు లఖిల ప్రపంచ జన
తా నయనాంచలవీధి నీ మహో
న్నత దరహాసమూర్తి పయ
న మ్మొనరింప దృశించ జాలరే!

పల్లెల గొల్లవాడవయి
పాలను త్రావెదు; ధోతిగుడ్డ మో
కాళ్ళను దాటనీయ; వొక
కఱ్ఱను చేతికి నూతజేసి ఊ
ళ్ళూళ్ళకు శాంతికుంభము భు
జోపరిభాగముపై, అహింసయన్
చల్లల నమ్మబోయెదవు,
స్వామి! నరాకృతి సత్యదైవమా!
-డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య

106
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles