మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే 5 పవర్‌ఫుల్ ఫుడ్స్ ఇవే..!

Mon,February 5, 2018 04:52 PM

సాధారణంగా మనలో చాలా మందికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇది సహజంగా వచ్చే తలనొప్పే కాబట్టి సహజంగానే పోతుంది. అందుకు ఏం చేయాల్సిన పనిలేదు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చాలు. అయితే కొన్ని రకాల తలనొప్పులు మాత్రం అంత త్వరగా తగ్గవు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వెంటనే వస్తాయి. వీటిలో మైగ్రేన్ తలనొప్పి చాలా ముఖ్యమైంది. ఇది వచ్చిందంటే వాంతులు కావడం, వికారంగా ఉండడం, కాంతి, చిన్నపాటి ధ్వనులను కూడా భరించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు తీవ్ర అసౌకర్యం కూడా కలుగుతుంది. తలకు ఒక వైపున నొప్పి బాగా వస్తుంది. ఈ క్రమంలో డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వైద్యులు ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే దాంతో మైగ్రేన్ తలనొప్పి నుంచి చెప్పుకోదగిన ఉపశమనం లభిస్తుంది. మరి ఆ తలనొప్పిని తగ్గించే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. చేపలు


చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీంతోపాటు రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. హైబీపీ తగ్గుతుంది. ఈ క్రమంలోనే మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

2. నట్స్


బాదం, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వాల్‌నట్స్‌ను నిత్యం తీసుకుంటుంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. మెదడుకు రక్తసరఫరాను పెంచుతాయి.

3. అవిసె గింజలు


అవిసె గింజల్లో కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మైగ్రేన్ తలనొప్పిని సమర్థవంతంగా తగ్గించగలుగుతాయి.

4. నీరు


శరీరం సరిగ్గా పనిచేయాలంటే నిత్యం తగిన మోతాదులో నీటిని తాగడం కూడా అవసరం. నీరు శరీరంలో తగినంత ఉంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. నొప్పి ఎక్కువగా ఉన్న వారు నీటిని బాగా తాగుతుంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. పెరుగు


ఇందులో ఉండే కాల్షియం మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

5967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles