రోజూ గుప్పెడు అవిసె గింజ‌లను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Thu,January 18, 2018 08:18 AM

అవిసె గింజ‌ల‌తో త‌యారు చేసిన నూనెను మ‌నలో చాలా మంది వంట‌ల్లో వాడుతారు. అయితే నిజానికి ఈ గింజ‌ల‌ను నూనెగా కంటే డైరెక్ట్ గా అలాగే తీసుకుంటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు, మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం అవిసె గింజ‌ల‌ను తింటే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజలలో పుష్క‌లంగా ఉంటాయి. చేప‌ల వంటి మాంసాహారం త‌రువాత ఆ యాసిడ్లు అధికంగా ల‌భించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబ‌ర్‌) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ‌ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడ‌వ‌చ్చు. చేప‌ల‌ను తిన‌లేని వారు అవిసె గింజ‌ల‌ను తింటే వాటి ద్వారా క‌లిగే లాభాలు ఈ గింజ‌ల వ‌ల్ల కూడా క‌లుగుతాయి.

2. అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే అలసట త‌గ్గుతుంది. శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌స్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేయ‌గ‌లుగుతారు.

3. మహిళల్లో హార్మోన్ల‌ను సమతుల్యం చేసే గుణాలు అవిసె గింజ‌ల‌లో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ ల‌క్షణాలు అవిసెల్లో పుష్క‌లంగా ఉన్నాయి.

4. అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగ‌ర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజ‌ల‌ను డైరెక్ట్ గా తిన‌లేకపోతే వాటిని దంచి పిండి చేసి కూడా వాడ‌వ‌చ్చు.

5. అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల‌ ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.

6. అవిసె గింజలు మెదడుకు శక్తిని అందిస్తాయి. మెద‌డు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు రోజూ అవిసె గింజ‌ల‌ను తినిపిస్తే వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు డిప్రెష‌న్‌ను కూడా సమర్ధవంతంగా నివారించగలుగుతాయి.

7. అవిసె గింజ‌ల‌ను రోజూ తింటుంటే శిరోజాలు దృఢంగా మారుతాయి. చుండ్రు స‌మస్య ఉండ‌దు.

8. త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు, న‌డుం నొప్పి స‌మ‌స్య‌ల‌కు అవిసె గింజ‌ల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.

9. అవిసె గింజ‌ల‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కుష్టువ్యాదితో బాధ‌పడేవారు అవిసె గింజ‌ల‌ను తీసుకుంటే మంచి ఫ‌లితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

6254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles