గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే వీటిని నిత్యం తీసుకోవాలి..!


Sun,April 21, 2019 05:21 PM

ప్రస్తుత ప్రపంచంలో ఏటా అనేక మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అనేక మందికి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు అనేక కారణాలుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ క్రమంలో అలా హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కింద సూచించిన విధంగా పలు ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. చేపలు


చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.

2. ఓట్స్


ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

3. నట్స్


జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

4. పెసలు


రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు అమోఘమైన పాత్ర పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని, మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

5. అవిసెలు


అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు వీటిలో ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. నీటిలో నానబెట్టుకుని లేదా పొడి చేసుకుని అవిసె గింజలను రోజూ తింటుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

6. వెల్లుల్లి


నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అలాగే తినేయాలి. ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకుంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

5680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles