ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ నేటి ఆధునిక ప్రజలు అనునరిస్తున్న జీవనశైలి వల్ల యుక్త వయస్సులో ఉన్న వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో ఏటా గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే... 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అలాగే టమాటాల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో కొవ్వు గడ్డ కట్టకుండా ఉంటుంది. 2. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్లను తగ్గించడంలో వాల్నట్స్ అమోఘంగా పనిచేస్తాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక బరువును తగ్గిస్తాయి. డయాబెటిస్, హైబీపీని అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. 3. నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. పాలకూరలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటీన్, ఇతర పోషకాలు చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే పాలకూరలో ఉండే ఫొలేట్, విటమిన్ బి6, బిటైన్, అమైనో ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూస్తాయి. 4. ఓట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. 5. స్ట్రాబెర్రీలు, నిమ్మజాతి ఫలాలు, బాదం పప్పు, దానిమ్మపండ్లను నిత్యం తీసుకుంటుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.