తాజా పండ్ల‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

Sat,April 20, 2019 06:20 PM

పండ్లు తింటే మంచి ఫలితమే ఉంటుంది. ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాల‌ను అడ్డుకోవడంలో తాజా పండ్లది ప్రత్యేక పాత్ర. ఒక్కో పండు ఒక్కో లాభాన్ని చేకూర్చుతుంది. అందరికీ అందుబాటులో ఉండే కొన్ని పండ్లు, వాటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని, రోగనిరోధకశక్తిని పెంచే ఈ పండ్లు తినటం అన్ని విధాలా మంచిదే..!


1. పైనాపిల్‌


మాంసకృత్తులను సులువుగా జీర్ణం చేసే బ్రొమెలిన్‌ ఎంజైమ్‌ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలు, కణజాలం వాపులు, నొప్పులపై అద్భుతంగా పనిచేస్తుంది. వ్యాయామం చేయడానికి ముందు కొన్ని పైనాపిల్‌ ముక్కలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

2. బొప్పాయి


మనం తీసుకునే ఆహార పదార్థాలను జీర్ణం చేసి శరీరానికి శక్తినందించే జీర్ణవ్యవస్థను సరిగా పనిచేయించే ఎంజైములు బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే పెపైన్‌ అనే పదార్థం మాంసకృత్తులను సులువుగా కరిగేలా చేస్తుంది. అందువ‌ల్ల మాంసాహారం తిన్న‌ప్పుడు బొప్పాయి పండు తింటే తేలిగ్గా ఆ ఆహారం జీర్ణ‌మ‌వుతుంది.

3. యాపిల్‌


ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే ఈ పండులో త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే గుణాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని యాపిల్ పండు సంర‌క్షిస్తుంది.

4. జామకాయలు


వీటిలో సి-విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. కెరాటినాయిడ్స్‌, ఫోలెట్‌, పొటాషియం, పీచు, కాల్షియం, ఐరన్‌ వంటి విటమిన్లు ఉండే అద్భుతమైన ఫలం ఇది. కొలెస్ట్రాల్‌ ఉండదు. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు జామలో అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకూ జామకాయ దోహదం చేస్తుంది. మలబద్దకం నివారణలో కూడా పనిచేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కణజాలం పొరను రక్షిస్తుంది. జలుబు, దగ్గు, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధిపైన సి-విటమిన్‌ పోరాడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5. నారింజ


ఇందులో విటమిన్‌-సి, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని సెర‌టోనిన్‌, ఇన్సులిన్‌ స్థాయిలను క్రమబద్దం చేసే ఇనోసిటాల్‌ అనే పదార్థం నారింజ‌లో ఉంటుంది. ఇది మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను నియంత్రిస్తాయి. కొవ్వు పదార్థాలను కరిగించడంలో, రక్తంలో కొవ్వును తగ్గించడంలో, జలుబు, ఫ్లూ లను నయం చేయడంలో తోడ్పడుతాయి. అయితే ఈ పండ్లను భోజనానికి ముందుగానీ, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడుగానీ తినకూడదు.

6. పుచ్చకాయ


ఇందులో 92శాతం నీరే ఉంటుంది. అధిక వేడి నుంచి, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. పుచ్చకాయలోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. బి-విటమిన్‌ శరీరానికి శక్తినందిస్తుంది. పుచ్చకాయలోని పొటాషియం, మెగ్నిషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మూత్రనాళాల, మూత్రపిండాల ఇబ్బందులు ఉన్నవారికి ఇది ఒక ఔషధంలాగ పనిచేస్తుంది. పుచ్చకాయ తింటే అంగస్తంభన సమస్యలు తలెత్తవు. అందులో ఉండే సిట్రులైట్‌, ఆర్గినైస్‌ పదార్థాల వలన అది సాధ్యమవుతుంది.

7. అరటిపండ్లు


ఇవి శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సహజమైన తీపి వుండటం వలన తక్షణం శక్తి కలిగిస్తుంది. అరటిపండ్లలో బుఫాటెనైస్‌ అనే ఆల్కాలాయిడ్‌ ఉంటుంది. ఇది మూడ్‌ను, శృంగార భావనలను, లైంగిక ప్రక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని నిరోధించడంలోనూ తగిన పాత్ర పోషిస్తుంది.

8. స్ట్రాబెర్రీ


ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్త‌ను ప‌టిష్టం చేస్తాయి. వీటిలోని ప్లేవనాయిడ్స్‌ గుండె పనితీరును చక్కదిద్దుతాయి. క్యాన్సర్‌నూ నిరోధించే శక్తి వీటికుంది. వీటిలో ఉండే మాంగనీస్‌, విటమిన్‌-సి వంటి పోషకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

9. మామిడి


బాగా పండిన మామిడి పండులో విటమిన్‌-ఎ ఎక్కువగా లభిస్తుంది. ఈ పండును తింటే జలుబు, సైనసైటిస్‌ సమస్యలు రాకుండా ఉంటాయి. పోషకాహారలోపంతో బాధపడే చిన్నారులలో రేచీకటిని నిరోధిస్తుంది. ఇందులో లభించే సి-విటమిన్‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వయసుకు తగ్గ బరువులేని వారు రోజుకు మూడుసార్లు మామిడి పండ్ల రసాన్ని పాలతో కలపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

2950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles