మధుమేహులకు శుభవార్త.. ఇక మాత్రలతో ఇన్సులిన్


Sat,February 9, 2019 06:06 PM

డయాబెటిస్ ఈ రోజుల్లో సాధారణ ఆరోగ్య సమస్య అయింది. ఇంటింటా డయాబెటిస్ ఉన్నవారు నకీసం ఒకరైనా ఉంటారు. అందులో కొంచెం ముదిరిన తర్వాత ఇన్సులిన్ ఇంజక్షన్లు తప్పనిసరి. రోజుకు రెండు పూటలా ఇన్సులిన్ తీసుకోవాల్సి రావచ్చు. అలాంటివారికి ఆ ఇంజక్షన్లంటే చిరాకు కలుగుతుంది. శరీరంలో రకరకాల చోట్లలో వాటిని గుచ్చుకుంటుంటారు. కొన్నాళ్లయిన తర్వాత ఇవేం ఇంజక్షన్లురా బాబూ అనిపించక మానదు. అలాంటివారికి ఈ వార్త సంతోషం కలిగిస్తుంది. ఇంజక్షన్ల ద్వారా కాకుండా క్యాప్సూల్స్ ద్వారా ఇన్సులిన్ తీసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ఇటీవలే కనిపెట్టారు. క్యాప్సూల్‌లో ఇన్సులిన్‌తో తయారుచేసిన సూది ఉంటుంది. అది కడుపులోకి చేరుకున్న తర్వాత పేగులకు గుచ్చుకుని ఇన్సులిన్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ ప్రయోగం వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం 300 మైక్రోగ్రాములను సులభంగా ఎక్కించగలుగుతున్నారు. ఇటీవలే ఈ సామర్థ్యాన్ని 5 మిల్లీగ్రాములకు పెంచారు. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ మొత్తం సరిపోతుంది. పైగా పేగులలో నొప్పి తెలియదు. మందు విడుదల చేసిన తర్వాత క్యాప్సూల్ పూర్తిగా కరిగిపోతుంది. అనేక ఉదర సంబంధ వ్యాధులకు, ఇమ్యునిటీ వ్యాధులకు ఈ క్యాప్సూల్ ద్వారా మందును ఎక్కించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగదశలో ఉన్న ఈ ప్రక్రియ నిజంగా అందుబాటులోకి వస్తే అనాయాసంగా ఇన్సులిన్ ఎక్కించుకోవచ్చు. ఇది కేవలం డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా అనునిత్యం ఇంజక్షన్ల వైద్య అవసరమయ్యే రోగులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని బ్రిటన్‌కు చెందిన కోచ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్ అన్నారు.

7972

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles