హెచ్‌ఐవీ కంటే నాలుగింతల వేగం..కాలేయాన్ని కమ్మేసే..'బి'

Sun,July 28, 2019 08:51 AM

హైద‌రాబాద్‌: హెపటైటిస్....కాలేయాన్ని కమ్మేస్తున్న స్లో పాయిజన్. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం. కొన్ని రకాల వైరస్‌ల వల్ల కాలేయానికి హెపటైటిస్ సోకుతుంది. హెపటైటిస్‌ను సకాలంలో గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్, గ్యాస్ట్రోఎంటరాలజి విభాగం అధిపతి డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. హెపటైటిస్ వైరస్‌ను మొట్టమొదటిసారిగా డా.బ్లూంబర్గ్ అనే వైద్యశాస్త్రవేత్త గుర్తించాడు. జూలై 28న బ్లూంబర్గ్ జయంతి సందర్భంగా హెపటైటిస్ నివారణ దినంగా పరిగణిస్తారు.


హెపటైటిస్‌లో రకాలు..
హెపటైటిస్‌లో హెపటైటిస్-ఎ, బి, సి, డి, ఇ అనే రకాలున్నాయి. వీటిల్లో ఎ, ఇ రకం వైరస్‌లు సాధారణమైన ఇన్‌ఫెక్షన్‌లు కాగా బి,సి,డి వైరస్‌లను క్రానిక్ హెపటైటిస్
( దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌లు)గా పిలుస్తారు. హెపటైటిస్ బి,సి,డి వల్ల సిరోసిస్(కాలేయం దెబ్బతినడం)వ్యాధి, కాలేయ క్యాన్సర్, కాలేయ వైఫల్యం తదితర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

హెపటైటిస్-బి..ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది!
కాలేయాన్ని అతివేగంగా దెబ్బతీసే వైరస్ హెపటైటిస్-బి. ఇది ఎయిడ్స్ కంటే కూడా 4 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది సోకిన 10 మందిలో 9 మందికి సుమారు ఆరు నెలలలో వ్యాధి అదే నయమైపోగా కొంత మందిలో మాత్రం శరీరంలో అలాగే ఉండిపోయి, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారి కాలేయాన్ని దెబ్బతీస్తుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగం అధిపతి డా.శ్రావణ్‌కుమార్ వివరించారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

పెండ్లికి ముందు పరీక్షలు తప్పనిసరి..
హెపటైటిస్-బి వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం వ్యాధి ఉన్న వారిని వివాహం చేసుకోవడం.పెండ్లి కి ముందు పరీక్షలు చేసుకోవడం ఉత్తమం.హెపటైటిస్-బి అనేది రక్తంతోనే కాకుండా లాలాజలం ద్వారా కూడా సోకుతుంది. కాబట్టి వ్యాధిగ్రస్తుల నోట్లో నోరు పెట్టి ముద్దుపెట్టకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు దూరంగా ఉండాలి. వ్యాధి గ్రస్తులు శృంగారంలో కాండోమ్స్ తప్పనిసరి వాడాలి. లేకపోతే భాగస్వామికి కూడా వ్యాధి సోకుతుంది. మద్యం సేవించరాదు. తాజా పండ్లను తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. శాకాహారమే ఉత్తమం.

వ్యాధి సోకడానికి కారణాలు..
హెపటైటిస్ ఎ, ఇ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయి. బి,సి,డి రక్తం మార్పిడి ద్వారా, శరీరంలోని ద్రవాల సంపర్కం అంటే ఒకరు వినియోగించిన సూదులు, బ్లేడ్లను, టూత్ బ్రష్‌లను మరొకరు వినియోగించడం, సురక్షితం కాని శృంగారం వల్ల సంక్రమిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అందుకే గర్భిణిలకు ప్రసవానికి ముందే హెపటైటిస్ పరీక్షలు జరిపి, సమస్య ఉంటే 7నెలల నుంచే మందులు ఇవ్వడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే హెపటైటిస్ ఎ,బి,సి,డి,ఇలను పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.

వ్యాధి లక్షణాలు..
తరచూ వాంతులు కావడం
ఆకలి మందగించడం
జ్వరం రావడం
కళ్లు పసుపు రంగులోకి మారడం
మూత్రం పసుపుపచ్చగా రావడం

10580
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles