ఫోలిక్ యాసిడ్ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే..?


Thu,April 25, 2019 04:26 PM

మన శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోషకాల్లో విట‌మిన్ బి9 కూడా ఒక‌టి. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఈ విట‌మిన్ లోపిస్తే ఎప్పుడూ నీర‌సంగా ఉంటారు. కొద్దిగా ప‌నిచేసినా తీవ్ర‌మైన అల‌స‌ట వ‌స్తుంది. గుండె అసాధార‌ణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. త‌ల‌నొప్పి, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే.. ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కు ఎంతో అవ‌స‌రం. క‌డుపులో ఉన్న బిడ్డ స‌రిగ్గా ఎద‌గాలంటే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను గ‌ర్భిణీలు ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే ఇత‌రులు కూడా ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను త‌మ రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో నూత‌న క‌ణాల‌ను త‌యారు చేయ‌డంలో, వాటికి పోష‌ణ అందించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే క్యాన్స‌ర్ రాకుండా, డీఎన్ఏ మార్పులు జ‌ర‌గ‌కుండా చూసేందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది.

పుట్ట‌బోయే పిల్లల్లో మెద‌డు, వెన్నెముక స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే గ‌ర్భిణీలు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. అందుకే డాక్ట‌ర్లు కూడా గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ మందుల‌ను రాస్తుంటారు. ఇక ఇవే కాకుండా.. హైబీపీ రాకుండా ఉండేందుకు, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గేందుకు కూడా మ‌న‌కు ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. పాల‌కూర‌, బ్రొకొలి, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, ప‌ప్పు దినుసులు, నిమ్మ‌కాయ‌లు, అర‌టి పండ్లు, పుచ్చ‌కాయ‌లు, తృణ ధాన్యాల్లో మ‌న‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది..!

2754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles