తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

Mon,July 22, 2019 08:50 AM

హైద‌రాబాద్‌: చిరుధాన్యాలతో పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చని, వాటిల్లో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయని పలువురు వక్తలు అన్నారు. భారతీయ సంప్రదాయ ఆహారం, చిరుధాన్యాల వాడకంపై ఆదివారం హోటల్ కత్రియలో జరిగిన సదస్సుకు ఐఐఎంఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, న్యూట్రీ హబ్ సీఈఒ డాక్టర్ దయాకర్‌రావు, పీజేటీఎస్‌యూ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవి, ఆచార్య ఎన్‌జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జె.లక్ష్మి తదితరులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి తృణధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు.


తృణధాన్యాలు కొత్తగా వచ్చినవి కాదని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలని వారు వ్యాఖ్యానించారు. మనిషి ఆరోగ్యం వారి ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని, ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో పాశ్య్చాత్య ఆహారపు అలవాట్లు విపరీతంగా పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ప్రజల్లో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని వాపోయారు. చిరుధాన్యాల్లో మనిషికి కావాల్సిన పూర్తిస్థాయి పోషక విలువలున్నట్లు తెలిపారు. నేడు పసిపిల్లల దగ్గర నుంచే మధుమేహం, బీపీ వంటి రోగాలు వస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లేనన్నారు.

పూర్వీకులు అందించిన చిరుధాన్యాలను తిరిగి మనం వినియోగించి భవిష్యత్‌తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని వక్తలు కోరారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో చిరుధాన్యాలనే శరణ్యమన్నారు. చిరుధాన్యాలు అతి తక్కువ నీటి వినియోగంతో పండించగలిగే పంటలన్నారు. హెల్త్ సూత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబు, హెల్త్ సూత్ర సీఈవో సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

5121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles