హెల్మెట్ ధరించకుంటే మరణశాసనమే..

Sun,July 28, 2019 08:17 AM

హైద‌రాబాద్‌: హెల్మెట్ వాడకపోవడంతో ఆరు నెలల్లో 382 మంది ద్విచక్రవాహనదారులు మృత్యువాత పడ్డారు. ద్విచక్రవాహనదారుడికి హెల్మెట్ అనేది ఎంత అవసరమో ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ యేడాది జనవరి నుంచి జూలై నెల వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి, ఈ గ‌ణాంకాల‌ను హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనీల్‌కుమార్ విడుదల చేశారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కాంటాక్టు, నాన్ కాంటాక్టు పద్ధ్దతిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపడుతున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు.


సుమారు ఏడు నెలల సమయంలోనే 40,80,477 ప్రధాన ఉల్లంఘనలు జరిగాయి. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల సంఖ్య భారీగా ఉన్నది. ఇందులో కేవలం హెల్మెట్ లేని వాహనదారులపై విధించిన కేసుల సంఖ్య 36,00,212. ఒక పక్క హెల్మెట్ ధరించలేని వారిపై విధిస్తున్న జరిమానాల సంఖ్య భారీగా ఉండడం.. మరో పక్క హెల్మెట్ వాడకపోవడంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. ఈ ఏడాది జులై 26వ తేదీ వరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 646 మంది మృతి చెందాడు.

అందులో 432 మంది ద్విచక్రవాహనదారులుండగా, 382 మంది హెల్మెట్ లేకపోవడంతోనే మృతి చెందినట్లు పోలీసులు విశ్లేషించారు. దీంతో పాటు అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు జరిగి, వాహనదారులు మృతి చెందారని అదనపు కమిషనర్ పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున ఉల్లంఘనులు

ట్రై కమిషనరేట్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు చలనాలు విధిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమై పోలీసు సేవలు అందించే లక్ష్యంతో డీజీపీ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రై కమిషనరేట్ల పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనదారులను కట్టడి చేసేందకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు వేల సంఖ్యలో ఉల్లంఘనలు రికార్డవుతున్నాయి. కొందరు చలానే కదా కట్టేద్దామని.. మరికొందరు మరోసారి ఆ తప్పు చేయవద్దని తమ మైండ్‌సెట్‌ను మార్చుకుంటున్నారు. ఈ ఏడాది ఏడు నెలల కాలంలో నమోదైన ప్రధాన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి.

685
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles