ఎనీడెస్క్ యాప్..ఎనీటైం డేంజర్..

Wed,June 26, 2019 07:40 AM

any time danger with Any Desk App says hyderabad police

స్మార్ట్‌ఫోన్‌ను టార్గెట్ చేస్తున్న సైబర్ చీటర్స్..
యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి..9 అంకెల ఐడీతో లూటీ..
ఎనీడెస్క్‌తో పారాహుషార్..


హైదరాబాద్ : సైబర్ మాయగాళ్లు స్మార్ట్‌ఫోన్‌ను టార్గెట్ చేశారు. సింపుల్‌గా ఒక ఫోన్ కాల్‌తో మనతోనే ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్ లోడ్ చేయిస్తున్నారు. తెలివిగా ఆ ఐడీ నెంబరును చెప్పించుకుని ఫోన్ మొత్తాన్ని అతని కంట్రోల్‌కు తెచ్చుకుంటున్నారు. ఇంకేముంది ఫోన్‌లో చేసే నెట్ బ్యాంకింగ్ వివరాలు, లావాదేవీలు వారి గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఈ సరికొత్త నేర ప్రక్రీయ ద్వారా మన ప్రమేయం లేకుండానే మన ఖాతాలోని నగదును దోచేస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌పై పూర్తిగా ఆధారపడుతుండడం, వివిధ నగదుకు సంబంధించిన యాప్‌లు, మొబైల్ బ్యాంకింగ్ ఇతర ఆర్థిక లావాదేవీలను కూర్చునే చోట నుంచి స్మార్ట్‌ఫోన్‌లో చేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరస్థులు ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గురిపెట్టారు. ఫోన్లు వాడుతున్న వారిలో 95శాతం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తుండడంతో సైబర్ మోసగాళ్లు వాటిలో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఆ తర్వా త యాప్‌కు కేటాయించే ఐడీ నెంబరును తీసుకుని మొత్తం ఫోన్‌ను వారి కన్నుసన్నుల్లో పెట్టుకుంటున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మోసపోయిన వారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పీఎస్‌ల్లో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వీటిని పరిశీలించిన పోలీస్‌అధికారులు సైబర్ మాయగాళ్ల నయా చీటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంక్ ఖాతా సమస్యలు పరిష్కరిస్తాం, క్రెడిట్, డెబిట్ కార్డుల పరేషాన్‌లను దూరం చేస్తాం, మీరు ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసకోండని అంటే అది సైబర్ క్రిమినల్ కాల్‌గా అనుమానించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నమోదైన కేసులను పరిశీలిస్తే ఎక్కువగా ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికగా బ్యాం క్ వ్యవహరాల అంశాలను నమోదు చేసుకున్న వారు సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో పడి ఆర్థికంగా చితికిపోయారు.

ఫేస్‌బుక్ పేజీలో ఫిర్యాదుతో ఖాతా ఖాళీ...
రాము(పేరు మార్చాం) ఓ బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎమ్ కార్డును వాడుతున్నాడు. ఓ రోజు అతని పని చేయలేదు. బ్యాంక్‌కు ఫిర్యాదు చేద్దామని బ్యాంక్‌కు సంబంధించిన ఫేసుబుక్ పేజీలో తన ఏటీఎమ్ కార్డు పని చేయడం లేదని అందులో ఫోన్ నెంబరుతోపాటు సమాచారాన్ని వివరించాడు. రెండు రోజుల తర్వాత రాముకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం.. మీ ఏటీఎమ్ కార్డు సమస్య గురించి చెప్పండని అడిగాడు. దీంతో నిజంగానే ఇది బ్యాంక్ వారి ఫోన్ కాల్ అని నమ్మాడు. ఆ వ్యక్తి రాముని ఎనిడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి మీకు వచ్చిన 9 అంకెల యూజర్ ఐడీని చెప్పాండని తీసకున్నాడు. అంతే ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతులోకి వెళ్లిపోయింది. రాముకు తెలియకుండానే అతని బ్యాంక్ ఖాతాల నుంచి 3 లక్షల రుపాయాలను సైబర్ చీటర్లు కాజేశారు.

ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తుతో...
సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన అవినాష్ ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వారం రోజుల తర్వాత అతనికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్‌ను మాట్లాడుతున్నానని చెప్పాడు. నిజంగానే బ్యాంక్ ప్రతినిధి అయ్యి ఉంటాడని భావించి అతనితో మాట్లాడాడు. అతను చెప్పినట్లుగా ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వచ్చిన 9 అంకెల నెంబరును ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తికి వివరించాడు. కొన్ని గంటల తర్వాత అవినాష్‌కు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.55 లక్షలు పలు ఆన్‌లైన్ షాపింగ్‌కు బదిలీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles