ఆషాడ వేడుక.. బోనాల జాతర.. జులై 4న గోల్కొండలో ప్రారంభం

Mon,June 17, 2019 08:47 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆషాఢ మాసం బోనాల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఆషాఢ మాసం బోనాలు చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఉన్న ఎల్లమ్మ జగదాంబిక ఆలయం నుంచే ప్రారంభం అవుతాయి. గ్రామాల్లో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండటానికి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు మంచి గుర్తింపు ఉన్నది. ఇలాంటి బోనాల పండుగను నిజాం కాలంలో కూడా నవాబులు ఎంతో ఆదరించి పండుగలను ఘనంగా నిర్వహించుకునేందుకు వెన్నుదన్నుగా నిలిచేవారు. బోనాల వేడుకలు తెలంగాణలో మొట్టమొదటిగా చారిత్రాత్మక గోల్కొండ కోటలో నెలకొని ఉన్న శ్రీ ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో ప్రారంభమవుతాయి.

ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాకే రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలను ప్రజలు విడుతల వారీగా నిర్వహించుకుంటారు. గోల్కొండ కోట నుంచి జూలై 4 వ తేదీ(గురువారం రోజు)న ప్రారంభమై ప్రతి ఆదివారం, గురువారం ప్రజలు బోనాలను అత్యంత సంబురంగా జరుపుకుంటారు. జూలై 4 నుంచి ఆగస్టు 1 వ తేదీ వరకు గోల్కొండ కోటలో బోనాల సందడి ఉంటుంది. జంట నగరాల నుంచే కాకుండా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గోల్కొండ కోటలో బోనాల నిర్వహణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న సంస్కరణలతో ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.


కాకతీయుల కాలం నుంచే..


తెలంగాణ ఆషాఢ మాసం బోనాలకు ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్నది. కాకతీయుల కాలం (క్రీస్తు శకం 1143 సంవత్సరం)లో వరంగల్ రాణి రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు మట్టికోట నిర్మించేందుకు గోల్కొండ ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేశారు. కాకతీయులకు ముందు గొల్లలు పాలించడంతో గోల్కొండ కోటకు ముందు గొల్లకొండ అని పేరు ఉండేది. కాల క్రమంలో దీనికి గోల్కొండ అని పేరు స్థిర పడింది. అప్పటి నుంచే గోల్కొండలో బోనాల పండుగను నిర్వహించే వారంటే దీని ప్రత్యేక ఏమిటో అర్థమవుతుంది. కాకతీయుల కాలం నుంచి జరుపుకుంటున్న ఈ బోనాలను నవాబులు కూడా ఎంతో ఆదరించేవారు. అప్పటి నుంచే నగరంలో మతసామరస్యం వెల్లివిరుస్తున్నది.

కోట బోనాలకు 878 ఏండ్ల చరిత్ర


గోల్కొండ బోనాల ఉత్సవాలకు చాలా ఘన చరిత్ర ఉంది. ఈ ఉత్సవాలు ప్రారంభమై ఇప్పటికి 878 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలతోనే తెలంగాణ ప్రాంతం మొత్తంలో బోనాల పండుగ వాతావరణం మొదలవుతుంది. తొమ్మిది వారాల పాటు జరిగే బోనాల ఉత్సవాలు హిందూ, ముస్లింల స్నేహానికి ప్రతీకగా నిలుస్తాయి. నిజాం కాలంలో బోనాల పండుగను ఎంతో ఆదరిస్తూ ముస్లింలు కూడా సోదర భావంతో ఈ పండుగలో పాల్గొనే వారని చరిత్ర చెబుతుతున్నది. ఒక్కో వారం ఒక్కో ప్రాంతం నుంచి బోనాలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున కుటుంబాలతో ప్రజలు గోల్కొండకు తరలివస్తారు. ఇక్కడ బోనాలు జరిపి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతే కాకుండా బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసి సంబరాలను జరుపుకుంటారు.

ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు


గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఆలయానికి తొలి పూజ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు తరలివచ్చి మొదటి పూజ రోజు లంగర్‌హౌస్ చౌరస్తాలో ఆలయ కమిటీ వారికి పట్టువస్ర్తాలను అందజేస్తారు. ఇదిలా ఉండగా జగదాంబిక ఆలయ కమిటీ తరఫున జంట నగరాలలోని సికింద్రాబాద్ ఉజ్జయినిమహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయం, కార్వాన్ దర్బార్‌మైసమ్మ, లంగర్‌హౌస్ బుజిలి మహంకాళి దేవాలయం, షేక్‌పేట్ మైసమ్మ దేవాలయానికి ప్రతీ సంవత్సరం పట్టు వస్ర్తాలను అందజేస్తున్నారు.

పూజారి ఇంటి నుంచి విగ్రహాల ఊరేగింపు..


గోల్కొండ కోటపై ఉన్న చారిత్రాత్మక జగదాంబిక ఆలయం బోనాల ఉత్సవాల మొదటి రోజు మూల విగ్రహాలను గోల్కొండ బడాబజార్‌లో ఉన్న పూజారి ఇంటి నుంచి ఊరేగిస్తారు. పూజారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ విగ్రహాల ఊరేగింపు సమయంలో చిన్నా పెద్ద తేడా లేకుండాయువకులందరు చేసే సందడి అంతాఇంతా కాదు. ఇదిలా ఉండగా తొలి బోనాన్ని బోనాల కులవృత్తుల సంఘం తరఫున అమ్మవారికి మొదటి పూజ రోజున సమర్పిస్తారు.

ఉత్సాహంగా తొట్టెల


గోల్కొండ కోట బోనాల ఉత్సవం ప్రారంభం రోజున జరిగే తొట్టెల ఊరేగింపులు కన్నుల పండువగా జరుగుతాయి. ఈ రోజున ఆసిఫ్‌నగర్, పోచమ్మ బస్తీ, సబ్జిమండి గంగపుత్ర సంఘం, గొల్లకిడికి, కార్వాన్, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల నుంచి తొట్టెలను తీసుకొని వస్తారు. లంగర్‌హౌస్ చౌరస్తాలో పట్టు వస్ర్తాల సమర్పణ అనంతరం తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ తొట్టెల ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున యువకులు, భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.

పోతురాజుల విన్యాసాలు


బోనాలు అంటేనే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పోతురాజు వేషధారి. బోనాల పండుగలో పోతురాజుల విన్యాసాలు తప్పనిసరి. మేళ తాళాలతో బ్యాండ్ బాజాలతో తొట్టెల ఊరేగింపునకు పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అమ్మవారు ఆవహించడంతో శక్తి రూపంగా మారి పోతురాజులు గంటల కొద్దీ నృత్యాలు చేస్తారని వారు అస్సలు అలిసిపోరని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. బోనాల పండుగకు పోతురాజుల విన్యాసాలతో పాటు శివసత్తుల విన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య


తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండలో బోనాలను జరుపుకోవాలంటే ప్రజలు నానా కష్టాలు పడేవారు. ముఖ్యంగా ఇక్కడ నీటి సౌకర్యం ఉండకపోయేది. పురావస్తుశాఖ వారు నిర్మించిన ఒకే ఒక్క ట్యాంక్ నీళ్లతో ప్రజలు బోనాలను నిర్వహించుకునేవారు. ఆలయం ముందు షెడ్ లేకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడేవారు. సౌకర్యాలు సరిగా లేక పోవడంతో భక్తులు తక్కువగా వచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో మంత్రులు, అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు గోల్కొండ బోనాలను జరపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles