ఏటీఎం కార్డు సిటీలో ఉండగా.. ముంబైలో క్యాష్ విత్‌డ్రా

Mon,April 22, 2019 07:31 AM

atm card skimming cloning rackets in hyderabad

హైద‌రాబాద్‌: ఏటీఎం కార్డు నా జేబులో ఉండగా, ముంబైలో ఏటీఎం నుంచి డ‌బ్బులు డ్రా చేశారని ఒకరు... జార్ఖండ్‌లో డ్రా చేశారంటూ మరొకరు ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉండగా, ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయంటే గుర్తుతెలియని వ్యక్తులు ఆయా బ్యాంకు కార్డులను క్లోనింగ్ చేసి ఉంటారు. అంటే గత రెండు నెలల మధ్య కాలంలో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో స్కిమ్మింగ్ ద్వారా డాటా చోరీ జరిగి ఉంటుందని, ఆ డాటాతో క్లోనింగ్ కార్డులు తయారు చేసి ఉంటారని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు.

రొమేనియా దేశానికి చెందిన అంతర్జాతీయ స్కిమ్మింగ్ ముఠాను గతంలో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో ఇతర రాష్ర్టాలకు చెందిన ముఠాలు ఇటీవల ఎక్కడైనా ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేశాయా? అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో అబిడ్స్‌లోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో స్కిమ్మింగ్ జరిగినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే ఇతర రాష్ర్టాల్లో క్లోనింగ్ చేసిన కార్డులను ఉపయోగించి జూన్ నెలలో ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడంతో ఖాతాదారులకు తెలిసింది. అంటే రెండు నెలల వ్యవధి తరువాత ఈ ముఠాలు ఆయా కార్డులను క్లోనింగ్ చేసి ఉపయోగిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు రోజు మూడునాలుగు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో గతంలో స్కిమ్మింగ్ చేసి సేకరించిన డాటాను ఉపయోగించి తయారు చేసిన ఏటీఎం కార్డులతో ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు డబ్బులు డ్రా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే గతంలో ఉన్న ఏటీఎం కార్డులను బ్యాంకు అధికారులు మార్చి ఈ ఏడాది జనవరి నుంచి చిప్‌తో కూడిన ఏటీఎం కార్డులను ఖాతాదారులకు తప్పనిసరి చేశారు. చిప్ లేని కార్డులు ప్రస్తుతానికి వాడుకలోలేవు. అయితే చిప్‌తో ఉన్న కార్డులను కూడా స్కిమ్మింగ్ చేసి, ఆ తరువాత క్లోనింగ్ చేశారా? లేక ఇతర మార్గాలను ఎంచుకున్నారా? అనే విషయాలపై పోలీసులు పరిశీలిస్తున్నారు.

స్కిమ్మింగ్ అంటే...!

ఏటీఎం మిషన్‌లో డబ్బులు డ్రా చేసే చోట మ్యాగ్నటిక్ రీడర్, ఒక స్పై కెమెరాను ఈ ముఠాలు అమరుస్తాయి. ఏటీఎం కేంద్రంలోకి వినియోగదారుడు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు కార్డును స్వైప్ చేసిన సమయంలో కార్డు వివరాలు మ్యాగ్నటిక్ రీడర్ కాపి చేస్తుంది. పిన్ నంబర్‌ను కెమెరా రికార్డు చేస్తుంది. ఇలా ఒక రోజంతా ఆ కార్డు మిషన్‌లో ఉంటే ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసిన వారి కార్డు వివరాలు కాపి చేస్తుంది. అయితే ఈ ముఠాలు ఒక రోజంతా మ్యాగ్నటిక్ రీడర్, కెమెరాను అక్కడ ఉంచకుండా జాగ్రత్త పడుతారు. కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తొలగించి, మరోచోట ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సమయం ఒకే దగ్గర అది ఏర్పాటయితే గుర్తిస్తారనే అనుమానంతో ఇలా మారుస్తుంటారు. సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. స్కిమ్మింగ్ విధానంలో అపహరించిన డాటాతో ఏటీఎం తయారు చేసే యంత్రాలను ఉపయోగించి క్లోనింగ్ ద్వారా కొత్త(నకిలీ) ఏటీఎం కార్డును ఈ ముఠాలు తయారు చేస్తాయి. ఏటీఎం కార్డుకు సంబంధించిన పాస్‌వర్డ్ రికార్డు అయి ఉండడంతో క్లోనింగ్ కార్డుకు ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి డబ్బులు డ్రా చేస్తారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసేటప్పుడు వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏటీఎం కార్డును డబ్బు డ్రా చేసేందుకు స్వైప్ చేసే సమయంలో చేయి అడ్డం పెట్టడం మంచిది. విత్‌డ్రా చేసే సమయంలో కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్‌ను రికార్డు చేసే అవకాశాలుండడంతో పిన్ ఎంటర్ చేసే సమయంలోనూ చెయ్యి అడ్డంపెట్టి పిన్ టైప్ చేయడం మంచిది. సీసీ కెమెరాలు, సెక్యూరిటీగార్డు లేకుండా ఉన్నా ఏటీఎంల వద్ద క్యాష్ తీయకపోవడం మంచిది. తప్పని సరైతే కార్డు బయటకు కన్పించకుండా వాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

3694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles