బేగంబజార్ చేపల మార్కెట్‌కు మహర్దశ

Thu,July 4, 2019 06:31 AM

begum bazar fish market construction works start

ఐదున్నర కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి పనులు
మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి..
సుమారు 300 కుటుంబాలకు పైగా లబ్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న ఫిష్ మార్కెట్ వ్యాపారులు


హైదరాబాద్ : బేగంబజార్ చేపల మార్కెట్‌కు మహర్దశ రానున్నది. చారిత్రాత్మకమైన బేగంబజార్ చేపల మార్కెట్‌ను ఆధునీకీకరించే దిశగా ఐదున్నర కోట్ల నిధులతో నిర్మాణ పనులు ప్రారంభమైన విషయం విదితమే. గతంలో చేపల మార్కెట్‌ను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ మార్కెట్‌పై జీవనోపాధి సాగిస్తున్న 300కు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరాలనే అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో ఈ మార్కెట్‌లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పరిసర ప్రాంతాల వారికి దుర్వాసన వచ్చేది.

వ్యాపారులకు ఎటువంటి నష్టం జరుగకుండా సెల్లార్, గ్రౌండ్, మొదటి, రెండవ అంతస్తులతో ఏర్పాటు చేసే భవనంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయితే వ్యాపారమే జీవనోపాధిగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికీ మార్కెట్‌లో అవకాశం లభిస్తుంది. బేగంబజార్ అతిపెద్ద వ్యాపార ప్రాంతంగా పేరుగాంచడంతో ఫిష్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మల్టీలెవల్ పార్కింగ్‌సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.

మల్టీలెవల్ కాంప్లెక్స్‌తో ఎంతో మేలు
నిజాం హయాంలో సుమారు వందేళ్ల క్రితం ప్రారంభమైన బేగంబజార్ చేపల మార్కెట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మల్టీలెవల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో మార్కెట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలో సెల్లార్‌లో మల్లీలెవల్ పార్కింగ్ సౌకర్యం, మొదటి అంతస్తులో హోల్‌సేల్ చేపల వ్యా పారం, రెండవ, మూడవ అంతస్తుల్లో చేపల కటింగ్, నాల్గవ అంతస్తులో చేపల స్టోరేజీ కోసం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అన్ని జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో చేపలను పట్టే మత్స్య కార్మికులకు ప్రత్యేకంగా సంచార వాహనాలు, టెంట్లు, ద్విచక్ర వాహనాలు, చేపలను కట్‌చేసే పరికరాలతోపాటు తూకాలను సైతం అందించి నేరుగా వారే చేపలను అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

బేగంబజార్ ఫిష్ మార్కెట్‌లో చేపల విక్రయాలు
ఉమ్మడి పాలనలో కంటే తెలంగాణ ఏర్పడిన అనంతరం చేపల విక్రయాలు జోరందుకున్నాయని బేగంబజార్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పర్వత్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, నిత్యం బేగంబజార్ ఫిష్ మార్కెట్‌లో 15 నుంచి 20 టన్నుల చేపలు దిగుమతి అయి విక్రయాలు కొనసాగుతాయి. ఇందులో ప్రధానంగా రాహు చేప, కట్ల చేప, మిర్గల్, పాంప్లెట్(గోర్కా), మర్రల్, కట్టేన, పంగాస్, తిలపియా, జెల్లా, పాప్ద, పఠాన్, బామ్, సీఫీష్ చేపలు ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యం విక్రయాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం రాహు చేప, కట్ల చేప, మిర్గల్ చేపలు అంతంత మాత్రంగా విక్రయా లు అవుతున్నప్పటికీ పాంప్లెట్ చేపలు మాత్రం అత్యధిక స్థాయిలో విక్రయాలు అవుతున్నాయి. భవనం పూర్తైతే మరింత విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుంది.

1383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles