బాల్యాన్ని అమ్మేస్తున్నారు..!

Mon,April 22, 2019 07:09 AM

domestic child labour cases increases Every year

హైద‌రాబాద్‌: బాలలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం. వారిని పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు. కాని యథేచ్ఛగా బాలల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. జార్ఖండ్ నుంచి బాలలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో పనికి కుదుర్చుతున్నారు. అది ఢిల్లీకి చెందిన ఏజెన్సీ ద్వారా బాలల తరలించడం గమనార్హం. ఇది వరకటి ఘటనలతో పొల్చితే బాలల అక్రమరవాణా తాజాగా వ్యవస్థీకృతమైంది.

వివరాల్లోకి వెలితే.. ఈ నెల 19వ తేదీన జూబ్లీహిల్స్‌లోని ఓ సంపన్న కుటుంబం బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లుగా అధికారులకు ఉప్పందింది. రోడ్ నెంబర్ 46, ప్లాట్ నెంబర్ 905లోని పోష్ డ్యూప్లెక్స్‌ బంగ్లాలో ముగ్గురు బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నట్లుగా సమాచారమందింది. కొంత కాలంగా వారిని పనిలో పెట్టుకున్నట్లుగా సమాచారం రావడంతో అధికారులు ఆకస్మికంగా దాడిచేసి, సదరు బాలికలకు విముక్తి కల్పించారు. సంబంధిత వ్యక్తులపై బాల కార్మిక నివారణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఈ ముగ్గురు బాలికలను ఢిల్లీకి చెందిన నిషా గరేలు సర్వీస్ సెంటర్ సంస్థ పనికి కుదిర్చినట్లుగా వెల్లడయ్యింది. నెలకు రూ. 5 -6వేల వేతనానికి, ఏడాది పాటు పనిచేసేలా ముందే ఒప్పందం చేసుకుని బాలికలను హైదరాబాద్‌కు తీసుకుని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయించుకుంటున్నట్లుగా తేలింది.

- ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన 19 ఏండ్ల బాలికను ఇదే ఏజెన్సీ ద్వారా పనికి కుదిర్చారు. నెలకు రూ. 5 వేల వేతనమిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 1, 2020 వరకు పనిచేసేలా ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 11,500 చెల్లించి, హైదరాబాద్ తీసుకొచ్చారు.

- ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకే చెందిన మరో బాలికను ఏడాదిన్నరగా నగరంలో బాల కార్మికురాలిగా పనిచేస్తున్నది. 8వ తరగతి వరకు చదువుకున్న ఈ బాలికను నగరానికి తీసుకొచ్చి నెలకు రూ. 6 వేల వేతనానికి పనికి కుదిర్చారు. 12-11-2018 నుంచి 12-10-19 వరకు పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకన్నారు.

- ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన 18 ఏండ్ల బాలిక ను ఇదే సంస్థ బాల కార్మికురాలిగా మార్చింది. ఎలాంటి పని అనుభవం లేని అమ్మాయికి నెలకు రూ. 5 వేల వేతనమిస్తామని హైదరాబాద్‌కు తీసుకొచ్చి పనికి కుదిర్చారు. ఈ అమ్మాయి కేవలం రూ. 300 చేతిలో పట్టుకుని నగరానికి వచ్చినట్లు విచారణలో అధికారుల ముందు గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం.

పిల్లలు మమతానురాగాలకు ప్రతిరూపాలు. అభం శుభం తెలియని పసిమెగ్గలు. ఇంతటి అపురూపమైన చిన్నారులు బాలకార్మికులుగా మారుతున్నారు. పనితనంలోనే మోయలేని భారాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. పలకాబలపం పట్టి పాఠాలు నేర్వాల్సిన వారు పనులకు వెళుతూ శ్రమదోపిడికి గురవుతున్నారు. ఆధునికత వెంట పరుగులిడుతున్న 21వ శతాబ్దంలోనూ ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఇంకా పాతుకుపోతున్నది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. బాల్యానికి భరోసా దొరకడం లేదు. ఎక్కడెక్కిడి నుంచో వచ్చి నగరంలో కట్టుబానిసలుగా చేరుతున్నారు. కంటిపాపలా కాపాడాల్సిన వారే వారిని వృత్తిలోని నెట్టడంతో తప్పనిసరయ్యి రోడ్డునపడుతున్నారు. ఇది వరకు బీహార్ నుంచి బాలకార్మికులను నగరానికి తరలించేవారు. అది ఇక్కడి వ్యాపారులు బీహార్ వెళ్లి బాలలను తీసుకొచ్చేవారు. కానిప్పుడు బాల కార్మికులను సరఫరా చేసే ఏజెన్సీలు పుట్టుకు రావడం గమనార్హం. ఇలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించి, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని బాలల హక్కుల సంఘాలు కోరుతున్నాయి.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles