గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం..!

Wed,August 14, 2019 07:05 AM

GHMC  Mayor Bonthu Rammohan asks officials to gear up for Ganesh festival

హైదరాబాద్: గ్రేటర్‌లో అత్యంత వైభవోపేతంగా జరిగే వినాయకచవితి, నిమజ్జన శోభాయాత్రలను అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వచ్చేనెల 12న జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి అపశృతి దొర్లకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆయన కోరారు.

వినాయకచవితి పండుగ వేడుకలపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కన్నా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, శోభాయాత్ర జరిగే మార్గాలన్నింటినీ ముందుగానే మరమ్మతు చేయించేందుకు తగిన ఆదేశాలు జారీచేశామన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణకు గణేశ్ యాక్షన్ బృందాలను నియమించనున్నట్లు తెలిపారు జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఆర్‌డీసీఎల్, మెట్రోరైలు, జాతీయ రహదారులు తదితర శాఖలు సైతం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. విగ్రహాల నిమజ్జనం కోసం గత ఏడాదికన్నా ఈసారి 32 ప్రాంతాల్లో 894 క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు స్టాటిక్ క్రేన్‌లు, మొబైల్ క్రేన్‌లను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ కోసం 32 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధంచేయడంతోపాటు శోభాయాత్ర జరిగే మార్గాల్లో ప్రత్యేక నీటి శిబిరాలను ఏర్పాటుచేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిమజ్జన మార్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ, నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఇబ్బంది కలిగించే స్వల్ప సంఘటన కూడా తలెత్తకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

నిమజ్జనం రోజుల అధనంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపాలని, నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని కోరనున్నట్లు చెప్పారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 56 క్రేన్లను ఏర్పాటుచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది 122 మొబైల్ పోలీస్ బృందాలు ఉండగా, ఈసారి వాటిని 236కు పెంచామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ మాట్లాడుతూ, మెట్రో వంతెనల ఎత్తును దృష్టిలోపెట్టుకొని విగ్రహాల ఎత్తును నిర్థారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, హెచ్‌ఎండీఏ, ఆర్ అండ్ బీ, హెచ్‌ఆర్‌డీసీఎల్ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles