రూపాయి నల్లా కనెక్షన్ మరింత సులభతరం

Wed,September 18, 2019 07:04 AM

హైదరాబాద్ : దారిద్య్ర రేఖకు దిగువన గల తెల్లరేషన్ కార్డు కుటుంబాలు రూపాయి నల్లా కనెక్షన్లు పొందే ప్రక్రియను జలమండలి అధికారులు మరింత సులభతరం చేశారు. పేదలకు నల్లాల ద్వారా సమృద్ధిగా నీరందించే ప్రక్రియలో భాగంగా గడిచిన మూడేండ్లుగా నిరుపేదలు, మధ్యతరగతి వేతన జీవులకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కనెక్షన్ కోసం కావాల్సిన పైపులతో పాటు రోడ్ల తవ్వకాల వ్యయాన్ని సైతం జలమండలియే భరించేలా నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 37వేల మందికి రూపాయికే నల్లా కనెక్షన్ అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కనెక్షన్ అనుమతి ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలోని సింగిల్ విండో విభాగం ద్వారా అనుమతి పొందిన తర్వాత నల్లా కనెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇక నుంచి క్షేత్రస్థాయిలోని జనరల్ మేనేజర్(జీఎం)స్థాయిలోనే రూపాయికే నల్లా కనెక్షన్ అనుమతులు ఇవ్వనున్నారు. తద్వారా 15 రోజులు పట్టే సమయం కేవలం రెండు మూడు రోజుల్లోనే అనుమతులు దక్కనున్నాయి.
నిబంధనలివి..
డిప్యూటీ తహసీల్దార్, ఆపై రెవెన్యూ విభాగం అధికారుల ద్వారా జారీ చేసిన ఆదాయపు ధ్రువీకరణ పత్రంతో పట్టా సర్టిఫికెట్, సేల్ డీడ్ దస్తా వేజులు అందుబాటులో లేనప్పుడు రూ.20 స్టాంప్ పేపర్‌పై, స్థల వైశాల్యంపై ధ్రువీకరణకై దరఖాస్తుదారుడు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాట్లు వైశాల్యం 100 చదరపు మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. భవన నిర్మాణం జీ ఫ్లస్-1 అంతస్తు(6 మీటర్ల ఎత్తు) కంటే ఎక్కువ ఉండకూడదు. రెండవ కనెక్షన్‌కు ఈ పథకం పరిగణించబడదు. దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షల కన్నా తక్కువగా ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే 15 ఎంఎం డయా కనెక్షన్ మాత్రమే మంజూరు చేస్తారు. గృహా వినియోగదారుల విభాగంలో నల్లా కనెక్షన్లు పొందవచ్చు.

868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles