నిబంధనలు పాటించే డ్రైవర్లకు సెల్యూట్

Thu,November 14, 2019 08:55 AM

* చాలాన్లు నమోదు కాని వాహనదారులకు బహుమతులు
* ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్
హైదరాబాద్: నగరంలో ఏండ్ల తరబడి వాహనాలు నడుపుతున్నా ఒక చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనకు కూడా పాల్పడని వారు చాలా మంది ఉన్నారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని నగర పోలీస్ కమిషన్ అంజనీకుమార్ అన్నారు. నగర ట్రాఫిక్ పోలీసువిభాగం, మెక్‌డోనాల్డ్ సంస్థతో కలిసి బుధవారం ట్రాఫిక్ కంట్రోల్ రూం ఆవరణలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అంజనీకుమార్ మాట్లాడారు.


నగరంలో రోడ్డు యూజర్ల సంఖ్య భారీగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు 100% పాటించాలన్నారు. క్లీన్ రికార్డు ఉన్న వాహనదారులను ఎంపిక చేసి మెక్‌డోనాల్డ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ రివార్డులు అందిస్తున్నామన్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, అందులో కొందరు 25 ఏండ్ల నుంచి చిన్న పొరపాటు కూడా లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారని, అలాంటి డ్రైవర్స్‌కు నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు. అలాంటి వారు రోడ్డు యూజర్స్‌కు రోల్ మోడల్‌గా ఉన్నారన్నారు. నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విభాగం తరపున హైదరాబాద్ రోడ్లను సురక్షితంగా తయారు చేసేందుకు చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు.


మూడు నాలుగు నెలల క్రితం పీవీఆర్ సినిమాతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆ కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన మెక్‌డోనాల్డ్ కంపెనీ తాము కూడా రోడ్డు సేప్టీ అవగాహన కార్యక్రమంలో భాగమవుతామని ముందుకొచ్చారని అభినందించారు. డ్రైవింగ్‌లో ఎలాంటి మచ్చలేని వారిని గుర్తిస్తూ వారికి కూపన్లు అందిస్తున్నామన్నారు. కొన్ని ఏండ్ల నుంచి ఒక్క చాలన్ కూడా లేని వాహనదారులకు ఈ బహుమతులు అందిస్తున్నామన్నారు. ప్రతినెల 300 కూపన్లు అందిస్తున్నామన్నారు. ఆరు నెలల పాటు మెక్‌డోనాల్డ్ సహకారంతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలోడీసీపీలు చౌహాన్, బాబురావు, అదనపు డీసీపీలు, ఏసీపీలు అధికారులు, మెక్‌డోనాల్డ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles