సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2 గంటలే కాల్చుదాం..!

Wed,October 23, 2019 10:35 AM

హైదరాబాద్: వెలుగు జిలుగుల పండుగ దీపావళి రానేవచ్చింది. ఇంటిల్లిపాది సంబురంగా జరుపుకునే పటాకుల పండుగ సమీపిస్తున్నది. అయితే సరదాగా పండుగపూట మనం కాల్చే పటాకులు మనకే ముప్పును తెచ్చిపెడుతున్నాయి. భారీగా కాల్చుతున్న పటాకులు అటు శబ్దకాలుష్యంతో పాటు వాయుకాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి. పైగా చెత్తాచెదారాన్ని పోగుచేస్తున్నాయి. తత్ఫలితంగా మన చేతుల్ని మనం కాల్చుకున్న చందానా మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మనం జరుపుకునే దీపావళి పండుగ కాంతులు పంచాలి కాని కాలుష్యమయం కాకూడదన్నది మనందరి నినాదం కావాలి. దీనికనుగుణంగా మనమంతా కాలుష్యరహిత హరిత దీపావళిని జరుపుకోవాల్సిన ఆవశ్యత ఏర్పడింది. బాధ్యతగల.. విజ్ఞత గల పౌరులుగా మనమైనా సుప్రీం తీర్పుననుసరించి శబ్దాలకు తావులేని పటాకులనే కాల్చుదామని, రెండు గంటల పాటు ధూంధాంగా కాల్చి సరదా తీర్చుకుందామని ప్రతినబూనుదాం..


సుప్రీంకోర్టు ఆదేశాలివే..

దీపావళి పండుగ రోజున తక్కువ మోతాదు కాలుష్యం వెదజల్లే పటాకులను వినియోగించాలి. భారీ శబ్దాలు వచ్చే వాటికి దూరంగా ఉండడం మంచిది. రాత్రి 8:00 గంటల నుంచి 10:00 గంటల వరకు కాల్చుకోవచ్చని షరతులు విధించింది. అయితే ఇదే తీర్పును సవరించిన సుప్రీం కోర్టు దక్షిణాది రాష్ర్టాలకు కాస్త మినహాయింపునిచ్చింది. రోజులో ఏదైనా రెండు గంటల పాటు పటాలకులను కాల్చుకోవచ్చని తీర్పునిచ్చింది.

ఎకో ఫ్రెండ్లీ పటాకులు..

ఈ దీపావళికి సరికొత్త పటాకులు అందుబాటులోకి వచ్చాయి. ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ప్రయోగశాల ఎకోఫెండ్లీ గ్రీన్ పటాకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ శబ్దాలు వెదజల్లే పటాకుల స్థానంలో ప్లవర్‌పాట్స్, పెన్సిల్స్, చక్కర్, భూచక్రాలు, స్పార్కిలర్స్, కాకరవత్తులు, చిచ్చుబుడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ఇటీవలే కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్ మార్కెట్‌లోకి విడుదల చేశారు. వీటి వాడకంతో శబ్దకాలుష్యాన్ని 30 శాతంమేర తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సురక్షిత దీపావళి జరుపుకుందామిలా..
మట్టిదీపాలు, కొవ్వొత్తులను వెలిగించడం. చెక్కదీపాలు, విద్యుత్‌దీపాలను వెలిగించడం మంచిది. నెయ్యితో వెలిగించిన దీపాల నుంచి ఆక్సిజన్ వెలువడే అవకాశముంటుంది. కనుక వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
ఇంటిలోపల పటాకులు కాల్చరాదు. దీంట్లో విషవాయువులు ఇంట్లోనే ఉండి హానికలిగిస్తాయి.
తుస్సుమన్నవి.. సగం కాలినవాటి జోలికివెళ్లరాదు. ఇలా చేయడం వల్ల అవి మరలాపేలి ప్రమాదాలు జరుగవచ్చు. కాటన్ దుస్తులు ధరించడం, కాళ్లకు షూ వేసుకోవడం మంచిది.

పటాకులతో ప్రమాదాలివి..

పటాకులు పేల్చడం మనకు సరదా.. కాని మన సరదా మనకే హాని తెచ్చిపెడుతుంది. మనం పేల్చే పటాకులు అత్యంత ప్రమాదకరమైనవి. అణువణువూ విషపూరితమైన వీటిని పేల్చితే ముప్పును కొనితెచ్చుకున్నట్లే. పటాకుల తయారీలో వాడే రసాయనాలు, లోహాలు అత్యంత విషపూరితమైనవి. పలు రకాల రసాయనాల సమ్మేళనంతో కూడిన వీటిని పేల్చితే విషవాయువులు వెలువడుతాయి. వీటిని పేల్చడం వల్ల గాలి, శబ్ద కాలుష్యాలు వెలువడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పటాకుల తయారీలో వీటిని వాడుతారు.. వాటిని కాల్చడం వల్ల ఒనగూరే అనర్థాలేమిటో తెలుసుకుందాం.

కాలుష్యాన్ని నమోదు చేయనున్న పీసీబీ

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆదేశాల మేరకు తెలంగాణ పీసీబీ అధికారులు గ్రేటర్‌లో దీపావళి కాలుష్యాన్ని నమోదుచేయబోతున్నారు. శబ్దకాలుష్యంతో పాటు, వాయు కాలుష్యాన్ని సైతం లెక్కించనున్నారు. ఇందుకోసం పీసీబీ అధికారులు ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. పండుగకు ముందు, పండుగరోజు పలుమార్లు కాలుష్య తీవ్రతలను నమోదుచేయబోతున్నారు. వీటితో పాటు పర్యావరణహిత దీపావళినే జరుపుకుందామని అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలని కోరుతూ.. పోస్టర్లు, టీవీలు, రేడియోల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

పటాకుల్లోని ప్రమాదకర రసాయనాలు, లోహాలు..

బొగ్గు, పోటాషియం నైట్రేట్+సల్ఫర్ = నల్లటి చూర్ణం : ఆక్సీకరణం కోసం వాడే వీటి వలన విషపూరిత దూళి, క్యాన్సర్ కారక సల్ఫర్, బొగ్గు నమ్మేళనాలు వెలువడుతాయి.
అల్యూమినియం : వెండి, తెలుపు జ్వాలలు రావడానికి, స్పార్క్స్‌ను ఉత్పత్తి చేయడానికి దీనిని వాడుతారు. ఇది చర్మానికి తాకితే దద్దుర్లు, నొప్పి పుడుతాయి, శరీరంలో కలిసి అనారోగ్యానికి గురిచేస్తాయి.
స్ట్రోనియం : శరీరంలోని కాల్షియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. స్ట్రోనియం కాస్తా విషపూరితమే.
లిథియం : ఎరుపు రంగు వెదజల్లడానికి దీనిని వినియోగిస్తారు. ఇది మండినప్పుడు విషపూరితమైన వాయువులు వెలువడుతాయి.
బేరియం : ఆకుపచ్చ రంగులు ఉత్పత్తి చేయడానికి వాడే ఇది అత్యంత విషపూరితమైంది. దీని పొగలు శ్వాసనాళానికి ఇబ్బంది కలిగిస్తాయి. రేడియోధార్మికతను కలిగి ఉండే అవకాశముంది.
కాపర్, పాలీ క్లోరినేటెడ్ డయాకిన్స్, డై బెంజో ఫ్యూరాన్స్ : శరీరంలో పొగ పడుతాయి. వీటితో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.
నైట్రేట్లు, క్లోరేడ్లు, పర్ క్లోరేడ్ల్లు : శరీరంలో పేరుకుపోతాయి. పిల్లలకు, తల్లి గర్భంలోని శిశువుల వికాసానికి ప్రమాదకరం. ఇవి చాలా రోజుల వరకు వాతావరణంలోనే ఉంటాయి. మొక్కలకు, జంతువులకు హానికరం.


సల్ఫర్ : సల్ఫ్యూరిక్ ఆమ్లం వల్లవచ్చే ఆమ్లవర్షాలు, జల వనరులు, వృక్ష సంపదకు విఘాతంగా మారుతాయి. ఆస్తినష్టాన్ని కలుగజేస్తాయి.
డెక్స్‌ట్రిన్, జిగురు, పేపర్ : కండ్లు, ముక్కులో మంట, గొంతునొప్పి, తలనొప్పి సమన్వయ సామర్థ్యం కోల్పోతాం. వికారం కలుగుతుంది. కాలేయం, మూత్రపిండాలు, కేంద్రనాడి వ్యవస్థ దెబ్బతింటుంది. క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది.
సీసం : మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అత్యంత విషపూరిత పొగలను విడుదల చేసే దీన్ని పీల్చుకుంటే, చిన్నారులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉండటంతో పాటు, పాక్షికంగా మెదడు దెబ్బతినవచ్చు.
మెగ్నీషియం : మెగ్నీషియం పొగలు వెదజల్లడం వల్ల ఉచ్ఛాస సమస్యలు అధికమవుతాయి. జ్వరం రావచ్చు.
జింకు : జింక్ పౌడర్‌ను పీల్చడం వల్ల వాంతి యొక్క సంచలనాన్ని ప్రేరేపిస్తుంది.
మాంగనీసు : పొగ ద్వారా నేరుగా శరీరంలోకి చేరుతుంది. దీంతో నరాల క్షీణత, నిద్రలేమి, భావోద్వేగ అవాంతరాలు, పక్షవాతం వచ్చే అవకాశముంటుంది.
కాడ్మియం : మూత్రపిండాలు దెబ్బతినవచ్చు, రక్తహీనత, రక్తపోటు పెరుగడం, ఎముకలు పెలుసుగా మారి పగుళ్లు ఏర్పడతాయి.
బాస్వరం : అంతర్గత కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. తీవ్రమైన కంటి నష్టాన్ని కలగజేస్తుంది.
సల్ఫర్ : ఊపిరితిత్తుల పనితీరును నష్టపరుస్తుంది. శ్లేష్మ పొరను తినివేసే లక్షణం కలిగి ఉంటుంది.
నైట్రేట్ : మైకం కమ్మినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, వాంతులు, డయేరియా, మూర్చ తదితరాలకు లోనుకావచ్చు.
నైట్రేట్ : నోటి ద్వారా గాలి శరీరంలోకి వెళ్లడం వల్ల పలు రకాల అనారోగ్యం కలిగిస్తుంది. వాంతులు, వికారం, సైనటైసిస్, రక్తపోటు, తలనొప్పి, దృశ్యబంగిమలు తగ్గడం జరుగుతుంది.
ఇవే కాకుండా పొగలు రావడానికి రూబిడియం, సల్ఫర్, ఆంటిమెని, స్ట్రాంటియం, టైటానియం, మెటల్, జింక్‌లను వినియోగిస్తారు. వీటిని పీల్చుకోవడం వల్ల నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది.

2051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles