పాములాడిస్తూ రెక్కీ.. ఆలయాలే టార్గెట్ గా చోరీలు..

Sat,July 13, 2019 07:56 AM

హైదరాబాద్ : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 60 గ్రాముల బంగారం, 3.26 కిలోల వెండి ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వీసీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.


కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చెందిన నగులూరి ఆదినారాయణ, అతని తమ్ముడు ఈశ్వరయ్యలు పాత నేరస్తులు. వీరు పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గురునాథం ఆంజనేయులు, నగులూరి ఏసయ్య, నగులూరి ఏసురత్నం, నగులూరి అంజయ్యలతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆరుగురు కలిసి తెలంగాణలోని సైబరాబాద్ కమిషనరేట్, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, కర్ణాటకలోని చిక్‌బలాపూర్, కోలార్‌లలో మొత్తం 50 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.

పాములాడిస్తూ రెక్కీ...
ఈ ముఠా సభ్యులు... కుటుంబాలతో మూడు రాష్ర్టాల్లోని పలు గ్రామాల్లో తిరుగుతుంటారు. గ్రామ శివారులో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటారు. మగవారు పగలంతా గ్రామాల్లో పాములు ఆడిస్తూ గ్రామాన్ని పరిశీలించడంతోపాటు దేవాలయాల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఆలయాలకు వెళ్లి హుండీలో చిల్లర వేసినప్పుడు శబ్దం వస్తే ఖాళీగా ఉందని, శబ్దం రాకపోతే నిండుగా ఉందని నిర్థారించుకుంటారు. రాత్రి వేళల్లో హుండీల్లోని నగదును, వెండి, బంగారు ఆభరణాలతో కూడిన పూజా సామగ్రిని, చిన్న చిన్న విగ్రహాలను చోరీ చేసి ఉడాయిస్తుంటారు. ఈ ముఠా గత నెల 20న షాద్‌నగర్ వద్ద ఒకే రోజు 4 హుండీలను కొల్లగొట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 6 మంది సభ్యులు ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

1108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles