తెలంగాణ హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు చుక్కెదురు

Wed,May 15, 2019 12:32 PM

TV9 former CEO ravi prakash lunch motion petition rejected by telangana high court

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఆయన నోటీసులపై స్పందించలేదు. గడువు కూడా ముగియడంతో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాంతో పాటు హైకోర్టులోనూ ఆయనకు చుక్కెదురవడంతో... ఇవాళ రవి ప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవాళ ఉదయం 11 గంటలకే ఆయన పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే 11 దాటిపోవడంతో రవిప్రకాశ్‌కు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కూడా పరారీలోనే ఉన్నారు.

అసలు.. రవిప్రకాశ్ ఎక్కడ ఉన్నారు?


ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడున్నారనే విషయంపై చాలా గందరగోళం నెలకొన్నది. ఆయన ఏపీలో ఉన్నారని కొందరు.. కాదు ముంబైలో ఉన్నారని మరికొందరు చెబుతుండటం.. ఆయన మాత్రం తన సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటంతో ఆయన ఎక్కడున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తమకేమీ తెలియదని చెబుతున్నారు.

4923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles