73కు చేరిన పాక్‌ రైలు ప్రమాద మృతుల సంఖ్య

Thu,October 31, 2019 02:59 PM

కరాచీ : పాకిస్థాన్‌ తేజ్‌గమ్‌ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 73కు చేరింది. గురువారం ఉదయం కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న తేజ్‌గమ్‌ రైలులో సిలిండర్‌ పేలిన విషయం విదితమే. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైల్లోని మూడు బోగీల్లో మంటలు వ్యాపించాయి. రెండు ఎకానమీ క్లాస్‌, మరో బిజినెస్‌ క్లాస్‌ బోగీల్లో మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ మూడు బోగీల్లో 200 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక బోగీలో 77 మంది ఉన్నట్లు, మరో బోగీలో 78 మంది ఉన్నట్లు తెలిపారు. బిజినెస్‌ క్లాస్‌ బోగీలో సుమారు 54 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.

2663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles