యూదుల మందిరంపై దాడి.. ట్విచ్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

Thu,October 10, 2019 08:27 AM

హైద‌రాబాద్‌: జ‌ర్మ‌నీలోని యూద మందిరంపై ఓ ఉన్మాది కాల్పుల‌కు తెగించాడు. భారీ ఆయుధాల‌తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై అత‌ను దాడి చేశాడు. ఆ కాల్పుల్లో ఇద్ద‌రు మృతిచెందారు. అయితే ఆ ఆగంత‌కుడు ఈ ఘాతుకాన్ని ఆన్‌లైన్‌లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. సుమారు 35 నిమిషాల పాటు త‌న కిరాత‌క చ‌ర్య‌ను ట్విచ్ వీడియోగేమ్ ఫ్లాట్‌ఫాంలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాడు. అతివాద తీవ్ర‌వాదాన్ని ప్ర‌చారం చేసేందుకు ఆ ఉన్మాది ఈ చ‌ర్య‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. మందిరంలోకి వెళ్లేముందు 27 ఏళ్ల ఉన్మాది యూద మ‌త‌స్థుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశాడు. అయితే మందిరం త‌లుపులు వేసి ఉండ‌డం వ‌ల్ల అత‌ను అక్క‌డ కాల్పులు జ‌రిపాడు. స‌మీపంలో ఉన్న ఇద్ద‌ర్ని షూట్ చేశాడు. ఆ వ్య‌క్తి స్వ‌తంత్రంగానే ఉన్మాదానికి దిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న అత‌ను.. ప‌లుర‌కాల ఆయుధాల‌తో సైన‌గాగ్‌పై దాడికి ప్ర‌య‌త్నించాడు.


కాల్పుల్లో మృతిచెందిన ఇద్ద‌రి కుటుంబ‌స‌భ్యుల‌కు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ మెర్క‌ల్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆగంత‌కుడు ఆయుధాల‌తో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ నిఘా కెమెరాల‌కు చిక్కాయి. కాల్పుల స‌మ‌యంలో ప్రార్థ‌నా మందిరంలో సుమారు 80 మంది వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లమైన ఉన్మాది.. త‌న వ‌ద్ద ఉన్న ఆయుధాల‌తో స‌మీపంలో ఉన్న వారిపై ఫైరింగ్ జ‌రిపాడు. ఆ కాల్పుల్లో ఓ మ‌హిళ‌తో పాటు మ‌రో వ్య‌క్తి మృతిచెందారు. యూదుల ప‌విత్ర దినం రోజున ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఇటీవ‌ల‌ ఆన్‌లైన్ లైవ్ ఫ్లాట్‌ఫామ్‌ల‌ను వాడుకుని కాల్పుల‌కు దిగుతున్న ఘ‌ట‌న జ‌రిగ‌డం ఇది రెండ‌వ‌సారి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్ మ‌సీదులోకి వెళ్లిన ఓ ఆగంత‌కుడు కాల్పులు జ‌రిపి 51 మందిని హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఘ‌ట‌న‌ను అత‌ను ఫేస్‌బుక్‌లో లైవ్ చేశాడు. జ‌ర్మ‌నీ దాడికి సంబంధించిన వీడియోను డిలీట్ చేసిన‌ట్లు ట్విచ్ సంస్థ పేర్కొన్న‌ది. కానీ దాన్ని అప్ప‌టికే వేల‌మంది చూశారు.

2207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles