34 లగ్జరీ కార్లను అమ్మేసిన ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం

Mon,September 17, 2018 05:06 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం 34 లగ్జరీ కార్లను వేలంలో అమ్మేసింది. ఇందులో కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. నిరాడంబరంగా ఉండాలన్న కొత్త ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పాక్ ఈ పని చేసింది. మొత్తం 102 లగ్జరీ కార్లను ఇలాగే అమ్మాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయించింది. అటు పాక్ కూడా లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ డబ్బు ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తీవ్రమైన అప్పుల్లో పాక్ కూరుకుపోయింది. లగ్జరీ కార్లనే కాదు.. పీఎంవోలో ఉన్న 8 బర్రెలను కూడా పాక్ వేలంలో అమ్మాలని నిర్ణయించింది. ఈ బర్రెలను గత ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ఇక అవసరానికి మించి ఉన్న నాలుగు హెలికాప్టర్లను కూడా అమ్మనున్నట్లు ప్రధానమంత్రి ప్రత్యేక రాజకీయ సలహాదారు నయీముల్ హక్ వెల్లడించారు. ప్రస్తుతం అమ్మిన కార్లన్నీ దేశీయంగా తయారుచేసినవే.

రెండో దశ వేలంలో భాగంగా 41 ఇంపోర్టెడ్ కార్లను వేలం వేయనున్నారు. ప్రస్తుతం అమ్ముడుపోయిన 34 కార్లలో నాలుగు మెర్సెడీజ్ బెంజ్ కొత్త మోడళ్లు, 8 బుల్లెట్‌ప్రూఫ్ బీఎండబ్ల్యూ కార్లు, మూడు 5000 సీసీ ఎస్‌యూవీలు, రెండు 3000 సీసీ ఎస్‌యూవీలు ఉన్నాయి. మరో 24.. 2016 మోడల్ మెర్సిడీజ్ కార్లను కూడా వేలం వేశారు. ఆ తర్వాతి దశలో 40 టొయోటా కార్లు, ఓ లెక్సస్ ఎస్‌యూవీ, రెండు లాండ్ క్రూజర్లు వేలంలో ఉండనున్నాయి. అత్యధిక బిడ్ దాఖలు చేసినవాళ్లకు ఈ కార్లను అమ్మనున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తానని ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి ప్రసంగంలోనే ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పుల్లో పాకిస్థాన్ కూరుకుపోయింది.

2900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles