మిస్ట‌రీగా మారిన జెఫ్రీ ఎప్‌స్టీన్ మృతి

Tue,August 13, 2019 12:01 PM

న్యూయార్క్‌ : అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్ మృతిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అత‌ను జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. ఒక‌వేళ కేసులో దోషిగా తేలితే అత‌నికి క‌నీసం 45 ఏళ్ల శిక్ష‌ప‌డేది. అయితే ఇటీవ‌ల న్యూయార్క్‌ పట్టణంలోని మ‌న్‌హ‌ట్ట‌న్‌ జైలులో ఎప్‌స్టీన్ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేక స‌హ‌జంగా మ‌ర‌ణించాడా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అనేక‌ మంది మైన‌ర్ అమ్మాయిల‌ను అత్యాచారం చేశాడ‌ని ఎప్‌స్టీన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అత‌న్ని గ‌త జూలైలో అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారు. కానీ ఎప్‌స్టీన్ జైలులో సూసైడ్‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో అత‌నిపై నిఘా కూడా పెట్టారు. కానీ ఎప్‌స్టీన్ మృతికి ముందు ఆ నిఘాను ఎత్తివేశారు. జైలు సెల్‌లోనే అత‌ని శ‌వాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఎప్‌స్టీన్‌పై న‌ష్ట‌ప‌రిహారం కేసులు వేసిన అమ్మాయిలు గ‌గ్గోలుపెడుతున్నారు.


అమెరికాలో మేటి ఫైనాన్స‌ర్‌గా ఎప్‌స్టీన్‌కు గుర్తింపు ఉంది. అత‌నికి ఆ దేశ మేటి రాజ‌కీయ‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. అత‌ని ఫ్రెండ్స్ లిస్టులో బిల్ క్లింట‌న్‌, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే ఆ సంబంధాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌న్న ఉద్దేశంతోనూ ఎప్‌స్టీన్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వంద‌లాది డాల‌ర్లను ఎర చూపి ఎప్‌స్టీన్ అనేక మంది అమ్మాయిల‌ను అనుభ‌వించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ జైలు బోనులో ఎప్‌స్టీన్ మృతి చెంద‌డం ఓ మిస్ట‌రీగా మారింది. కొంద‌రు సేనేట‌ర్లు ఆయ‌న మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. జైలు అధికారులు ఏం చూస్తున్నార‌ని ఆరోపించారు. భారీగా ముడుపులు ముట్ట‌డం వ‌ల్లే ఎప్‌స్టీన్ మృతిని జైల‌ర్లు ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 66 ఏళ్ల ఎప్‌స్టీన్‌ను ప్ర‌తి అర‌గంట‌కు ఒక‌సారి జైలు గార్డ్స్ చెక్ చేయాలి. కానీ అత‌ను చ‌నిపోయిన రోజున అత‌న్ని ఎవ‌రూ చెక్ చేయ‌లేదు. దీంతో ఆ మ‌ర‌ణం వెనుక జైల‌ర్ల పాత్ర ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles