సంప‌న్నుల‌కే గ్రీన్‌కార్డు.. పేద‌లైతే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వాడొద్దు

Tue,August 13, 2019 09:45 AM

దారిద్య్ర‌రేఖ‌ను దాటితేనే.. ప‌ర్మ‌నెంట్ స్టాట‌స్‌


హైద‌రాబాద్: అమెరికా ఈజ్ క్యాపిట‌లిస్ట్ కంట్రీ అంటారు. దానికి త‌గిన‌ట్లుగానే ఆ దేశం వ్య‌వ‌హ‌రిస్తోంది. ధ‌న‌వంతులే ఆ దేశంలో బ్ర‌త‌కాలి. ఇప్పుడు అక్క‌డ అదే రూల్‌గా మార‌నున్న‌ది. వ‌ల‌స వ‌స్తున్న‌వారిపై వ‌రుస‌గా ఆ దేశం కొర‌డా రుళిపిస్తున్న‌ది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఆస‌రా చేసుకునే పేద‌వారికి గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని అగ్ర‌రాజ్యం నిర్ణ‌యించింది. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న తాజా ఉత్త‌ర్వుతో పేద‌ల‌కు అనుహ్య‌మైన షాక్ ఇచ్చారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందిస్తుంది. ఇదే సిద్ధాంతం అమెరికాలోనూ ఉన్నది. కానీ ఆ దేశానికి వ‌ల‌స వ‌స్తున్న‌వారి సంఖ్య అదుపు తుప్పుతున్న‌ది. ఆ ఉప‌ద్ర‌వాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. ఇప్పుడు తాజాగా పేద వ‌ల‌స‌ల‌కు గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడదని నిర్ణ‌యించారు. ఇది నిజంగా పెద్ద షాక్‌. ఆఫ్రికా, సెంట్ర‌ల్ అమెరికా, క‌రీబియ‌న్ దీవుల ప్ర‌జ‌ల‌కు శ‌రాఘాతం. లీగ‌ల్‌గా వీసా ఉన్నా.. వారి ఆర్థిక ప‌రిస్థితే ఆ దేశంలో బ్ర‌తికేందుకు వీలు క‌ల్పించ‌నున్న‌ది.

ప‌ర్మ‌నెంట్ రెసిడెంట్ స్టాట‌స్ కోసం సాధార‌ణంగా వ‌ల‌స ప్ర‌జ‌లు అమెరికా ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. దాన్నే గ్రీన్‌కార్డు అంటారు. చ‌ట్ట‌ప‌రంగా వీసా ఉన్న వారే ఆ ద‌ర‌ఖాస్తు చేస్తారు. అయితే లీగ‌ల్ వీసా ఉన్నా.. ఇప్పుడు ఆ వ్య‌క్తులు ప్ర‌భుత్వానికి త‌మ ఆర్థిక స్థితిగ‌త‌లను వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లకు గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ప్ర‌స్తుతం గ్రీన్ కార్డు ఉన్న‌వాళ్లు కూడా ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని పొంద‌కూడ‌దు. అలా చేస్తే వారి గ్రీన్‌కార్డును వెన‌క్కితీసుకుంటారు. వ‌ల‌స వ‌చ్చిన వారు స్వ‌యం స‌మృద్ధి క‌లిగి ఉండాల‌ని, వాళ్లు దేశ సంప‌ద‌ను నిర్వీర్యం చేస్తున్న‌ట్లుగా ఉండ‌కూడ‌ద‌ని శ్వేత సౌధిం ఇమ్మిగ్రేష‌న్‌ అధికారి ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

తాత్కాలిక వీసాపై అమెరికాలో ఉంటున్న‌వారిని ఇక నుంచి పూర్తి స్థాయిలో నిఘా పెట్ట‌నున్నారు. వాళ్ల‌ను అధిక స్థాయిలో ప్ర‌శ్నిస్తారు. ఇమ్మిగ్రేన్ పొందిన వ్య‌క్తి వ‌య‌సు, ఆరోగ్యం, ఫ్యామిలీ హోదా, ఆస్తులు, వ‌న‌రులు, ఆర్థిక పరిస్థితి, విద్య లాంటి అంశాల‌ను తెలుసుకుంటారు. ప్ర‌భుత్వ లాభాల‌ను పొంద‌నివారికి మాత్రమే ఎక్కువ శాతం గ్రీన్‌కార్డులు జారీ చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ది. ఇమ్మిగ్రేష‌న్ అధికారి స్టీఫెన్ మిల్ల‌ర్ ఈ రూల్‌ను త‌యారు చేశారు. మ‌రో 60 రోజుల్లోనే ఈ కొత్త రూల్‌ను అమ‌లు చేయ‌నున్నారు. వ‌ల‌స‌ల‌పై క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న ట్రంప్‌కు ఇదో కొత్త ఆయుధంగా మార‌నున్న‌ది. ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించే వాళ్లు మాత్ర‌మే కావాలి, ప్ర‌జా వ‌న‌రుల మీద ఆధార‌ప‌డేవాళ్లు వ‌ద్ద‌న్న సిద్ధాంతంతో అమెరికా ముందుకు వెళ్లుతున్న‌ది.

అమెరికా అధికార దారిద్య్ర‌రేఖ క‌న్నా 250 శాతం ఎక్కువ సంపాదించే వారికి కొత్త ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టంతో ఎటువంటి ప్ర‌మాదం ఉండ‌దు. అక్క‌డ న‌లుగురు స‌భ్యులు ఉన్న కుటుంబం క‌నీసం ఏడాదికి 64వేల డాల‌ర్లు సంపాదించాలి. అంటే 48 ల‌క్ష‌లు. ఇంత మొత్తం సంపాదిస్తే ఇక వాళ్లు గ్రీన్‌కార్డుకు అర్హులు. అది కూడా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఆధార‌ప‌డ‌కుంటేనే. దారిద్య్ర‌రేఖ క‌న్నా త‌క్కువ సంపాదించేవారు ఒక‌వేళ గ్రీన్‌కార్డు కావాలంటే.. వాళ్లు ఎటువంటి ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొంద‌డంలేద‌ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లీగ‌ల్ వీసా ఉండి ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొందుతున్న‌వారిలో సుమారు 2.6 కోట్ల మంది వ‌ల‌స ప్ర‌జ‌లు ఉంటార‌ని అక్క‌డి ఏజెన్సీలు అంచ‌నా వేస్తున్నాయి. కొత్త నియ‌మం ప్ర‌కారం వాళ్లంతా త‌మ ఇమ్మిగ్రేష‌న్ స్టాట‌స్‌ను మ‌రోసారి స‌మీక్షించుకోవాల్సి ఉంటుంది. పౌర హ‌క్కుల సంఘాలు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని హేయ‌మైన చ‌ర్య‌గా ఆరోపిస్తున్నాయి.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles