భర్తకు 11 కత్తిపోట్లు.. భార్యే హంతకురాలు..

Thu,August 22, 2019 02:43 PM

ముంబయి : భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భార్యే అతన్ని విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నల్లాస్‌పుర తులింజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సునీల్‌ కడం(36), ప్రనళి(33)ది ప్రేమవివాహం. వీరికి 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు సంతానం ఇద్దరమ్మాయిలు. ఒకరి వయసు ఏడు సంవత్సరాలు కాగా, మరొకరి వయసు 8 నెలలు. సునీల్‌ కడం నల్లాస్‌పురాలోని తన తండ్రి ఆనంద నివాసంలోనే నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి సునీల్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రనళి.. భర్తను నిలదీసింది. ఇదే విషయమై మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు దంపతుల మధ్య గొడవ జరిగింది.


నీళ్ల కోసమని వెళ్లి కత్తి తీసుకొచ్చింది
ఆ తర్వాత ప్రనళి కిచెన్‌లోకి నీళ్లు తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయింది. సునీల్‌ బెడ్‌రూమ్‌లోనే ఉన్నాడు. కిచెన్‌లోకి వెళ్లిన భార్య.. నీళ్లు తీసుకురాకుండా కత్తి తీసుకువచ్చింది. ఆ కత్తితో భర్తపై విచక్షణారహితంగా 11 సార్లు దాడి చేసింది. ఆ తర్వాత గొంతు కోసింది. దీంతో అతని ఊపిరి ఆగిపోయింది. ఇక ఏమి తెలియనట్టు సునీల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆనందకు ప్రనళి చెప్పింది. తక్షణమే ఆనంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఇది ఆత్మహత్య కాదు.. హత్యే అని పోలీసులు నిర్ధారించారు. తమదైన శైలిలో పోలీసులు ప్రనళిని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నందునే సునీల్‌ను హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

13683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles