అభ్యాస్ గల్లీ లేదా పడాయ్ గల్లీ.. వేల మంది ముంబై విద్యార్థుల పాలిట సరస్వతి

Thu,May 9, 2019 06:06 PM

ఓ లెజెండ్ అంటాడు.. ముంబైలో ఏదైనా పోగొట్టుకుంటే.. మళ్లీ అదే వస్తువును చోర్ బజార్‌లో కొనుక్కోవచ్చట. కానీ.. నిజానికి దాని పేరు చోర్ బజార్ కాదు.. షోర్ బజార్.. అంటే శబ్దం చేసే మార్కెట్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే అరిచే మార్కెట్ అన్నమాట. కానీ.. బ్రిటీష్ వాళ్లు.. షోర్‌ను కాస్త చోర్ చేశారు. ఇప్పుడు అది చోర్ బజార్‌గా మిగిలిపోయింది. అదంతా ఓకే కానీ.. ఇప్పుడు ఆ చోర్ బజార్ గురించి ఎందుకు చెబుతున్నారు.. అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. మనం ఇప్పుడు ముంబైలోని ఓ గల్లీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది చాలా స్పెషల్ గల్లీ. వేల మంది విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన గల్లీ అది. దాని పేరే అభ్యాస్ గల్లీ లేదా పడాయ్ గల్లీ. చదవడానికి కాస్త వింతగా ఉన్నా.. ఆసక్తిగా అనిపిస్తోంది కదా.. పదండి ఓసారి ముంబైలోని ఆ గల్లీకి వెళ్లి.. దాని విశేషాలేంటో తెలుసుకుందాం.


వీధుల్లో కొన్ని చోట్ల హాలోజెన్ లైట్స్‌ను పెడుతుంటారు ఎప్పుడైనా చూశారా? అవి చాలా వెలుతురును ఇస్తాయి. మామూలు ఎల్‌ఈడీ లైట్ల కన్నా ఎక్కువ వెలుతురును ఇస్తాయి అవి. ఆ లైట్లనే ఆ గల్లీలో ఏర్పాటు చేశారు. అదే విద్యార్థులకు వరంగా మారింది. ఎందుకంటే.. ముంబై గురించి మీకు తెలుసు కదా. ఇరుకిరుకు ఇండ్లు.. జోపడ్ పట్టీలు.. ఆ ఇండ్లలో పడుకోవడానికే ప్లేస్ ఉండదు. అందులోటి.. చాలా ఆటంకాలు.. చదువు అస్సలు ఎక్కదు. చిన్న చిన్న ఇండ్లలో ఉండే విద్యార్థులకు అది వరంగా మారింది. సూర్యుడు అస్తమించగానే.. రాత్రి అవడమే ఆలస్యం.. లైట్లు ఆ వీధిలో వెలగగానే.. వెంటనే పుస్తకాలు పట్టుకొని ఆ వీధికి చేరుకుంటారు విద్యార్థులు. ఎటువంటి ఆటంకాలు లేకుండా లేట్ నైట్ వరకు ప్రశాంతంగా అక్కడ చదువుకుంటారు. అందుకే దానికి అభ్యాస్ గల్లీ లేదా పడాయ్ గల్లీ అనే పేరు వచ్చింది.

ఆ వీధి చుట్టూ చెట్లు, ఎటువంటి వాహనాల మోత ఉండదు. ప్రశాంతంగా ఉండే ఆ గల్లీలో రాత్రి పూట లైట్ల కింద చదువుకొని ఉన్నతమైన స్థానాలను పొందిన వారు కోకొల్లలు. ఇంతకీ ఈ గల్లీ ముంబైలో ఎక్కడుంది అంటారా? బిజీ ఏరియా వర్లి నాకాలో ఉన్న పొద్దర్ ఆసుపత్రి వెనుక ఉంటుంది ఈ గల్లీ.

ఆ గల్లీ వేల మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తుండటంతో.. ఆ గల్లీని ముంబై మిసాల్ అనే సంస్థ... క్లీన్ చేయడం ప్రారంభించింది. ఆ గల్లీ గోడలపై మోటివేషనల్ మెసేజ్‌లు రాయడం, బేంచీలను శుభ్రపరచడం, వీధిని శుభ్రపరచడం వల్ల విద్యార్థులు అక్కడ కూర్చొని చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికి రెండు జనరేషన్లు ఇలాగే ఆ గల్లీలో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించారు.

నిజానికి ఈ గల్లీ పేరు సుదామ్ కలీ అహిరే మార్గ్. తర్వాత దాన్ని అభ్యాస్ గల్లీగా పేరు మార్చారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ వాళ్లు అక్కడ హలోజెన్ లైట్లను అమర్చారు. సొంతంగా అక్కడికి వెళ్లి చదువుకోవడం కోసమే కాదు.. విద్యార్థులు గ్రూప్‌లుగా వచ్చి.. కలిసి చదువుకుంటారు. ఏవైనా డౌట్స్ ఉంటే తీర్చుకుంటారు. గ్రూప్‌లో చదువుకుంటే ఎక్కువగా నేర్చుకోవచ్చు కదా.. అది విద్యార్థులకు పరీక్షల్లో బాగా ఉపయోగపడుతుంది.

సాయంత్రం 7 కాగానే అక్కడికి విద్యార్థులు వచ్చేస్తారు. చాలామంది 7 నుంచి 10 వరకు చదువుకుంటారు. కొంతమంది అర్ధరాత్రి వరకూ ఉండి చదువుకుంటారు. ఇక.. పరీక్షల సమయంలో అయితే.. ఆ గల్లీ నిండిపోతుందట. విద్యార్థులతో కిటకిటలాడుతుందట. ఎక్కువగా ఏప్రిల్, డిసెంబర్‌లో పరీక్షల సమయంలో ఈ గల్లీకి విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలం మాత్రం.. ఈ గల్లీ ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే.. ముంబైలో వర్షాలు ఎలా పడతాయో మీకు తెలుసు కదా. వర్షాలు పడ్డప్పుడు పక్కనే ఉన్న లైబ్రరీకి వెళ్లి చదువుకుంటారట విద్యార్థులు. అసాధారణ పరిస్థితులను వదిలేస్తే.. మిగితా సమయాల్లో అభ్యాస్ గల్లీలోనే ఎక్కువగా గడపడానికి మొగ్గు చూపిస్తారు విద్యార్థులు.

ఈ గల్లీలో చదువుకునే చాలామంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఎంట్రీప్రెన్యూర్స్ అయ్యారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. అయితే.. అప్పుడప్పుడు ఈ గల్లీలో చదివే విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఎవరైనా ఆకతాయిలు, మద్యం సేవించిన వాళ్లు.. అక్కడికి వచ్చి విద్యార్థులను బెదిరిస్తారు.. అది చాలా అరుదుగా జరుగుతుందట. అయితే.. పెట్రోలింగ్ వాహనాలు రాత్రి పూట అక్కడే తిరుగుతూ.. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. ఆ భరోసాతోనే విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా అక్కడ ప్రశాంతంగా చదువుకుంటున్నారు. వావ్.. నిజంగా గ్రేట్ కదా.. ఓ వీధి.. విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తుందంటే.. సూపర్.

1771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles