అయోధ్య తీర్పు.. ఐదుగురు న్యాయమూర్తులు వీరే..

Sat,November 9, 2019 01:07 PM

న్యూఢిల్లీ : అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా శనివారం తుదితీర్పును వెల్లడించింది. మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టారు. ఈ కేసులో 40 రోజుల పాటు సుప్రీంకోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 16న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ సందర్భంగా సీజేఐ రంజన్ గోగోయ్ నేతత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల వివరాలు తెలుసుకుందాం..


సీజేఐ రంజన్ గోగోయ్
అయోధ్య కేసుకు సీజేఐ రంజన్ గోగోయ్ నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018, అక్టోబర్ 3న బాధ్యతలు చేపట్టారు గోగోయ్. 1954, నవంబర్ 18న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్‌లో చేరారు. గౌహతి హైకోర్టులో లాయర్ గా కెరీర్ ను ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో లాయర్ గా గొగోయ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012, ఏప్రిల్ 23న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రంజన్ గోగోయ్ ఈ ఏడాది నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (ఎస్‌ఏ బొబ్డే)
రంజన్ గోగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో రెండవ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఏ బోబ్డే. 2013 లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు ఎస్ఏ బొబ్డే. రంజన్ గోగోయ్ పదవీ విరమణ పొందిన అనంతరం ఎస్ఏ బొబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన ఏప్రిల్ 23, 2021 న పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్
జస్టిస్ డి.వై.చంద్రచుడ్ 2016, మే13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. శబరిమల, భీమా కోరెగావ్, స్వలింగసంపర్కంతో సహా పలు పెద్ద కేసుల్లో ఆయన బెంచ్‌లో భాగమయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

జస్టిస్ అశోక్ భూషణ్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ 2016, మే13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ లో 1979లో చేరారు. కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందించారు. అశోక్ భూషణ్ 2001 లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ అబ్దుల్ నజీర్
అయోధ్య కేసు బెంచ్‌లో ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్ 1983 లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆయన కర్ణాటక హైకోర్టులో లాయర్‌గా నజీర్ ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత అదనపు న్యాయమూర్తి, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు నజీర్.

2598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles