న్యూఢిల్లీ : సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చరిత్రలోనే ఇది తొలిసారి. ఏడు శునకాలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది సీఐఎస్ఎఫ్. గత ఎనిమిది సంవత్సరాల నుంచి సీఐఎస్ఎఫ్ విభాగంలో పారామిలటరీ ఫోర్స్‌తో ఏడు శునకాలు విధి నిర్వహణలో ఉన్నాయి. అయితే శునకాలకు వయసు పైబడడంతో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సీఐఎస్ఎఫ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. శునకంగా జన్మ.. సైనికుడిగా పదవీ విరమణ అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది.
అయితే ఈ సెవెన్ డాగ్స్.. ఢిల్లీ మెట్రోలో విధులు నిర్వర్తించాయి. ఈ శునకాలు చేసిన సేవలకు గానూ వాటిని సత్కరించి మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్స్‌ను బహుకరించారు. శునకాలకు పదవీవిరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సీఐఎస్ఎఫ్ చరిత్రలో ఇదే తొలిసారి అని పారామిలటరీ ఫోర్స్ పేర్కొంది. పదవీవిరమణ పొందిన శునకాలను ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు.