బెంగాల్‌ను తాకి.. బంగ్లాదేశ్‌ దిశగా ఫొని

Sat,May 4, 2019 09:57 AM

హైదరాబాద్‌ : ఉగ్రరూపం దాల్చిన తీవ్ర పెను తుఫాను ఫొని పశ్చిమ బెంగాల్‌ను తాకి బంగ్లాదేశ్‌ దిశగా దూసుకెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో ఒడిశాలోని బాలసోర్‌ మీదుగా బెంగాల్‌ను ఫొని తాకింది. బెంగాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫొని బంగ్లాదేశ్‌ దిశగా దూసుకెళ్తున్న సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఫొని బంగ్లాదేశ్‌ను తాకే అవకాశం ఉంది. బెంగాల్‌లో తుఫాను ఫొని ప్రభావంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ కేసరినాథ్‌ త్రిపాఠితో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని మోదీ చెప్పారు. ఈస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాలో 15 వేల మంది, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాలో 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఈదురుగాలులు, వర్షం నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. ఫొని తుపాను బలహీనపడడంతో తిరిగి ఇవాళ ఉదయం 9:45 గంటల నుంచి విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇక రైళ్ల పట్టాలపై చెట్లు విరిగిపడటం, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను ఫొని కారణంగా ఒడిశాలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో 11 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles