డ్యామ్‌లతో ప్రమాదం..

Wed,August 22, 2018 01:48 PM

dams may be dangerous if not maintained properly, says Himanshu Thakkar

హైదరాబాద్: డ్యామ్‌ల్లో నీటిని నిల్వ చేయడం కాదు, వాటిని సరిగా నిర్వహించకుంటే ప్రమాదమే అవుతుంది. తాజాగా కేరళలో జరిగిన జలవిలయం ఇదే సూచిస్తుంది. నీటి నిపుణుడు హిమాన్షు థక్కర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. సౌత్ ఏషియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ తరపున పనిచేస్తున్న హిమాన్షు.. కేరళ విపత్తుపై ఆసక్తికర అభిప్రాయాన్ని వినిపించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. డ్యామ్‌లతోనూ ప్రమాదం ఉందన్నారు. డ్యామ్ ఆపరేటర్లు వాటిని సరిగా నిర్వహించకుంటే.. వాటి వల్ల కూడా వర్షాల సమయంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

కేరళలో మొత్తం 44 నదులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న కనీసం 30 డ్యామ్‌ల నుంచి సరైన సమయంలో అధికారులు నీటిని విడుదల చేసి ఉంటే ప్రమాదం ఇంత సీరియస్‌గా ఉండేది కాదని ఆయన అన్నారు. భారీ వర్షాలతో వరదలు ముంచుకొస్తుంటే.. డ్యామ్‌ల నుంచి ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తే ఈ విపత్తు సంభవించేది కాదన్నారు. డ్యామ్‌లు నిండేంత వరకు వేచి ఉండడం వల్ల ప్రమాదం చేతులు దాటిందన్నారు. ప్రత్యామ్నాయం లేని సమయంలో నీటి విడుదల చేయాలని డ్యామ్ అధికారులు ఆలోచించడం వల్ల ప్రమాదం ముదిరిందని హిమాన్షు అభిప్రాయపడ్డారు.

కేరళలో డ్యామ్‌లు, ఆనకట్టలు నిండిన తర్వాత.. అప్పుడు నీటిని వదలడం ప్రారంభించారు. దీంతో సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. ఒకవైపు భారీగా వరదలు వస్తుంటే.. ఆ సమయంలో ఇడుక్కీ, ఇడమలియార్ లాంటి పెద్ద డ్యామ్‌ల నుంచి నీటిని వదిలారని, దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని నీటి నిపుణుడు అభిప్రాయపడ్డారు. పొడి పొడిగా ఉన్న సమయంలోనే.. డ్యామ్‌ల నుంచి నీటిని వదిలితే.. నష్టాన్ని తగ్గించేవాళ్లమని ఆయన అన్నారు. వరదలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ రాష్ట్రం పాటించలేదని ఆయన ఆరోపించారు. సెంట్రల్ వాటర్ కమీషన్ కూడా ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు చేయలేదన్నారు.

గత రెండున్నర నెలల్లో.. కేరళలో సుమారు 37 శాతం అధిక వర్షపాతం కురిసింది. దీంతో స్థానిక అధికారులు వరద తీవ్రతను అంచనా వేయలేకపోయారు. వందేళ్ల తర్వాత ఇంత భారీ వర్షాలు పడడం కూడా ఒక కారణమే. అడవుల నరికివేత వల్ల కూడా సమస్య మరింత కఠినంగా మారుతోందని మరో నీటి నిపుణుడు జేమ్స్ విల్సన్ అభిప్రాయపడ్డాడు.

4632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles