ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఐదుగురు నక్సల్స్ హతం

Sat,August 24, 2019 09:02 PM

five Naxals killed and two jawan injured in encounter in Chhattisgarh

కొత్తగూడెంక్రైం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థీ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కి 20 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మిలిటరీ క్యాంపు నడుస్తున్నట్లు పోలీస్ అధికారులకు విశ్వసనీయ సమాచారం తెలిసింది. ఈ మేరకు ఎస్పీ మోహిత్‌గర్గ్ నేతృత్వంలో రిజర్వు గార్డ్ (డీఆర్జీ) భద్రతా బలగాలు ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమర్క- దుర్బేడ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు.

దీంతో వెంటనే జవాన్లు సైతం ఎదురు కాల్పులకు దిగారు. జవాన్లు వేగాన్ని పెంచుతూ ముందుకు వెళుతున్న క్రమంలో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు పక్కనే ఉన్న దట్టమైన అడవుల్లోకి కాల్పులు జరుపుతూనే పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నర పాటు భీకరపోరు జరిగింది. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసి గాలింపు చేపట్టారు. ఘటన స్థలంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఐదు తుపాకులు, మావోయిస్టులకు సంబంధించిన భారీ ఎత్తున కిట్ బ్యాగులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ డీఎం అవస్థీ వెల్లడించారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు సైతం గాయపడ్డారని, వారిని మెరుగైన చికిత్స అందించామని ప్రస్తుతం వారి పరిస్థితి స్థిమితంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను నారాయణ్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్లకు తరలిస్తున్నామని, వారికి సంబంధించిన పేర్లు, వివరాలను విచారణ జరిపి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles