రాఫెల్ డీల్‌పై ద‌ర్యాప్తు జ‌రిగితే, మోదీ దొరికిపోతాడు

Fri,November 2, 2018 01:05 PM

If an enquiry starts on Rafale scam, Modi wont survive that enquiry, says Rahul Gandhi

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో భారీ స్కామ్ జ‌రిగింద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయ‌న మాట్లాడారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ప్ర‌ధాని మోదీనే నిర్ణ‌యం తీసుకున్నార‌ని, రాఫెల్ డీల్‌తో త‌న‌కు సంబంధంలేద‌ని అప్ప‌టి ర‌క్ష‌ణ మంత్రి పారిక‌ర్ పేర్కొన్నార‌ని, రాఫెల్ ఒప్పందంపై ద‌ర్యాప్తు చేప‌డితే, ఆ విచార‌ణ‌లో మోదీ దొరికిపోతార‌ని రాహుల్ అన్నారు. రాఫెల్ స్కామ్‌లో విచార‌ణ ఎదుర్కొనేందుకు మోదీ భ‌య‌ప‌డుతున్నార‌ని, అందుకే ఆయ‌న సీబీఐ డైర‌క్ట‌ర్‌ను తొల‌గించార‌ని ఆరోపించారు. ప్ర‌ధాని మోదీకి రాత్రి పూట నిద్ర రావ‌డం లేద‌ని, ద‌ర్యాప్తులో దొరికిపోతానేమో అన్న టెన్ష‌న్‌లో ఉన్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. రాఫెల్ కొనుగోలుపై ద‌ర్యాప్తు జ‌రిగితే మోదీ దాన్ని ఎదుర్కోలేర‌ని గ్యారెంటీ ఇస్తున్న‌ట్లు రాహుల్ అన్నారు.అనిల్ అంబానీ వ‌ద్ద భూమి ఉన్నందునే రాఫెల్ డీల్‌ను ఆ సంస్థ‌కు క‌ట్ట‌బెట్టామ‌ని, అందుకే హిందుస్తాన్ సంస్థ‌కు ఒప్పందాన్ని ఇవ్వ‌లేద‌ని డ‌సాల్ట్ సీఈవో అన్నార‌ని, కానీ ఇందులో వాస్త‌వం లేద‌ని, డ‌సాల్ట్ ఇచ్చిన డ‌బ్బుల‌తోనే రిల‌య‌న్స్ సంస్థ త‌మ డిఫెన్స్ ప్రాజెక్టు కోసం భూమి కొనుగోలు చేసింద‌ని రాహుల్ అన్నారు. డ‌సాల్ట్ కంపెనీ ఎన్నో ముడుపులు చెల్లించింద‌ని, అందులో ఇదొక‌ట‌ని రాహుల్ తెలిపారు. రాఫెల్ డీల్‌పై సీబీఐ న‌జ‌ర్ ప‌డింద‌ని, అందుకే ఆ డైరక్ట‌ర్‌ను తొల‌గించార‌న్నారు. అనిల్ అంబానీకి అనుకూలంగా మాట్లాడేందుకు ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫ్రాన్స్‌లోని డ‌సాల్ట్ కంపెనీకి వెళ్లింద‌న్నారు.

సుప్రీంకోర్టు కూడా రాఫెల్ ధ‌ర గురించి వెల్ల‌డించాల‌ని కోరినా, కేంద్రం మాత్రం వాటి ఖ‌రీదు చెప్ప‌లేను అని పేర్కొన‌డం శోచ‌నీయ‌మ‌ని రాహుల్ అన్నారు. అంటే ఆ ఒప్పందంలో స్కామ్ జ‌రిగింద‌ని రాహుల్ అన్నారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుంద‌ని, అందులో మొద‌టి ద‌ఫాగా 284 కోట్లు ముట్టాయ‌ని అన్నారు. ఆ డ‌బ్బుతోనే రిల‌య‌న్స్ సంస్థ డిఫెన్స్ ప్రాజెక్టు కోసం భూమి కొంద‌న్నారు. రిల‌య‌న్స్ కోసం డ‌సాల్ట్ 284 కోట్లు ఇచ్చింద‌ని, ఫ్రాన్స్ కంపెనీ ఆ డ‌బ్బు ఎందుకు ఇచ్చిందో చెప్పాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు.

1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles